కీలకమైన ప్రశ్న

22 Jul, 2015 00:19 IST|Sakshi
కీలకమైన ప్రశ్న

సందేహం రాకుండా పోవాలిగానీ వచ్చిందంటే చాలా యాతనే. అది తీరే దాకా సమస్యే. మూడేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో బాలిక ఐశ్వర్య మహాత్మ గాంధీకి ‘జాతిపిత’ పురస్కారాన్ని ఎవరిచ్చారని సందేహం వ్యక్తంచేసింది. అది ఎవరూ ఇచ్చిందికాదని... వ్యవహారికంలో ఎప్పుడు చేరిందో ఎవరికీ తెలియదని ‘అధికారికం’గా వెల్లడైంది. అప్పటికామెకు పదేళ్ల వయసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఎలా చూడాలన్న సందేహం చర్చలోకి వచ్చింది.

ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పరిగణించాలా లేక భారత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించవచ్చునా అనేది ఆ సందేహం సారాంశం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ సందేహాన్ని వ్యక్తంచేశారు. చూడటానికి రెండింటిమధ్యా పెద్ద తేడా ఏముందని పిస్తుంది. కానీ ఇది సాధారణమైన సమస్య కాదని తరచి చూస్తే అర్థమవుతుంది.

మన రాజ్యాంగంలోని 124వ అధికరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ‘భారత ప్రధాన న్యాయమూర్తి’గా పేర్కొంటున్నది. వివిధ పదవులకు ప్రమాణ స్వీకారం చేసే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని మూడో  షెడ్యూల్ మాత్రం ఆ పదవిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తావించింది. న్యాయమూర్తి ప్రస్తావించేవరకూ ఈ వ్యత్యాసం సంగతే ఎవరి దృష్టికీ రాలేదని విచారణ సందర్భంగా జరిగిన సంభాషణను గమనిస్తే తెలుస్తుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అయినా, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అయినా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేకపోయారు. ఈ సమస్యగురించి ఆలోచించవలసి ఉన్నదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో నియమితులయ్యే వారు ఎలాంటి పదవీ స్వీకార ప్రమాణం చేయాలో విడిగా ఉన్నాయి. 60వ అధికరణ రాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా, 69వ అధికరణ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా సవివరంగా తెలిపాయి. 124వ అధికరణ భారత ప్రధాన న్యాయమూర్తి గురించి ప్రస్తావించినా ప్రమాణస్వీకారం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇతరుల గురించి కూడా ప్రస్తావించే మూడో షెడ్యూల్‌లో చేర్చారు. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఇన్ని దశాబ్దాల్లో న్యాయవ్యవస్థలో ఎందరో పనిచేశారు.  ప్రపంచ ప్రఖ్యాతి చెందిన న్యాయకోవిదులున్నారు. అయినా ఇలాంటి సందేహం ఎవరికీ ఇన్నేళ్లుగా కలగలేదంటే ఆశ్చర్యమనిసిస్తుంది.

మన రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులు అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. వివిధ పదవులకు సంబంధించిన హోదాలు, అధికారాలు... ఆ పదవుల్లో ఉండేవారి పరిధులు వగైరాలన్నీ నిర్దిష్టంగా ఉన్నాయి. ఆ పదవుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన నియమనిబంధనలను జాగ్రత్తగా పొందుపరిచారు. అయితే, ఎంత చేసినా ఏవో లోటుపాట్లు ఉండకతప్పదు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు కావొచ్చు...తలెత్తే కొత్త సమస్యలు కావొచ్చు... ఉన్న సమస్యలే కొత్త పరిష్కారాలను కోరడంవల్ల కావొచ్చు-అలాంటివాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. ఇప్పుడు జస్టిస్ జోసెఫ్ లేవనెత్తిన సమస్యపై కూడా విస్తృత చర్చ జరిగి, అవసరమైతే రాజ్యాంగంలో ఆ మేరకు మార్పులు చేయక తప్పదు.

అయితే, న్యాయమూర్తి వ్యక్తం చేసిన సందేహం ఆసక్తికరమైనదే తప్ప అంత అవసరమైనది కాకపోవచ్చునని సాధారణ పౌరులకు అనిపిస్తుంది. ఆ పదవి గురించిన ప్రస్తావనలో ఉన్న తేడావల్ల ఆచరణలో తలెత్తే ఇబ్బంది ఏముంటుందని పిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సందేహం కీలకమైనది. న్యాయమూర్తుల ఎంపిక కోసం ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న కొలీజియం స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎన్‌జేఏసీ ఏర్పడిన నేపథ్యంలో ఇది ముఖ్యమైనది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్న నిబంధన ఉంది. రాజ్యాంగంలోని 217వ అధికరణ ఆ సంగతిని సవివరంగా ప్రస్తావించింది.

అయితే, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తిని సరిగా అమలు చేయడంలేదని, సుప్రీంకోర్టు పాత్ర అందులో ఉండటం లేదని భావించిన జస్టిస్ జేఎస్ వర్మ 1993లో ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుండే కొలీజియం వ్యవస్థ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. 1998లో మరో తీర్పు ద్వారా ఇది అయిదుగురు సభ్యుల కొలీజియంగా మారింది. ఈ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే విధానంగా మారిందని అంటూ ఎన్డీయే సర్కారు ఎన్‌జేఏసీ చట్టం తీసుకొచ్చింది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తులిద్దరూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, మరో ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారని చట్టం చెబుతున్నది.

రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ రీత్యా చూస్తే ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిగిలిన సభ్యులతో సమానమవుతారు. 124వ అధికరణ అయినా, 217వ అధికరణ అయినా రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని న్యాయవ్యవస్థ పెద్దగా, ప్రతినిధిగా చూస్తున్నది. కానీ, ఎన్‌జేఏసీ ఆ పాత్రను కుదిస్తున్నది. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను పరిమితం చేస్తున్నది. కనుక రెండింటిమధ్యా ఉన్న వ్యత్యాసాన్ని, అందువల్ల ఏర్పడిన అయోమయాన్ని పోగొట్టాలన్నది జస్టిస్ జోసెఫ్ సంధించిన ప్రశ్నలోని అంతరార్ధం కావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా పారదర్శకంగా పనిచేసినప్పుడే అర్ధవంతంగా ఉంటుంది. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అందరూ కోరుకునేది అందుకే. అది జరగడానికి ముందు రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాముఖ్యత, పాత్ర ఏమిటన్నది కూడా తేలడం కూడా అవసరమే.

మరిన్ని వార్తలు