టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!

15 Nov, 2023 04:24 IST|Sakshi
టెస్లా ప్లాంట్‌ సందర్శనలో కారును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ 

భారత్‌ నుంచి రెట్టింపు...

కేంద్ర మంత్రి గోయల్‌ వెల్లడి

అమెరికాలో కంపెనీ ప్లాంటు సందర్శన

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్‌ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ కలవలేకపోయారు.

 ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్‌ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్‌ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది.

మస్క్‌ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఎక్స్‌లో గోయల్‌ ట్వీట్‌ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్‌ ట్వీట్‌ చేశారు. టెస్లా 2022లో భారత్‌ నుంచి 1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్‌ ఇటీవలే తెలిపారు.  

పరిశీలనలో మినహాయింపులు.. 
టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్‌ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్‌ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని  మోదీతో మస్క్‌ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు