Second Hand Clothing In Africa: పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్‌!

23 Sep, 2023 05:12 IST|Sakshi

ఆఫ్రికా ఖండాన్ని ముంచెత్తుతున్న సెకెండ్‌ హ్యాండ్‌ దుస్తులు

ఎక్కువగా అమెరికా,యూరప్, చైనా నుంచి దిగుమతి 

2021లో దిగుమతి విలువ 1,841 మిలియన్‌ డాలర్లు 

దిగుమతి చేసుకున్న దుస్తుల్లో 50 శాతం పైగా పనికిరానివే 

అగ్ర దేశాలు వదిలించుకున్న దుస్తులతో ఆఫ్రికాకు ముప్పు 

నేల, నదులు, సముద్రాలు, అడవులు కాలుష్య మయం

సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్‌. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్‌ హ్యాండ్‌ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 
50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. 

ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్‌ హ్యాండ్‌ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్‌ కాంటినెంటల్‌ ఫ్రీ ట్రేడ్‌ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్‌ హ్యాండ్‌ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.  

లక్షల టన్నుల్లో దిగుమతి 
ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్‌ (అరబ్‌ సంస్కృతి గల దేశాలు), సబ్‌ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్‌ దేశాల్లో సెకండ్‌ హ్యాండ్‌ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్‌ డాలర్లు కాగా, సబ్‌ సహారాలో 1,734 మిలియన్‌ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్‌ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్‌ ఏటా లక్ష టన్నుల సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి.

పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్‌ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్‌ హ్యాండ్‌ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్‌ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమి­లో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నా­యని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా­రు.

‘ట్రాషన్‌: ది స్టెల్త్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ వేస్ట్‌ ప్లాస్టిక్‌ క్లాత్స్‌ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్‌ హ్యాండ్‌ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల న­దు­లు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్‌ హ్యాండ్‌ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం.

ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం
పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్‌ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్‌ హ్యాండ్‌ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్‌. ఆ దేశం నుంచి 14 మిలియన్‌ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగు­మతి చేస్తుండగా, యూరోపియన్‌ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్‌ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి.   

  • ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్‌ హ్యాండ్‌ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి.   
  • సెకెండ్‌హ్యాండ్‌ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్‌ హ్యాండ్‌ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ము­ఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్‌ హ్యాండ్‌ దుస్తు­లను కొనుగోలు చేస్తున్నాయని అంచనా.  
  • పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది.  
  • గ్రీన్‌పీస్‌ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్‌ హ్యాండ్‌ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు.  
మరిన్ని వార్తలు