గూర్ఖాల ఆగ్రహం

15 Jun, 2017 01:35 IST|Sakshi
గూర్ఖాల ఆగ్రహం

ఇది ఆధిపత్యాలను ప్రశ్నించే కాలం. అవతలివారి మనోభావాలతో, ఆకాంక్షలతో సంబంధం లేకుండా చిత్తానుసారం పెత్తనం చలాయిస్తామంటే జనం సహించే పరిస్థితి లేదు. సామాజిక మాధ్యమాల ప్రభావం విస్తరించడంవల్ల కావొచ్చు... రాజకీయ చైతన్యం పెరుగుతోంది. ప్రజలు దేన్నయినా నిలదీస్తున్నారు. తమ అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ బాహాటంగా వ్యక్తంచేస్తున్నారు. ఈ సంగతి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియదనుకోలేం. అధికార భాషపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు నెలలక్రితం హిందీ అమలుకు సంబంధించి చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదించినప్పుడు తీవ్రంగా వ్యతి రేకించినవారిలో ఆమె కూడా ఉన్నారు. కానీ తమ రాష్ట్రం వరకూ వచ్చేసరికి అచ్చం ఆ మాదిరే వ్యవహరించి ప్రశాంతంగా ఉన్న బెంగాల్‌ ఉత్తరభాగంలోని డార్జిలింగ్‌ కొండ ప్రాంతాల్లో చిచ్చుపెట్టారు. డార్జిలింగ్‌తోసహా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పదో తరగతి వరకూ బెంగాలీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వెనువెంటనే గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో ఉద్యమం రాజుకుంది. దాన్ని చల్లార్చే ఉద్దేశంతో మమత ఆ నగరంలో రాష్ట్ర కేబినెట్‌ భేటీ ఏర్పాటు చేస్తే వీధులన్నీ రణరంగాన్ని తలపించాయి. వేలాదిమంది ఉద్యమకారులు ఒక ప్రభుత్వ కార్యా లయానికి నిప్పుపెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. వేలాదిమంది టూరిస్టులు ప్రాణాలు అరచేతబట్టుకుని అక్కడినుంచి రావాల్సివచ్చింది. చివరకు పారా మిలిటరీ దళాలు రంగప్రవేశం చేశాయి. సోమ వారం నుంచి నిరవధిక బంద్‌ మొదలైంది.

దాదాపు 14 లక్షలమంది జనాభా గల డార్జిలింగ్‌ కొండ ప్రాంతాల్లో అత్యధికులు నేపాలీ భాష మాట్లాడతారు. భిన్న సంస్కృతి, భాష ఉన్న తమపై ‘బయటి వ్యక్తుల’ పెత్తనం సహించబోమని వందేళ్లక్రితమే అప్పటి బ్రిటిష్‌ పాలకులకు గూర్ఖాలు తేల్చిచెప్పారు. పాలనలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించడానికుద్దేశించిన మింటో–మార్లే కమిటీకి 1907లోనే కొండ ప్రాంతవాసుల పేరిట ఇందుకు సంబం ధించిన వినతిపత్రాన్నిచ్చారు. అనంతరకాలంలో సైతం ఆ డిమాండు వినిపిస్తూనే ఉంది. ఆ సమస్యపై రాజ్యాంగ నిర్ణాయక సభలో సైతం చర్చ జరిగింది. డార్జిలింగ్, సిక్కిం ప్రాంతాలతో ప్రత్యేక డార్జిలింగ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1947లో ఆనాటి కమ్యూనిస్టు పార్టీ కోరింది. 80వ దశకం చివరిలో సుభాష్‌ ఘీషింగ్‌ ఆధ్వర్యాన గూర్ఖా నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(జీఎన్‌ఎల్‌ఎఫ్‌) ఏర్పడి ఉద్యమం ప్రారంభించింది.

అది ఉధృతరూపం దాల్చి హింస చెలరేగాక డార్జిలింగ్‌ జిల్లా ప్రాంతానికి గూర్ఖా కొండప్రాంత మండలిని 1988లో ఏర్పాటుచేశారు. 2011లో జీజేఎం చేసిన పోరాట ఫలితంగా అది గూర్ఖాలాండ్‌ ప్రాదేశిక పాలనాసంస్థ(జీటీఏ)గా మారింది. డార్జిలింగ్‌ ప్రాంతానికి సంబంధించిన ఏ అంశంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం జీటీఏను సంప్ర దించాల్సి ఉంటుంది. బెంగాలీ భాషను తప్పనిసరి చేసే అంశంలో మమత ఆ పని చేయలేదు. డార్జిలింగ్‌ ప్రాంతంలో బెంగాలీని రుద్దే ఉద్దేశం లేదని, అక్కడ యధా విధిగా నేపాలీ భాషే కొనసాగుతుందని మమత వివరణ ఇవ్వకపోలేదు. కానీ అప్ప టికే ఆలస్యమైంది.

నిజానికి భాషా సమస్య తక్షణ ఆగ్రహావేశాలకు కారణం కావొచ్చుగానీ అదే మూల కారణం కాదు. డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలను గత కొన్నేళ్లుగా వేధిస్తున్న అనేకానేక సమస్యలపై జనంలో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి ఆ రూపంలో పెల్లుబికింది. వీటికితోడు జీజేఎంకూ, మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య దూరం పెరగడం, చివరికి అవి శత్రుపక్షాలుగా మారడం వల్ల కూడా ఆ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. తమను దెబ్బతీసే ఉద్దేశంతో గూర్ఖాలాండ్‌ అభి వృద్ధిని అడ్డుకుంటున్నారని జీజేఎం ఆరోపిస్తుంటే... సమృద్ధిగా నిధులిచ్చింది తానే నని మమత చెబుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌–జీజేఎంల మధ్య ఆరేళ్లక్రితం చెలిమి ఏర్పడినప్పుడు ప్రత్యేక గూర్ఖాలాండ్‌కు తాను అనుకూలమని మమత ప్రకటించారు. కానీ అధికారంలోకొచ్చాక దాని సంగతి ఎత్తడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో డార్జిలింగ్‌ స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి ఎస్‌ఎస్‌ అహ్లూ వాలియాకు జీజేఎం మద్దతిచ్చి ఆయనను గెలిపించింది. అప్పటినుంచీ తృణ మూల్‌–జీజేఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగుతున్నాయి. జీజేఎంను బలహీ నపర్చడం కోసం డార్జిలింగ్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను విడగొట్టి మమత ప్రభుత్వం కలింపాంగ్‌ జిల్లానూ, కలింపాంగ్‌ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న జీజేఎం బెంగాలీ భాషపై తీసుకున్న నిర్ణయాన్ని ఆసరా చేసుకుని ఉద్యమం లేవనెత్తింది.

డార్జిలింగ్‌ కొండ ప్రాంతాలు నిజంగా అభివృద్ధి చెంది ఉంటే, అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభించి ఉంటే ఇదంతా టీఎంసీ–జీజేఎం తగువుగా మిగి లిపోయేది. కానీ ఉత్తరప్రాంత బెంగాల్‌ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యం. ప్రారంభించిన ఎన్నో ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఆ ప్రాంతంలో టీ ఎస్టేట్లు అధికం. అవి సక్రమంగా పనిచేస్తే ఉపాధికి లోటుండదు. కానీ ఆ టీ ఎస్టేట్లు నానాటికీ కుంచించుకుపోతున్నాయి. కొన్ని మూతబడుతున్నాయి. చేతినిండా పని ఉన్నచోట కూడా వేతనాలు అంతంతమాత్రం. పర్యవసానంగా వేలాది కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. వీటన్నిటినీ పట్టించుకోవడానికి బదులు జీజేఎంను ఎలా బలహీనపర్చాలా అన్న అంశంపైనే మమత దృష్టి కేంద్రీకరించారు. డార్జిలింగ్‌ కొండ ప్రాంత సమస్యలపై నిజంగా అవగాహన ఉండి ఉంటే ఆమె బెంగాలీ భాషను రుద్దడం మాట అటుంచి కొత్త జిల్లా ఏర్పాటు యోచనే చేసి ఉండేవారు కాదు. ఇప్పుడు ఆ ప్రాంతమంటే తనకు ప్రత్యేకాభిమానమని చాటుకోవడం కోసం డార్జి లింగ్‌లో కేబినెట్‌ సమావేశాన్ని జరిపారు. మౌలిక సమస్యల పరిష్కారానికి కనీస ప్రయత్నం చేయనప్పుడు ఇలాంటివి పెద్దగా అక్కరకు రావు. ఇప్పటికైనా రాజకీయా లకు అతీతంగా ఆ ప్రాంత అభివృద్ధికి మమత ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. దానికి మించి ప్రత్యేక గూర్ఖాలాండ్‌ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి.


 

మరిన్ని వార్తలు