విపక్ష నేతలందరి అరెస్టుకు కుట్ర: మమతా బెనర్జీ

1 Nov, 2023 21:10 IST|Sakshi

 కోల్‌కతా: బీజేపీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సీనియర్ ప్రతిపక్ష నాయకులను బీజేపీ అరెస్టు చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు. ఆ తర్వాత ఖాళీ దేశంలో వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రతిపక్ష నాయకుల ఫోన్‌లను కూడా బీజేపీ హ్యాక్ చేసిందని దీదీ ఆరోపించారు. 

“వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే బీజేపీ ప్రతిపక్ష పార్టీల నోరు మూయడానికి ప్రయత్నిస్తోంది. బీజేపీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయాలని ప్రణాళిక చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నికల్లో లాభపడాలని చూస్తున్నారు" అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ ఆరోపించారు.

దేశ రాజధానిలో మద్యం పాలసీ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత గురువారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను, మంత్రి అతిషిని నవంబర్ 2న అరెస్టు చేయనున్నారని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు.

అటు.. టీఎంసీ నాయకుల చుట్టూ కూడా ఈడీ ఉచ్చు బిగుస్తోంది. రేషన్ పంపిణీ కుంభకోణంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ గత వారం అరెస్టయ్యారు. ఇండియా కూటమి నేతలే లక్ష‍్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని దీదీ ఆరోపించారు.

ఇదీ చదవండి:  మరాఠా రిజర్వేషన్‌కు అనుకూలమే: ఏక్‌నాథ్ షిండే

 

మరిన్ని వార్తలు