ప్రపంచ ‘యోగ’o!

22 Jun, 2015 13:24 IST|Sakshi
ప్రపంచ ‘యోగ’o!

అక్కడక్కడ వినబడిన అసమ్మతి స్వరాలను బేఖాతరు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. దేశ రాజధానిలోని రాజపథ్ యోగా పథ్‌గా మారింది. ఎత్తయిన సరిహద్దు ప్రాంతం సియాచిన్ మంచుపర్వత శ్రేణి మొదలుకొని సముద్ర జలాల్లోని యుద్ధ నౌకల వరకూ అనేకం యోగాసనాల వేదికలయ్యాయి. జీవనశైలిలో పెరిగిన వేగం కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిళ్లవల్ల పలు రుగ్మతల బారిన పడుతున్న వారికి ఉపశమనం కలిగించే...స్వస్థత చేకూర్చే ఈ ప్రక్రియను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని మన దేశం చేసిన ప్రతిపాదనకు నిరుడు సెప్టెంబర్‌లో ఐక్య రాజ్యసమితిలోని మెజారిటీ సభ్యదేశాలు ఆమోదం తెలపడంతో ఇది సుసాధ్య మైంది. ఒక దేశం చేసిన ప్రతిపాదనలో 177 దేశాలు సహభాగస్తులు కావడం అదే తొలిసారి. అందులో అఫ్ఘాన్, టర్కీ, ఇరాన్, ఇండొనేసియా, ఖతార్, ఒమన్‌వంటి 47 ఇస్లామిక్ దేశాలు కూడా ఉండటం మరో అపురూప దృశ్యం. దేనికైనా హర్షామోదాలు లభించినట్టే శంకలూ, సందేహాలూ కూడా తప్పవు.

పాకిస్థాన్, సౌదీ అరేబియా, బ్రూనీ, లిబియా వంటి ముస్లిం దేశాలు మాత్రమే కాదు...ఉత్తర కొరియా, స్విట్జర్లాండ్, మొనాకో వంటి ముస్లిమేతర దేశాలు కూడా యోగాను అనుమాన దృక్కులతో చూశాయి. ఇందులో వింతేమీ లేదు. సింధు నాగరికత చరిత్రతో పెనవేసుకుని అయిదువేల ఏళ్లుగా హిందూ మతంతో, సంప్రదాయంతో, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న యోగాను వాటికి దూరంగా చూడటం అంత సుల భం కూడా కాదు. అయితే, పాశ్చాత్య ప్రపంచం యోగాలోని ఆసనాలను ప్రధా నంగా తీసుకుని ఫిట్‌నెస్ సాధించడానికి తోడ్పడే వ్యాయామంగా రూపాంతరం చెందించి చాన్నాళ్లయింది. ప్రాచీన గ్రీకు నాగరికత కూడా దీన్ని అంతశ్శక్తులను పునరుజ్జీవింప చేసుకోవడానికి తోడ్పడే ప్రక్రియగా భావించింది. అందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పెట్టినప్పుడు అత్యధిక దేశాలనుంచి సానుకూలత వ్యక్తమైంది.
 
ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదిక ఏ మతానికో, విశ్వాసానికో అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర లేదు గనుక అది ఆమోదించిన ప్రక్రియకు అలాంటివాటిని అంటగ ట్టడం సరైంది కాదని ప్రగాఢంగా నమ్మినవారున్నారు. పురాతనకాలంనుంచీ మానవాళి అనుసరించి లబ్ధిపొందుతున్న ఈ ప్రక్రియ... ఐక్య రాజ్యసమితి విశ్వసిస్తున్న సిద్ధాంతాల్లో, విలువల్లో స్వాభావికంగా ఇముడు తుందని భావిస్తున్నట్టు సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తన ప్రసంగంలో అన్నారు గనుక అందుకు భిన్నంగా ఆలోచించరాదని భావించినవారున్నారు. వేల ఏళ్ల మనుగడలో మానవాళి సమష్టిగా సాధించిన జ్ఞానంలో యోగా కూడా ఒక భాగమని... దాన్ని ఏ మతానికో, సమూహాలకో ముడిపెట్టడం తగదని చెప్పిన వారున్నారు. అయితే, ఏదైనా పుట్టింది పుట్టినట్టుగానే ఉండిపోదు.
 
ఆచరణలో అనేక రూపాంతరాలు చెందుతుంది. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా మారుతుంది. అనుసరించేవారికుండే విశ్వాసాల ప్రభావానికి లోనవుతుంది. ఈ క్రమంలో తానే ఒక విశ్వాసంగా మారుతుంది. అలా మారినప్పుడు దాన్ని విడదీసి చూడటం, దాని మౌలిక రూపాన్ని దర్శించడం...ఆ ప్రక్రియవల్ల సమకూరే ప్రయోజనాలను గుర్తించడం కాస్త కష్టమే. పైగా...యోగా అంటే ఇష్టంలేనివారు ‘హిందుస్థాన్’ను వదిలి వెళ్లొచ్చునని బీజేపీ ఎంపీ మహంత్ యోగి ఆదిత్యనాథ్... ఇది హిందువులకు మాత్రమే సంబంధించిందని ప్రవీణ్ తొగాడియా వంటివారు అన్న తర్వాత ఇక వేరే ఆలోచనలకు తావుండదు. అందుకే సూర్య నమస్కారాలను కొందరు ‘సూర్య ప్రార్థన’గా అర్థంచేసుకుని యోగా దినోత్సవానికి దూరంగా ఉండిపోయారు. సొంత ఎజెండా ఉన్నవారి చేతుల్లో పడితే... ఎలాంటి మంచి కార్యక్రమమైనా ఏ రూపం తీసుకుంటుందో, ఎలాంటి పర్యవసానాలకు దారి తీస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. అనవసర పట్టింపులూ, ఉద్రేకపూరిత ప్రసంగాలు దృష్టిని మసకబారుస్తాయి.
 
ఇప్పుడు మన దేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ అనుసరిస్తున్న అనేకానేక యోగా రూపాల వెనక ఎందరెందరో చేసిన కృషి ఉంది. కేవలం కొంతమంది వ్యక్తు లకు పరిమితమైపోయి ఎవరూ దృష్టి సారించనప్పుడు 1904లో పదహారేళ్ల వయ సులో తిరుమలై కృష్ణమాచార్య యోగాను ఆశ్వాసించి, అందులో మునిగి తేలడమే కాదు...దాన్ని ఇప్పటి ఆధునిక రూపానికి తీసుకొచ్చారు. అనంతరకాలంలో పట్టాభిజోయిస్, ఇంద్రాదేవి, బీకేఎస్ అయ్యంగార్‌లను అందులో నిష్ణాతులను చేశారు.  వీరిలో అయ్యంగార్ వ్యక్తిగా చేసిన కృషి అసాధారణమైనది.
 
యోగాకు ఎలాంటి మతపరమైన భావనలూ అంటించకుండా దేశ, విదేశాల్లో దాన్ని ఎందరికో అందించిన ఖ్యాతి ఆయనకు దక్కుతుంది. ఆయన స్థాపించిన యోగ విద్యా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వంద శాఖలున్నాయంటే అయ్యంగార్ కృషి ఎంత గొప్పదో తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో, మన పొరుగునున్న చైనాలో అయ్యంగార్ పేరు తెలియనివారు ఉండరంటారు. 60వ దశకంలో సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడు యెహుదీ మెనూహిన్, విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తివంటివారికి దాన్ని నేర్పించి, వారిద్వారా పాశ్చాత్య ప్రపంచానికి ఆయన పరిచయమయ్యారు. యోగా అనేది మన ‘సాఫ్ట్ పవర్’ అయిన పక్షంలో దాన్ని దశాబ్దాల క్రితమే ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.
 
నిరంతరం అభిమానించి, ప్రేమించాల్సిన వారి కోసం పాశ్చాత్యులు కొన్ని రోజులను కేటాయించడంపై మన దగ్గర చాలామందికి అభ్యంతరం ఉంటుంది. ఫాదర్స్ డే, మదర్స్ డే వంటివాటిని అందుకే వ్యతిరేకిస్తారు. అలా చూస్తే యోగా కోసం ఒక రోజును కేటాయించడమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. కులమతాలకూ, ప్రాంతాలకూ, విశ్వాసాలకూ అతీతంగా అందరూ నిత్యమూ పాటించాల్సిన ఆ అపురూప ప్రక్రియను కొన్ని పరిమితుల్లో ఆలోచించడం సరైందేనా అన్న సందేహం వెలిబుచ్చేవారున్నారు. మిగిలిన పర్వదినాల్లోని అంతరార్థంలాగే యోగా దినోత్సవం వెనుకా ఒక ప్రయోజనం ఉంది. యాంత్రిక జీవనశైలిలో పడి కొట్టుకుపోతున్నవారికి ఆలంబనగా నిలిచి వారిని ఆరోగ్యవంతులుగా మార్చడమే దాని పరమార్థం. అందుకుని నిత్యమూ ఆచరించి లబ్ధిపొందడమా... శంకించి దూరం జరగడమా అన్నది మన చేతుల్లో ఉంది.

>
మరిన్ని వార్తలు