Reason For Game Changer Postponed: 'గేమ్‌ ఛేంజర్' వాయిదా.. అదే అసలు కారణం?

26 Dec, 2023 00:03 IST|Sakshi
‘దిల్‌’రాజు, రామాచారి

'దిల్‌' రాజు

‘‘ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ, ఈగల్, హనుమాన్‌’ తదితర సినిమాలు విడుదల కానున్నాయి. ఐదుగురు నిర్మాతలనూ పిలిచి మాట్లాడాం. రెండు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని సూచించాం. సంక్రాంతి పోటీలో ఉండకూడదని నా సినిమా ‘గేమ్‌ ఛేంజర్’ను వేసవికి వాయిదా వేశాం. ఎవరైనా రిలీజ్‌ వాయిదా వేసుకుంటే.. సోలో రిలీజ్‌ చేసేలా ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తరఫున చర్యలు తీసుకుంటాం’’ అని నిర్మాత దిల్‌ రాజు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జనవరి 21న ‘లిటిల్‌ మ్యుజిషియన్స్ అకాడమీ’ సిల్వర్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది.

ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ‘దిల్‌’ రాజు సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడారు. లిటిల్‌ మ్యుజిషియన్స్ అకాడమీ గురు రామాచారి మాట్లాడుతూ– ‘‘దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆశీస్సులతో 1999లోప్రారంభమైన ఈ అకాడమీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సిల్వర్‌ జూబ్లీ ఉత్సవానికి సారథ్యం వహించాలని డైరెక్టర్‌ రాఘవేంద్రరావు, నిర్మాత ‘దిల్‌’ రాజుగార్లను కోరగానే ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘దిల్‌’ నుంచి రామాచారిగారితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో ‘లిటిల్‌ మ్యుజిషియన్స్‌ అకాడమీ’ గురించి చెప్పారాయన. ఈ అకాడమీలో ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నారు. అద్దె భవనంలో ఉన్న అకాడమీకి ప్రభుత్వం తరఫున సాయం వచ్చేలా చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు.

>
మరిన్ని వార్తలు