ఏపీ హిస్టరీ

14 Sep, 2013 23:07 IST|Sakshi
ఏపీ హిస్టరీ


 రుద్రమదేవి(క్రీ.శ.1259 -1295)
 
 ఆంధ్రదేశ చరిత్రలో రాజ్యమేలిన ప్రథమ మహిళగా రాణీ రుద్రమదేవి చరిత్రకెక్కింది. ఈమె పరిపాలనా కాలంలోనే వెనీస్ దేశ యాత్రికుడు మార్కోపోలో ఆంధ్రదేశాన్ని సందర్శించాడు. రుద్రమదేవి వివాహం గురించి జుత్తిగ శాసనం, త్రిపురాంతక శాసనాల ద్వారా తెలుస్తోంది. రుద్రమదేవికి క్రీ.శ. 1259లో పట్టాభిషేకం జరిగినట్లు త్రిపురాంతకం శాసనం వెల్లడిస్తోంది. రుద్రమదేవి తన దాయాదుల నుంచి దాడులను ఎదుర్కొంది. రుద్రమకు రేచర్ల ప్రసాదిత్య నాయకుడు, మహా ప్రధాని, కన్నరదేవుడు, కాయస్థ జన్నిగదేవుడు, విరియాల సూరన, రుద్ర నాయకుడు మొదలైనవారు అండగా నిలిచారు. రేచర్ల ప్రసాదిత్యుడికి (పద్మనాయకుడు) కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంది. ఈ విషయాన్ని పద్మనాయక వెలమల చరిత్రను తెలిపే వెలుగోటి వారి వంశావళి వెల్లడిస్తోంది. రుద్రమదేవి చేతిలో యాదవరాజైన మహాదేవుడు ఓడిపోయాడు. ఈమె కళింగరాజైన వీరభానుదేవుడిని ఓడించింది. రుద్రమదేవికి, కాయస్థ అంబదేవుడు ప్రధాన శత్రువు. ఇతడితో పోరాడి ఆమె వీరమరణం పొందినట్లు చందుపట్ల శాసనం చెబుతోంది. రుద్రమకు  ఫటోధృతి అనే బిరుదు ఉంది. ఈమెకు ముమ్మిడమ్మ, రుయ్యమ్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రుద్రమదేవికి పుత్ర సంతానం లేదు. పెద్ద కుమార్తె ముమ్మిడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడిని రుద్రమ దత్తత తీసుకొని కాకతీయ రాజ్యానికి వారసుడిగా ప్రకటించింది. రెండో కుమార్తె రుయ్యమ్మను బ్రాహ్మణుడైన ఇందులూరి అన్నయ మంత్రికిచ్చి వివాహం చేసింది.
 
 ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1295-1323
 కాకతీయ మహాదేవరాజు, ముమ్మిడమ్మ దంపతులకు జన్మించిన ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1295లో రాజ్యానికొచ్చాడు. ఇతడిని రెండో ప్రతాపరుద్రుడని పిలుస్తారు. ప్రతాపరుద్రుడు కాయస్థ అంబదేవుడిని ఓడించిన ధీశాలి. ప్రతాప రుద్రుడికి మారురాయడగండ, వీరరుద్రానగండ అనే బిరుదులున్నాయి. ప్రతాపరుద్రుడి చరిత్ర ప్రకారం ఇతడి భార్య విశాలాక్షి. ప్రతాపుడి కాలంలో మాచల్దేవి అనే వారవనిత సాహిత్య గోష్టుల్లో పాల్గొనేదని క్రీడాభిరామం పేర్కొంది. కాకతీయ రాజ్యంపై దాడి చేసిన, మొదటి ఢిల్లీ సుల్తానత్ వంశం ఖిల్జీ వంశం. ఆంధ్రదేశంపై మొదటిసారిగా మహ్మదీయులు ప్రతాపరుద్రుడి కాలంలోనే దండయాత్రలు చేశారు. మొట్టమొదటి ముస్లిం దండయాత్ర క్రీ.శ. 1303లో కాకతీయ రాజ్యంపై జరిగింది. ఆ దండయాత్రలో ముస్లింలు ఓడిపోయినట్లు ఓరుగల్లు కోటలోని స్తంభ శాసనం విశదీకరిస్తోంది. అల్లావుద్దీన్‌గా పేరు మార్చుకున్న గర్షాప్స్ మాలిక్ దీనికి నాయకత్వం వహించాడు. ఈ యుద్ధం ఉప్పరిపల్లి (కరీంనగర్ జిల్లా) వద్ద 1303 లో జరిగింది.
 
 క్రీ.శ. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ నాయకత్వంలో రెండోసారి ఓరుగల్లుపై దాడి జరిగింది. అతడు హనుమకొండ, ఓరుగల్లు కోటను ముట్టడించాడు. 25 రోజులపాటు ప్రతాపరుద్రుడి సైన్యాలకు, ఖిల్జీ సైన్యాలకు మధ్య భీకరయుద్ధం జరిగింది. అంతర్గత కారణాల వల్ల ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్‌కు లొంగిపోయి, సంధికి అంగీకరించాడు. నాయంకర వ్యవస్థలో రేచర్ల పద్మనాయకులకు ప్రతాపరుద్రుడు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రెడి ్డరాజులు అతడితో కలిసి పనిచేయక పోవడమే ఓటమికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
 క్రీ.శ. 1323లో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై మూడోసారి దాడిచేశారు. ఢిల్లీ సుల్తానత్ తుగ్లక్ వంశ స్థాపకుడైన ఘియాసుద్దీన్ ప్రతాపరుద్రుడి నుంచి కప్పం వసూలు చేయడం కోసం తన కుమారుడైన ఉలుగ్ ఖాన్‌ను (మహ్మద్ బిన్ తుగ్లక్) భారీ సైన్యంతో ఓరుగల్లుకు పంపాడు. ప్రతాపరుద్రుడు సుమారు ఐదు నెలలపాటు వీరోచితంగా పోరాడినా అపజయం తప్పలేదు. మహ్మద్ బిన్ తుగ్లక్ ప్రతాపరుద్రుడిని బందీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకెళుతుండగా, మార్గమధ్యలో ప్రతాపరుద్రుడు నర్మదా నదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు రెడ్డిరాణి అనితల్లి క్రీ.శ. 1423లో వేయించిన కలువచేరు శాసనం ద్వారా తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ మహా సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమైంది. మహ్మద్ బిన్ తుగ్లక్ వరంగల్ పేరును సుల్తాన్‌పూర్‌గా మార్చాడు.
 
 కాకతీయ ప్రతాపరుద్రుడు ధీరోదాత్తైమైన, బలపరాక్రమ, శౌర్య గుణాలు కలవాడు. రాయలసీమలోని అడవి ప్రాంతాలైన త్రిపురాంతకం, శ్రీశైలం, కర్నూలులో దట్టమైన అడవులను నరికించి, వ్యవసాయ భూములుగా  మార్చాడు. అనేక నూతన నగరాలు నిర్మించాడు. కాకతీయ రాజ్యంలో రాయలసీమ ప్రాంతాలను విలీనం చేసిన తర్వాత, ప్రతాపరుద్రుడు కాంచీపురంపై దాడిచేసి, పాండ్యరాజులైన వీరపాండ్యుడిని, సుందరపాండ్యుడిని జయించాడు. ఆంధ్రదేశాన్ని సమైక్యం చేసి, తెలుగు భాషకు వారి సంస్కృతికి రక్షణ కల్పించిన ఘనత కాకతీయులదే.
 
 కాకతీయుల కాలంనాటి పరిస్థితులు
 దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో కాకతీయుల కాలం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు 3 శతాబ్దాల పాటు, ఓరుగల్లు కేంద్రంగా ఆంధ్రదేశాన్ని సమైక్యం చేసి, చరిత్రలో ఆంధ్రదేశాధీశ్వరులుగా వీరు పేరుగాంచారు. వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించారు. వీరి కాలంలోనే ఆంధ్ర, త్రిలింగ పదాలు ప్రాచుర్యం పొందాయి. వారి రాజధాని ఓరుగల్లు ఆంధ్ర మహానగరిగా ప్రసిద్ధి పొందింది. ఉత్తర దేశం నుంచి వచ్చిన మహ్మదీయుల దాడులను ఎదుర్కొని, ఆంధ్రుల స్వాతంత్య్ర సంస్కృతులను రక్షించిన వారు కాకతీయులే! మధ్యయుగాల నాటి, సామాజిక, సాంస్కృతిక రంగాలకు గట్టి పునాదులు వేసి, వీరి తర్వాత వచ్చిన రెడ్డి, పద్మనాయక, విజయనగర వంశాలను ప్రభావితం చేశారు.
 
 పాలనా విధానం: కాకతీయుల యుగంనాటి రాజనీతి వ్యవస్థను కాకతీయ రుద్రదేవుడు రచించిన నీతిసార సంస్కృత గ్రంథం, శివదేవయ్య పురుషార్థసారం, మడికి సింగన.. సకలనీతి సమ్మతం, బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళి వంటి గ్రంథాలు, శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. వీరు సంప్రదాయ రాచరికాన్ని అనుసరించారు. రాచరికం వంశపారంపర్యంగా సంక్రమించేది. రాజు నిరంకుశుడైనప్పటికీ, ధర్మశాస్త్రాలను అనుసరించి పాలించేవారు. స్త్రీలకు కూడా రాజ్యాధికార హక్కు కల్పించారు. ఇందుకు నిదర్శనంగా రుద్రమదేవిని పేర్కొనవచ్చు. వీరి కాలంలో దత్తత ద్వారా కూడా వారసత్వ హక్కు సంక్రమించేది. రాణీ రుద్రమదేవి మనుమడు రెండో ప్రతాపరుద్రుడు దత్తత ద్వారానే రాజ్యాధికారం చేపట్టాడు. రాజ్యంలో రాజు సర్వాధికారి. చాతుర్వర్ణ సముద్ధరణ ముఖ్యమని కాయస్థ అంబదేవుడి త్రిపురాంతకం శాసనం విశదీకరిస్తోంది. రాజుకు వేదాలు, శాస్త్రాలు, సాహిత్యం, కళలపై అవగాహన ఉండాలి. రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు అనేక విద్యల్లో శిక్షణపొంది, రాజనీతి సూత్రాలకు అనుగుణంగా పాలించారు.
 
  రాజు నిర్ణీత సమయాల్లో ప్రజలకు దర్శనమిచ్చి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని కాకతీయ రుద్రదేవుడి సంస్కృత నీతిసార గ్రంథం బోధిస్తోంది. రాజుకు ఎంత సన్నిహితుడైనా, యోగ్యత లేనివాడిని మంత్రిగా నియమించరాదని బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి సూచిస్త్తోంది. వేదశాస్త్ర, రాజనీతి కోవిదులైన బ్రాహ్మణులనే మంత్రులుగా నియమించాలని నాటి రాజనీతి గ్రంథాలు పేర్కొన్నాయి. కానీ కాకతీయులు దీనికి విరుద్ధంగా అన్ని వర్గాల ప్రజలకు మంత్రి మండలిలో అవకాశమిచ్చారు. రాజుకు పరిపాలనలో మహాప్రధాన, ప్రధాన, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. గణపతిదేవుడికి మల్యాల హేమాద్రి రెడ్డి, ప్రతాపరుద్రుడికి ముప్పిడి నాయకుడు వంటి బ్రాహ్మణేతరులు మహా ప్రధానులుగా ఉన్నారు. మడికి సింగన రాసిన సకలనీతి సమ్మతం గ్రంథం ప్రకారం రాజుకు పరిపాలనలో సహాయంగా 21 మంత్రుల వివరాలు పేర్కొన్నాడు. వీరినే అష్టాదశ తీర్థులని ఈ గ్రంథం పేర్కొంది. రాజు మంత్రులతో, తీర్థులతో తరచూ సంప్రదిస్తూ ఉండాలని శివదేవయ్య పురుషార్థసారం పేర్కొంటోంది. రాజుకు పరిపాలనలో సహాయపడడానికి 72 మంది నియోగాల (రాజోద్యోగుల)ను నియమించేవారు. వీరినే బహత్తర నియోగాలు అనేవారు. ఈ 72 శాఖల రాజోద్యోగులకు బహత్తర నియోగాధిపతి ఉన్నతాధికారిగా వ్యవహరించేవాడు. గణపతిదేవుడు తన హయాంలో కాయస్థ గంగయ సాహిణిని బహత్తర నియోగాధిపతిగా నియమించాడు.
 
 రాజుకు అంగరక్షకులు ఉండేవారు. అంతఃపుర రక్షకుడిని నగరి శ్రీకావలి అని పిలిచేవారు. లెంకలు అనే గిరిజన తెగలు పాలకవర్గాలకు సేవలు అందించేవి. కాకతీయుల రాజ్యవిస్తరణలో, పాలనలో... దివిసీమను పాలించిన పినచోడిరాజు, నిడదవోలు చాళుక్యులు, కోట, సతనాటి, సాగి వంశీయులు (సామంతరాజులు) ప్రధాన పాత్ర వహించారు. వీరు అనేక యుద్ధాల్లో విజయాలు చేకూర్చడమే కాకుండా, ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కాకతీయ రాజులతో వివాహ సంబంధాలు కొనసాగించారు.
 

మరిన్ని వార్తలు