టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

22 Nov, 2017 11:31 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్వేతామహంతి

గతేడాదిలాగే పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం 

మాస్‌ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేదు 

త్రీ ఆర్స్‌ కార్యక్రమంలో వెనుకబడిన వారికి డిసెంబర్‌ వరకు గడువు

ఎంఎన్‌ఎస్‌ కార్యక్రమం పక్కాగా అమలు చేయాల్సిందే 

మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలి 

మధ్యాహ్న భోజనం అమలుపై నిర్లక్ష్యం వద్దు

వనపర్తి విద్యావిభాగం : జిల్లాలో 2018 మార్చి పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ శ్వేతామహంతి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  మాట్లాడారు. గతేడాది ఫలితాలను విశ్లేషించుకుని పక్కా ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో, జిల్లాలో ఏ సమావేశం జరిగినా పదో తరగతి పరీక్షల్లో చివరి స్థానం వచ్చిందని వనపర్తి జిల్లా గురించి చర్చ రావడం విచారకరమన్నారు. ఏళ్లుగా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అదే పాఠశాలలో పనిచేస్తున్నా.. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు కనీసం పాస్‌ కాలేకపోవడం మీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం పరీక్షలకు ఎంతో సమయం ఉందని, పక్కా ప్రణాళికలతో, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈసారి ఫలితాలు అనుకున్న విధంగా వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. పరీక్షలను పకడ్భందీగా నిర్వహిస్తామని, మాస్‌ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేదన్నారు. 

మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలి  
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం అమలు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. బిల్లు రాలేదని కాంట్రాక్టర్‌ వంటగదికి తాళం వేశారని గోపాల్‌పేట మండలం చెన్నూర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం ఈ సందర్భంగా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. కొత్తకోట మోడల్‌ స్కూల్, వనపర్తి తెలుగువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తదితర పాఠశాలల్లో వంటగదులు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మధ్యాహ్న భోజనం బియ్యం 50కిలోల బస్తాలో తూకం తక్కువగా వస్తున్నాయని పలువురు హెచ్‌ఎంలు తెలిపారు. 

ఎంఎన్‌ఎస్‌ను పక్కాగా అమలు చేయాల్సిందే...
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వందేమాతరం పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎన్‌ఎస్‌ (మినిమమ్‌ న్యూమరికల్‌ స్కిల్స్‌) కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సిందేనని కలెక్టర్‌ ఆదేశించారు. త్రీ ఆర్స్‌ కార్యక్రమం పూర్తయ్యిందని, ఫలితాల్లో వెనుకబడి ఉన్న పాఠశాలలు డిసెంబర్‌ వరకు కొనసాగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కనీసం సాధారణ లెక్కలు వేగంగా, కచ్చితంగా చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం వివిధ అంశాలపై డీఈఓ సుశీందర్‌రావు హెచ్‌ఎంలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు