IIM లకు స్వతంత్ర ప్రతిపత్తి!

3 Jan, 2017 04:37 IST|Sakshi
IIM లకు స్వతంత్ర ప్రతిపత్తి!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎంలు).. దేశంలో మేనేజ్‌మెంట్‌ విద్యలో అత్యున్నత సంస్థలు. ఎందరో కార్పొరేట్‌ లీడర్లను తీర్చిదిద్దిన ఘనత వీటికే దక్కుతుంది. కానీ, కొన్ని పరిమితుల
కారణంగా ఐఐఎంలు పూర్తిస్థాయి సామర్థ్యాలను ప్రదర్శించలేక పోతున్నాయనే అభిప్రాయం ఉంది. ఐఐఎంలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే దిశగా ఐఐఎంల బిల్లు–2015ను పార్లమెంట్‌ వేసవి సమావేశాల్లో ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో బిల్లు ముఖ్యాంశాలు, దాని అమలుతో కలిగే ప్రయోజనాలపై విశ్లేషణ..

బోధన, నిర్వహణ, ఇతర అంశాల్లో ఐఐఎంలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో కొత్త కార్యాచరణకు సంబంధించిన బిల్లు 2015లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖకు చేరింది. అందులోని కొన్ని అంశాలపై హెచ్‌ఆర్‌డీ వర్గాలు ప్రతికూల వైఖరిని అవలంబించాయి. దీంతో ఏడాదిన్నరగా బిల్లులో మార్పులు జరిగాయి. చివరకు తాజాగా హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌.. ఐఐఎం వర్గాలు పేర్కొన్న స్వతంత్ర ప్రతిపత్తిపై సూచన ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ బిల్లును పార్లమెంటు వేసవి సమావేశాల్లో ప్రవేశపెట్టి, కార్యరూపం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
‘విజిటర్‌’ హోదాకు స్వస్తి: బిల్లులో అత్యంత ప్రధాన అంశం..‘విజిటర్‌ హోదా’ అనే పదానికి స్వస్తి పలకాలని ఐఐఎంలు కోరడం, దానికి హెచ్‌ఆర్‌డీ అంగీకరించడం. ప్రస్తుతం ఐఐఎంల్లో అమలవుతున్న విధానం ప్రకారం రాష్ట్రపతికి విజిటర్‌ హోదా ఉంటోంది. ఈ హోదాలో ఒక ఇన్‌స్టిట్యూట్‌ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఐఐఎం వర్గాలను సంప్రదించకుండా నేరుగా ఎవరినైనా నియమించొచ్చు. దీనిపై ఐఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఇప్పుడు ‘విజిటర్‌ హోదా’కు స్వస్తి పలకనున్నట్లు సమాచారం.

ఐఐఎం ఫోరం: తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇకపై అన్ని ఐఐఎంలు కలిసి ఒక ఫోరంగా ఏర్పడనున్నాయి. దీనికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎక్స్‌ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఫోరం ఏర్పాటు వల్ల ఐఐఎంల మధ్య నిరంతరం సంప్రదింపులు, ఎక్సే్ఛంజ్‌ కార్యకలాపాలకు వీలవుతుంది. తద్వారా అకడమిక్‌గా, అడ్మినిస్ట్రేషన్‌ పరంగా సమర్థ నిర్వహణకు అవకాశం ఉంటుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఐఐఎం ప్రత్యేకంగా ఉండాలని, ఇతర ఐఐఎంలతో పోటీపడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఫోరం వల్ల ఆశించిన ఉద్దేశం నెరవేరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నియామకాల్లో స్వేచ్ఛ: ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి కూడా కొత్త బిల్లు ద్వారా ఐఐఎంలకు స్వతంత్రత లభించనుంది. నిర్దిష్టంగా ఒక ఐఐఎంకు గవర్నింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో ఫ్యాకల్టీని నియమించే అవకాశం ఉంది. అయితే వీరికి వేతనాలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

విదేశాల్లో సెంటర్లు: కొత్త బిల్లు ప్రకారం నిబంధనల మేరకు ఐఐఎంలు విదేశాల్లో తమ సెంటర్ల ఏర్పాటుకు అవకాశముంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ సెంటర్ల వల్ల కొలాబరేటివ్‌ పరిశోధన కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుంటుంది. స్వదేశంలోనూ వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అనుమతితో సెంటర్లు ఏర్పాటు చేయొచ్చు.

ఎంబీఏ పట్టాలు: ఐఐఎంలు ప్రస్తుతం రెండేళ్ల వ్యవధిలో పీజీ డిప్లొమా పేరుతో అందిస్తున్న కోర్సులకు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎంబీఏ పేరుతో పట్టాలు ఇవ్వనున్నాయి. రెండేళ్లపాటు చదివినా పీజీ డిప్లొమా టైటిల్‌ వల్ల అంతర్జాతీయంగా సరైన గుర్తింపు రావడం లేదని, అందువల్ల ఎంబీఏ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేయాలని పలువురు పూర్వ విద్యార్థులు కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రీసెర్చ్‌ కార్యకలాపాలకు ప్రాధాన్యం: బిల్లులో మరో ప్రధానాంశం ఒక ఐఐఎం స్వయంగా రీసెర్చ్‌ యాక్టివిటీస్‌ దిశగా స్వతంత్రంగా వ్యవహరించడం. ఈ క్రమంలో రీసెర్చ్‌కు అవసరమైన నిధుల సమీకరణ, ఎక్సే్ఛంజ్‌ ఒప్పందాలు, స్పాన్సర్డ్‌ రీసెర్చ్‌ కార్యకలాపాలు వంటి విషయంలో సదరు ఐఐఎం గవర్నింగ్‌ కౌన్సిల్‌కే పూర్తి నిర్ణయాధికారాలు లభిస్తాయి.

డైవర్సిటీకి ప్రాధాన్యం: ఐఐఎంల్లో సిబ్బంది నియామకాలు, కోర్సుల ప్రవేశాల విషయంలో డైవర్సిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని.. మహిళలు, దివ్యాంగులతోపాటు అన్ని సామాజిక వర్గాలు, నేపథ్యాలకు చెందిన వారికి అవకాశం లభించేలా చూడాలని బిల్లులో పేర్కొన్నారు.

త్వరితగతిన డైరెక్టర్ల నియామకం: సాధారణంగా ఒక డైరెక్టర్‌ పదవీ కాలం ముగియడానికి తొమ్మిది నెలల ముందుగానే కొత్త డైరెక్టర్‌ నియామక ప్రక్రియ ప్రారంభించాలి. పదవీ కాలంలో డైరెక్టర్‌ వైదొలగితే నెల వ్యవధిలో కొత్త డైరెక్టర్‌ నియామకానికి గవర్నింగ్‌ బోర్డ్‌ చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం వివిధ ఐఐఎంల్లో డైరెక్టర్‌ పోస్ట్‌ ఖాళీ అయితే ఏళ్ల తరబడి భర్తీ కాని పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారానికి తాజా బిల్లులో సిఫార్సులు చేశారు. త్వరితగతిన డైరెక్టర్ల నియామకాలు చేపట్టాలని బిల్లులో స్పష్టం చేశారు. దీనివల్ల సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి.

బిల్లు ముఖ్యాంశాలు
విజిటర్‌ హోదాకు స్వస్తి
డైరెక్టర్ల నియామకానికి గవర్నింగ్‌ కౌన్సిల్‌కు అధికారం
రీసెర్చ్‌ యాక్టివిటీస్‌ పరంగా స్వయంప్రతిపత్తి
పీజీ డిప్లొమా స్థానంలో ఎంబీఏ పేరుతో సర్టిఫికెట్ల ప్రదానం
దేశ, విదేశాల్లో సెంటర్ల ఏర్పాటుకు అవకాశం
ఐఐఎం కామన్‌ ఫోరం ఏర్పాటు
డైవర్సిటీకి తప్పనిసరిగా ప్రాధాన్యం

మరిన్ని వార్తలు