తీర గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సునయన ప్రారంభం

24 Oct, 2013 14:53 IST|Sakshi

 ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి
 కరెంట్ అఫైర్స్ నిపుణులు
 
 
 జాతీయం
 
 తీర గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సునయన ప్రారంభం

నౌకా దళానికి చెందిన రెండో సముద్ర తీర గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సునయనను కోచిలో అక్టోబర్ 15న ప్రారంభించారు. నౌకాదళ పెట్రోలింగ్, నిఘా అవసరాలకు దీన్ని వినియోగిస్తారు. ఇది 25 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ పవర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉంది. ఆధునిక నేవిగేషన్, క మ్యూనికేషన్, ఎల క్ట్రానిక్ సపోర్ట్ వ్యవస్థలున్నాయి. ఎలక్ట్రిక్ ఆప్టిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన 76 ఎం.ఎం. గన్‌తోపాటు ఇతర ఆయుధాలు ఇందులో ఉంటాయి. హెలికాఫ్టర్‌ను కూడా మోసుకుపోగలదు.
 
 
 రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్
 రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్ అక్టోబర్ 9న నియమితులయ్యారు. రైల్వే బోర్డు సభ్యుడిగా ఉన్న అరుణేంద్ర పదవీ విరమణ చేసిన చైర్మన్ వినయ్‌మిట్టల్ స్థానంలో జూన్ 30 నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
 ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయులు
 ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన అంతర్జాతీయ అగ్రశ్రేణి 50 మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నలుగురు భారత మహిళలకు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ (17వ స్థానం), యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన శిఖా శర్మ
 (32వ స్థానం), హెచ్‌ఎస్‌బీసీకి చెందిన నైనా లాల్ కిద్వాయ్ (42వ స్థానం) ఉన్నారు. ఈ జాబితాలో తొలి స్థానాన్ని బ్రెజిల్‌కు చెందిన ఇంధన దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మరియా దాస్ గ్రేకాస్ ఫోస్టర్ సాధించారు.  
 
 హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఒర్బన్ భారత్ పర్యటన
 హంగరీ ప్రధానమంత్రి డాక్టర్ విక్టర్ ఒర్బన్ తన భారత పర్యటనలో అక్టోబర్ 16న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమై చ ర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతునిస్తున్నట్లు ఒర్బన్ చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో జీవ సంబంధ, రసాయన ఆయుధ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సంప్రదాయ వైద్యం, కళలు, సాంస్కృతిక, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి.
 
 ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ కన్నుమూత
 ప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ (87) అక్టోబర్ 18న హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరులో 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ 17వ ఏట నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. అచ్చు అయిన తొలి కథ విమల. దాదాపు 43 పిల్లల కథలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలను రాశారు. 1968, 1983ల్లో రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు, 1987లో సోవియట్‌ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆయనకు దక్కాయి.
 
 ఆయన అనేక రచనలు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రా, జేఎన్‌టీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 2012 సంవత్సరానికి గానూ ఆయన రాసిన నవల పాకుడురాళ్లుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత భరద్వాజ. గతంలో విశ్వనాథ సత్యనారాయణకు, సి.నారాయణరెడ్డిలకు జ్ఞానపీఠ్ లభించింది.
 
 భారతీయ యువతికి కామన్‌వెల్త్ యూత్ అవార్డు
 భారత్‌లో పర్యావరణ మార్పు సమస్య నివారణకు కృషిచేస్తున్న భారత మహిళ ప్రీతీ రాజగోపాలన్(23) ఈ ఏడాది కామన్‌వెల్త్ యూత్ అవార్డును గెలుపొందారు. అక్టోబర్ 12న లండన్‌లోని కామన్‌వెల్త్ ప్రధాన కార్యాలయంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
 
 ఈ అవార్డు కింద 5000 పౌండ్లు లభిస్తాయి. పర్యావరణ మార్పుపై స్థానిక సమాజాలు, ప్రభుత్వాలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించి మిత్రులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. భారత్‌లో 200 పాఠశాలలు, 40 విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆమె శిక్షణ అందిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆమె ప్రాజెక్టుకు నిధులు అందిస్తోంది.
 
 ఎంపీ పదవిని కోల్పోయిన రషీద్ మసూద్
 శిక్షకు గురైన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ తన సభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్ష వల్ల పదవి కోల్పోయిన తొలి ప్రజా ప్రతినిధి రషీద్ మసూద్. ఆయనకు అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 19న నాలుగు ఏళ్ల జైలుశిక్ష విధించింది. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకుపైన శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు (ఎంపీ, ఎంఎల్‌ఏలు) వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 
 
 అంతర్జాతీయం
 అమెరికన్లకు అర్థ శాస్త్రంలో నోబెల్
 ఆస్తుల ధరలపై అవగాహన కలిగించే విధానాన్ని రూపొందించినందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్‌లకు అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈజెన్ ఫామా, పీటర్స్ హాన్సన్‌లు షికాగో యూనివర్సిటీలో, రాబర్ట్ షిల్లర్ యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. షేర్లు, బాండ్ల ధరల తీరు రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అనే విషయాన్ని అనుభవపూర్వకంగా, విశ్లేషణ ద్వారా అంచనా వేయవచ్చని వారు ప్రతిపాదించారు. షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు వంటివాటి రూపంలో పొదుపు చేయాలనేది వ్యక్తుల అంచనాలపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు.
 
 ఎలీనర్ కాటన్‌కు బుకర్ ప్రైజ్
 న్యూజిలాండ్‌కు చెందిన ఎలీనర్ కాటన్ (28)కు 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. ఈ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు కాటన్. ఆమె రాసిన ‘ద లూమినరీస్’ అనే నవలకు ఈ బహుమతి లభించింది. 19వ శతాబ్దిలో సాగిన బంగారం అన్వేషణ ఇతివృత్తంతో కూడిన మర్డర్ మిస్టరీ నవల ఇది. బహుమతి కింద 50 వేల పౌండ్లు లభిస్తాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి నవల ‘ద ల్యోలాండ్’ చివరి వరకు పోటీపడ్డా బహుమతి లభించలేదు. ఈ బహుమతిని కామన్‌వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన వారి ఆంగ్ల రచనలకు మాత్రమే అందిస్తారు.
 
 ఫిలిప్పీన్స్ భూకంపంలో 100 మందికి పైగా మృతి
 ఫిలిప్పీన్స్‌లో అక్టోబర్ 15న సంభవించిన భారీ భూకంప తాకిడికి ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వంద మందికిపైగా మృతి చెందారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. బొహోల్ ద్వీపంలోని కార్మెన్ పట్టణ శివార్లలో భూమికి 33 కి.మీ దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది.
 
 
 లై-ఫైని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు
 ఇంటర్నెట్‌ను అనుసంధానం చేసే కొత్త విధానం లై-ఫైని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వై-ఫైకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కొత్త విధానంలో కాంతి కోసం ఉపయోగించే బల్బుల ద్వారా ఇంటర్నెట్ సంకేతాలను చేరుస్తారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వై-ఫైలో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా సంకేతాలను పంపిస్తారు. లై-ఫైగా పిలిచే కొత్త విధానం సమర్థవంతమైంది. చవకైంది. ఈ విధానం ద్వారా కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. నాలుగు కంప్యూటర్లను ఒక వాట్ ఎల్‌ఈడీ బల్బుతో ఇంటర్నెట్‌కు అనుసంధానం చేయొచ్చు. ఈ బల్బు మైక్రోచిప్‌ను కలిగి ఉంటుంది. సెకనుకు 150 మెగాబిట్ల డేటాను చేరవేస్తుంది. ఇది చైనాలో అందుబాటులో ఉన్న సగటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే వేగవంతమైంది.
 
 భారత్ వృద్ధి 4.7 శాతం: ప్రపంచ బ్యాంక్
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను తమ తాజా ‘భారత్ వృద్ధి అప్‌డేట్’ నివేదిక కుదించినట్లు బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా వ్యవహారాలు) మార్టిన్ రామ్ ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.2 శాతం ఉంటుందన్నది బ్యాంక్ తాజా అంచనా అని కూడా వెల్లడించారు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతం. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 5 శాతం వృద్ధి సాధించింది. గత దశాబ్ద కాలంలో వృద్ధి సగటు 8 శాతం. భారత్ వృద్ధి 2013-14లో బలహీనం కావడానికి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ (4.4 శాతం వృద్ధి) పేలవ పనితీరు కారణమని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది.
 
 భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్య దేశాలు
 భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అక్టోబర్ 17న ఎన్నుకుంది. భద్రతా మండలికి తాజాగా ఎన్నికైన చాద్, చిలీ, లిథువేనియా, నైజీరియా, సౌదీ అరేబియాలు 2014 జనవరి నుంచి రెండేళ్ల పాటు అందులో కొనసాగుతాయి. తాత్కాలిక సభ్య దేశాలుగా ప్రస్తుతమున్న అజర్‌బైజాన్, గ్వాటెమాల, మొరాకో, పాకిస్థాన్, టోగోల కాల పరిమితి ఈ ఏడాది చివరికి ముగుస్తుంది.
 
 
 క్రీడలు
 
 వన్డేల్లో కోహ్లి రికార్డ్
 వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 52 బంతుల్లో 100 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో వేగంగా వంద పరుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.
 
 సెహ్వాగ్ 2009 లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. జైపూర్ వన్డేలో ఆస్ట్రేలియా చేసిన 359 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. తద్వారా వన్డే క్రికెట్‌లో రెండో అతిపెద్ద లక్ష్యా న్ని సాధించినట్లైంది. 2006లో ఆస్ట్రేలియా చేసిన 434 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి ఛేదించింది.
 
  డింగ్ జున్ హుయ్‌కి ఇండియన్ ఓపెన్ స్నూకర్
 ఇండియన్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్ టైటిల్‌ను డింగ్ జున్ హుయ్ (చైనా) గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో భారత క్రీడాకారుడు ఆదిత్య మెహతాను ఓడించాడు.
 
 దీపికాకు మకావు ఓపెన్ స్క్వాష్ టైటిల్
 భారత్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్.. మకావు ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. అక్టోబర్ 20న జరిగిన మహిళల ఫైనల్లో రాచెల్ గ్రిన్హామ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. దీంతో తన కెరీర్‌లో ఏడు మహిళల స్క్వాష్ అసోసియేషన్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది.
 
 సిమోనా హలెప్‌కు క్రెమ్లిన్ కప్
 రుమేనియాకు చెందిన సిమోనా హలెప్ క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టైటిల్ గెలుచుకుంది. అక్టోబర్ 20న జరిగిన ఫైనల్స్‌లో ఆమె ఆస్ట్రేలియాకు చెందిన సమంతా స్టోసుర్‌ను ఓడించింది.
 
 దులీప్ ట్రోఫీ విజేతలుగా నార్త్, సౌత్ జోన్లు
 దులీప్ ట్రోఫీ విజేతలుగా నార్త్, సౌత్ జోన్‌లను సంయుక్తంగా ప్రకటించారు. కోచిలో జరిగిన ఐదు రోజుల మ్యాచ్ అక్టోబర్ 21న వర్షం వల్ల ఆగిపోవడంతో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లు విజేతలుగా నిలిచాయి. ఇలా సంయుక్త విజేతలను ప్రకటించడం ఇది నాలుగోసారి.
 
 
 డిమిట్రోవ్‌కు స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్
 స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను బల్గేరియాకు చెందిన గ్రిగోరో డిమిట్రోవ్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 20న స్టాక్‌హోమ్‌లో జరిగిన ఫైనల్స్‌లో డేవిడ్ ఫైను డిమిట్రోవ్ ఓడించాడు.
 
 భారత హాకీ జట్టు కోచ్‌గా టెర్రీవాల్ష్
 భారత హాకీ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్‌ను నియమించినట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. ఆయనకు నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవముంది. 1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు.
 
 చెన్ లాంగ్‌కు డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్
 డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చెన్ లాంగ్ (చైనా) విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చెన్ లాంగ్ ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు.
 

మరిన్ని వార్తలు