కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కీలక నిర్ణయం..!

9 May, 2019 17:32 IST|Sakshi

పీజీ వైద్య ప్రవేశాలకు అర్హత మార్కుల తగ్గింపు

నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూనివర్సిటీ

సాక్షి, వరంగల్ :  కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ ప్రవేశాలకు నీట్ అర్హత మార్కులు తగ్గించింది. నీట్‌ కటాఫ్‌ మార్కులను కేంద్రం 6 పర్సెంటైల్‌ తగ్గించిన నేపథ్యంలో యూనివర్సిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తెలిపారు. పీజీ వైద్య ప్రవేశాలకు కటాఫ్ మార్కులు తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు కన్వీనర్ కోటాలో  సీట్లభర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు గురువారంనోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మే 10 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని,  మే13న ధృవపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, పీ.జీ.ఆర్.ఆర్.సీ.డి.ఈ లో  ఏర్పాటు చేసిన సెంటర్‌కు హాజరు కావాలని వెల్లడించింది. మరింత సమాచారానికి
 యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.in ను సంప్రదించాలని సూచించింది.

పర్సంటైల్‌ తగ్గించిన కేంద్రం..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్‌ 2019-20 ఏడాదికిగాను పీజీ కటాఫ్‌ మార్కులను 6 పర్సెంటైల్‌ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్‌ అభ్యర్థులు 44  పర్సంటైల్‌ 313 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కి 34 పర్సెంటైల్‌ 270 మార్కులు, దివ్యాంగులకు 39 పర్సెంటైల్‌  291 మార్కులుగా కటాఫ్‌ నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు