మాతృ భాషల్లో డిజిటల్ టెక్నాలజీ

18 Sep, 2016 00:33 IST|Sakshi
మాతృ భాషల్లో డిజిటల్ టెక్నాలజీ

సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్నా..రైతులు, నిరక్షరాస్యులు మాత్రం ఆ ఫలాలు  అందుకోలేకపోతున్నారని గుర్తించాడో 30 ఏళ్లయువకుడు. దీనికి కారణమైన అంతరాలను తొలగించి సాంకేతికతను సామాన్యులకు చేరువ చేయాలని కలలుకన్నాడు. అందరికీ అర్థమయ్యేలా మాతృభాషల్లో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు.ఆయనే యునిఫోర్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సీఈవో.. ఉమేశ్ సచ్‌దేవ్.

 ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్.. ప్రపంచాన్ని మారుస్తున్న (10 మిలినియల్స్) వ్యక్తుల జాబితా-2016లోఉమేశ్‌కు చోటు కల్పించింది.ఈ నేపథ్యంలో ఆయనతో ఇంటర్వ్యూ..
 
ఇప్పుడిప్పుడే స్టార్టప్ రంగంవైపు అడుగులేస్తున్న రేపటి కార్పొరేట్స్‌కు నేనిచ్చే సలహా.. నేటి ఆధునిక ప్రపంచంలో అవకాశాలకు కొదవలేదు. కానీ వాటిని అందిపుచ్చుకుని, భావి వ్యాపారవేత్తలుగా ఖ్యాతి గడించాలంటే మీకొచ్చిన ఆలోచన దేశ తలరాతను మార్చేదిగా, నేటి యువతరాన్ని ఆకట్టుకునేదిగా ఉండాలి. అంతేకాకుండాప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదల,  ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, విజయానికి చేరువ కావాలంటే అనేక మార్గాలుంటాయని విశ్వసించాలి. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు మన దేశ కీర్తిప్రతిష్టలను ముందుకు తీసుకె ళ్లగలరు.
 
 మాది కార్పొరేట్ లీడర్స్ కుటుంబం. నాన్న టాటా గ్రూప్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేవారు. ఇంట్లో ఎప్పుడూ కార్పొరేట్ వాతావరణం ఉండటంతో నాక్కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. సరిగ్గా అప్పుడే (2005-07) మన దేశంలో స్టార్టప్‌లపై ఆసక్తి మొదలైంది. ఆ సమయంలో నేను జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నోయిడా)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నా స్నేహితుడు రవితో కలిసి 2006లో ‘సింగులారిస్’ అనే సంస్థను ప్రారంభించా. పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్ చేసి పట్టుకోవడమే మా పని. ఆ సమయంలో కుటుంబ సభ్యులందించిన ప్రోత్సాహం మరువలేనిది. అయితే మార్కెట్ పరిస్థితులు, సంస్థ పనితీరు మేమనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడంతో రెండేళ్లకే మా ప్రయత్నాన్ని విరమించుకోవాల్సి వచ్చింది.
 
 దారి చూపిన ఆశాదీపం..
ఎలాగైనా మానవ జీవన గమనాన్ని మార్చే వినూత్న టెక్నాలజీని తయారు చేయాలన్న లక్ష్యంతో సలహాలు, సూచనలు అందించాల్సిందిగా చాలా మంది పెద్దలను కలిసినా సరైన ప్రోత్సాహం లభించలేదు. ఆ సమయంలో ఐఐటీ-మద్రాస్‌లో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ ఝన్‌ఝన్‌వాలా ఎంతో సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఐఐటీ-మద్రాస్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో ‘యునిఫోర్’ సంస్థను ఏర్పాటుచేశాం. తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యకు సాంకేతికతతో పరిష్కారం చూపాలనుకున్నాం. రైతులు, నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి రెండు నెలలపాటు తమిళనాడులోని అనేక మారుమూల గ్రామాల్లో తిరిగి ఒక ప్రధానమైన సమస్యను గుర్తించాం.
 
 అదే భాషావరోధం.!
 నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్ల వినియోగం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉంటున్నారు. వీరికి ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడంతో అనేక రకాల ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోలేని పరిస్థితి. దీనికి కారణం భాషా అవరోధమని గుర్తించాం. ఎలాగైనా ఈ భాషాంతరాలను తొలగించి, సాంకేతిక పరిజ్ఞానం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా చేయాలనుకున్నాం. రైతులు వాతావరణ సమాచారం, మార్కెట్ పరిస్థితులను తెలుసుకొని ఆర్థిక సాధికారతను పెంపొందించుకునేందుకు ఫోన్లు ఉపయోగపడాలి. దీని కోసం మాతృభాషల్లో ఆన్‌లైన్ వ్యవహారాలను చేసుకునేలా టెక్నాలజీని అభివృద్ధి చేశాం.
 
 ఈ మూడింటిపైనే దృష్టి..
 యునిఫోర్ ప్రధానంగా వాయిస్ టెక్నాలజీస్ అయిన స్పీచ్ రికగ్నేషన్, వాయిస్ బయోమెట్రిక్స్, వాయిస్ అసిస్టెంట్‌పైనే దృష్టిపెడుతోంది. మొదట్లో ఈ టెక్నాలజీని మన దేశంలోని గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు ఉపయోగించుకుంటే చాలనుకున్నాం. కానీ నేడు మన దేశంతోపాటు ఫిలిప్పీన్స్, సింగపూర్, మలేషియాతోపాటు పశ్చిమాసియా దేశాలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. త్వరలో చైనీస్ మార్కెట్‌పై కూడా దృష్టిపెట్టబోతున్నాం. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 16 భారతీయ భాషలు, 150 ప్రాంతీయ మాండలికాలతోపాటు 70 అంతర్జాతీయ భాషల్లో సేవలందిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం, ఏవియేషన్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, రిటైల్ సెక్టార్‌లలో ఈ టెక్నాలజీ సేవలు బాగా ఉపయోగపడుతున్నాయి. ఆర్థికంగానూ దినదినాభివృద్ధి చెందుతున్న యునిఫోర్ సంస్థ.. మానవ వనరుల ఎంపికలోనూ వినూత్నంగా వ్యవహరిస్తోంది. స్పష్టమైన లక్ష్యం, సృజనాత్మకత ఉండి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసంతో పనిచేయగలిగిన వారినే ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాం.
 
 2019 నాటికి 1.33 బిలియన్ డాలర్లు
 ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఇప్పుడిప్పుడే స్పీచ్ అనలిటిక్స్, వాయిస్ బయోమెట్రిక్స్‌పై దృష్టిసారిస్తున్నాయి. 2019 నాటికి ఈ మార్కెట్ 1.33 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇటీవల ఓ సర్వే సంస్థ స్పీచ్ అనలిటిక్స్‌పై ప్రపంచవ్యాప్తంగా 500 మంది పేరొందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను కోరగా దీనివల్ల ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని 72 శాతం మంది.. డబ్బు ఆదా అవుతుందని 68 శాతం మంది.. ప్రజల ఆర్థిక, సాంకేతిక పురోభివృద్ధికి తోడ్పడుతుందని 52 శాతం మంది తెలిపారు. రాబోయే రెండేళ్లలో ఈ విభాగంలో అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
 

మరిన్ని వార్తలు