సీబీసీఎస్‌తో విద్యార్థులకు మేలు

13 Apr, 2015 00:36 IST|Sakshi
సీబీసీఎస్‌తో విద్యార్థులకు మేలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సీబీసీఎస్) ద్వారా విద్యార్థులు ఆయా కోర్సులు పూర్తి చేసుకునే సమయానికి జాబ్ రెడీ స్కిల్స్ సొంతం చేసుకుంటారని చెబుతున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ హెచ్.దేవ్‌రాజ్.మద్రాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్స్ కోసం అడుగుపెట్టి అదే యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ స్థాయికి ఎదిగి ప్రస్తుతం యూజీసీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ హెచ్. దేవ్‌రాజ్‌తో గెస్ట్‌కాలం..
 
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకీ పరిశ్రమల అవసరాలు మారిపోతున్నాయి. పోటీ వాతావరణానికి తగ్గట్లు విభిన్న నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం కంపెనీలకు ఏర్పడుతోంది. అందుకే విద్యా వ్యవస్థలో నిరంతరం మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. తాజాగా శ్రీకారం చుట్టిన ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఈ తరహా అవసరాలను తీరుస్తుంది.
 
సీబీసీఎస్‌తో ఆశావహ దృక్పథం
సీబీసీఎస్ విధానంలో విద్యార్థులు ఇష్టం లేకున్నా భారంగా ఒక కోర్సు చదవాల్సిన పరిస్థితి ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఒత్తిడి లేదా మార్కెట్ డిమాండ్ పరంగా ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో అడుగుపెట్టిన విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఇతర కోర్సులు నేర్చుకునే విధంగా సీబీసీఎస్ అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల కోర్‌తో పాటు వ్యక్తిగత ఆసక్తి కూడా నెరవేరుతుంది. ఇది విద్యార్థులను మానసికంగా ఆశావాహ దృక్పథం వైపు నడిపిస్తుంది.
 
రాష్ట్రస్థాయిలోనూ సాధ్యమే
సిలబస్ అంశాలు వేర్వేరుగా ఉండే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో సీబీసీఎస్ సాధ్యమే నా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఇది కచ్చితంగా సాధ్యమే. సీబీసీఎస్ ఫ్రేం వర్క్‌ను, మార్గదర్శకాలను యూజీసీ పేర్కొంది. అయితే కోర్సులు, కరిక్యులం రూపకల్పన విషయంలో యూనివర్సిటీల బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు స్వేచ్ఛ ఉన్నందువల్ల సంస్థ సభ్యులు కోర్సులో ఉండాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోవచ్చు. యూజీసీ కూడా అన్ని యూనివర్సిటీల్లో కొంతమేర ఉమ్మడి సిలబస్ రూపకల్పనపై యోచిస్తోంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.
 
బ్రాండ్ ఈక్విటీ ప్రధానం
సీబీసీఎస్ విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్కోరింగ్, నాన్ స్కోరింగ్ సబ్జెక్టులలో గ్రేడింగ్‌పై ఈ అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకు రిలేటివ్ గ్రేడింగ్, నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నాం. వీటి విధి విధానాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కొన్ని యూనివర్సిటీలు ఉద్దేశపూర్వకంగా ఎక్కువ గ్రేడింగ్స్ ఇస్తే పరిస్థితి ఏంటనేది మరో అనుమానం. అయితే, సదరు యూనివర్సిటీకి ఇప్పటికే ఉన్న గుర్తింపు ఆధారంగా అవి అందించే సర్టిఫికెట్లు, గ్రేడ్లకు పరిగణన ఉంటుంది.

ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ బ్రాండ్ ఈక్విటీ ప్రధాన కొలబద్దగా మారుతుంది. ఒకవేళ ఇన్‌స్టిట్యూట్‌లు గ్రేడ్లు జారీ చేసినా భవిష్యత్తులో అక్కడ చదువుకున్న విద్యార్థుల పనీతీరు ఆధారంగా వాటి గురించి తెలిసిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు కూడా నాణ్యమైన విద్యను అందిస్తాయని భావిస్తున్నాం. ప్రస్తుతం అమలవుతున్న ఇంటర్నల్స్ విధానంలో పొందే మార్కులను గ్రేడింగ్స్‌లో కలపొద్దని నిర్దేశించాం.
 
వృత్తి విద్య విస్తరణకు కృషి
నేడు పరిశ్రమలకు ఎదురువుతున్న మరో ప్రధాన సమస్య.. వృత్తి విద్య నిపుణుల కొరత. రూసా స్కీం పరిధిలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ కోర్సులను అందించాలని యూజీసీ నిర్ణయించింది. ఆయా కళాశాలల గుర్తింపును పరిగణనలోకి తీసుకొని ఒకేషనల్ డిగ్రీ కోర్సులు ప్రారంభించే ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లకు నిధులు అందించనుంది. వీటి సద్వినియోగానికి, నిరంతర పర్యవేక్షణకు కమిటీని నియమిస్తాం.
 
ఫ్యాకల్టీ కొరత నిజమే కానీ..
యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరత కారణంగా విద్యార్థుల్లో నాణ్యత తగ్గడం వాస్తవమే. ఈ సమస్యపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఫ్యాకల్టీ నియామకాలను చేపట్టాలి. మరోవైపు విద్యార్థులు కూడా అధ్యాపక వృత్తిపై ఆసక్తి పెంచుకోవాలి. ఇప్పుడు చాలామంది కెరీర్ సెటిల్‌మెంట్‌కు ఎంఎన్‌సీ జాబ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. రీసెర్‌‌చ, అధ్యాపక వృత్తి పట్ల ఆసక్తి చూపడంలేదు. రీసెర్చ్ చేసే విద్యార్థులకు యూజీసీ అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా భారీగా పెరిగాయి. దీన్ని గుర్తిస్తే విద్యార్థులకు ఒకే సమయంలో ఆర్థిక తోడ్పాటుతోపాటు అకడెమిక్ ఎక్సలెన్స్‌కు అవకాశం లభిస్తుంది.
 
కొత్తదనాన్ని ఆస్వాదించాలి
విద్యార్థులు నిరంతరం కొత్తదనం ఆస్వాదించేలా మానసిక దృక్పథం మార్చుకోవాలి. బోధన విధి విధానాల పరంగా ఏమైనా మార్పులు జరిగితే అందులో ఉండే సానుకూల అంశాలవైపు మొగ్గు చూపాలి. విద్యార్థులు వ్యక్తిగతంగా సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. అప్పుడే ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా ఇమిడిపోగల సంసిద్ధత లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2015-16 విద్యా సంవత్సరంలో అడుగుపెట్టే విద్యార్థులకు నా సలహా.. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌ను సానుకూలంగా మలచుకుంటే కోర్సు పూర్తయ్యే నాటికి మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌లు అలవడతాయి!!

మరిన్ని వార్తలు