టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ స్పెషల్

16 Sep, 2015 23:45 IST|Sakshi
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ స్పెషల్

గ్రూప్-1 మెయిన్‌‌సకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన సిలబస్‌లో పేపర్-4 (సెక్షన్-3)లో పర్యావరణం-అభివృద్ధి అంశాలున్నాయి. ఈ క్రమంలో గ్రూప్స్ ఔత్సాహికులకు ఉపయోగడే విధంగా సబ్జెక్టు నిపుణులు డా॥తమ్మా కోటిరెడ్డి అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. ఇది ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్ జనరల్ ఎస్సేకు
 కూడా ఉపయోగపడుతుంది.
 
 పర్యావరణ అర్థశాస్త్రం
 పర్యావరణ అర్థశాస్త్రం (Environmental Economics).. మానవాభివృద్ధికి, పర్యావరణానికి మధ్యగల అంతర్గత సంబంధాన్ని సూచిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు అధిక ఆర్థికాభివృద్ధి సాధించేందుకు వివిధ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణకు రూపొందించాల్సిన పథకాలు, ఆయా పథకాల అమలుకు తీసుకోవాల్సిన ఆర్థిక నిర్ణయాలను పర్యావరణ అర్థశాస్త్రం చర్చిస్తుంది.
 అంతర్గత సంబంధం
 
 
 వస్తువుల ఉత్పత్తిని పెంచటం ద్వారా గరిష్ట లాభాలు ఆర్జించాలంటే పర్యావరణ వనరులను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో అర్థశాస్త్ర విభాగాలైన నిశ్చయాత్మక, ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రాలు.. పర్యావరణం, ఆర్థిక వ్యవస్థల మధ్య అంతర్గత సంబంధాన్ని విశ్లేషిస్తాయి. పర్యావరణ ఆస్తులపై ఆర్థిక కార్యకలాపాల ప్రభావాన్ని నిశ్చయాత్మక అర్థశాస్త్రం తెలుపుతుంది. అయితే ఇది ఎలాంటి తీర్పులు ఇవ్వదు. ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం మాత్రం పర్యావరణ వస్తువులను దోపిడీ చేస్తూ, జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయటం సమంజసమా? అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. పర్యావరణ సమతుల్యతకు చేసే పథకాల రచన వల్ల కలిగే లాభనష్టాలు, నష్టాల నివారణకు అనుసరించే మార్గాలు ప్రతిపాదనాత్మక అర్థశాస్త్రం పరిధిలోకి వస్తాయి.
 
 ఆర్థిక వృద్ధి-పర్యావరణం ఆదాయ వినియోగ వ్యత్యాసాలు
 ప్రపంచ వ్యాప్తంగా అల్పాభివృద్ధి దేశాలు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే దేశాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆయా దేశాల్లో పౌష్టికాహార లోపంతో ఇబ్బందిపడే ప్రజల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ దేశాలు రక్షిత తాగునీరు, నిరక్షరాస్యత, పేదరికం, విద్య-వైద్య సౌకర్యాల కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
     ...................................
 ఆహార ధాన్యాల దిగుమతులపై ఆధారపడిన దేశాల్లో పౌష్టికాహారం వృథా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనిక దేశాల్లో జనాభా వృద్ధిరేటు తక్కువైనప్పటికీ, ఆయా దేశాల్లో ఆదాయాల పెరుగుదల ప్రజల్లో అధిక ఆదాయ వ్యత్యాసాలకు కారణమవుతోంది. అల్పాభివృద్ధి దేశాలతో పోల్చినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి పరిమాణం అధికం. దీనివల్ల తలసరి ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యావరణ అసమతుల్యత అధికమవుతోంది.
     ...................................
 తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన ఆ దేశాల్లో ప్రజల జీవన ప్రమాణం, సంక్షేమం పెరిగినట్లు భావించలేం! కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా, పేదరికం తక్కువగా ఉండి సాంఘిక భద్రతా వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల సమస్యల తీవ్రత తక్కువగా ఉంటుంది.
     ...................................
 అల్పాభివృద్ధి దేశాల్లో అధిక శాతం జనాభా పేదరిక రేఖ దిగువున ఉండటం, వారికి కనీస నిత్యావసరాలు అందుబాటులో లేకపోవటంతో పేదరికం తీవ్రత అధికంగా ఉంటోంది.
 భారత్ స్థితిగతులు
 
 సుస్థిర వృద్ధి సాధనకు పర్యావరణాన్ని మూలాధారంగా పేర్కొనవచ్చు. పరిసరాలు, జీవావరణం మధ్య సమన్వయం లోపించటాన్ని పర్యావరణ తులారాహిత్యం అంటారు. బ్రిటిష్ పాలనలో వలస ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. స్వాతంత్య్రానంతరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.
     ...................................
 వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి సాధన ధ్యేయంగా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించటం, అధిక పారిశ్రామికీకరణ కారణంగా శీతోష్ణస్థితి, వాతావరణం మార్పు చెందుతున్నాయి. భారత్‌లో 69.8 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. దేశంలో పర్యావరణ సమతుల్య సాధనకు అడవులు 33.3 శాతంగా ఉండాలని జాతీయ తీర్మానం నిర్దేశిస్తోంది. వాస్తవానికి ప్రస్తుతం దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు వాటా 21.23 శాతం మాత్రమే.
 

>
మరిన్ని వార్తలు