చంద్రబాబును జైల్లోకి తోస్తాం

17 Apr, 2014 02:32 IST|Sakshi
చంద్రబాబును జైల్లోకి తోస్తాం

నిజాం షుగర్స్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాడు : కెసిఆర్

రాజకీయ అవినీతిని రూపుమాపుతాం  
కన్నబిడ్డలైనా సరే... జైలుకు పంపిస్తా
ప్రాణం పోయినా సరే ఆంధ్ర ఉద్యోగులను పంపిస్తామని వ్యాఖ్య

 
 మహబూబ్‌నగర్: ‘‘తెలంగాణ సొమ్ము మింగిన వాళ్లను వదిలి పెట్టం. కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాడు. ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ శాసనసభ కమిటీ సిఫారసు చేసినా పట్టించుకోలేదు. మేం అధికారంలోకి రా గానే... దీనిపై విచారణ జరిపి చంద్రబాబును జైల్ల్లో తోస్తాం’’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన ‘ఎన్నికల జనభేరి’ సభల్లో ఆయన ప్రసంగించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసి ‘పచ్చని పాలమూరు’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పడటం ఖాయమని, ఉద్యమకారులు, ఉద్యమ పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య అధ్యక్షతన జరిగిన వనపర్తి, మహబూబ్‌నగర్ సభల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు మందా జగన్నాథం, ఏపీ జితేందర్‌రెడ్డితో పాటు 14 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. ఈ సభల్లో కేసీఆర్ ఏమన్నారంటే...ప్రాణం పోయినా సరే తెలంగాణ నుంచి ఆంధ్ర ఉద్యోగులను పంపించి వేస్తాం. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఉద్యమించి తెలంగాణ అభివృద్ది కోసం ఒత్తిడి తెస్తాం. బలిదానాలు, త్యాగాలు, దీక్షలు, జైళ్లు, నిర్బంధాలను తట్టుకుని తెలంగాణ సాధించింది కడుక్కు తినడానికి కాదు.
 
మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ అవినీతిని పూర్తిగా రూపుమాపుతా. చివరకు కన్నకొడుకు, కూతురు, బంధువులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపిస్తా.మెడలు పట్టి నూకినా వెళ్లకుండా చంద్రబాబు ఇక్కడే వేళ్లాడుతడట. చంద్రబాబు జెండాలు మోసే సన్నాసులు ఇంకా తెలంగాణలో  ఉన్నారు. తెలంగాణ వచ్చినా వారికి జ్ఞానోదయమైతలేదు.
 
చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అటు టీడీపీ, ఇటు బీజేపీ నడుమ బలవంతపు దోస్తీ కుదర్చడం ద్వారా దొంగతనాలు, దోపిడీలు, అక్రమ కబ్జాలను కాపాడుకునేం దుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ హయాంలో గుటకాయ స్వాహా చేసిన 70వేల ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం. వక్ఫ్‌బోర్డుకు జుడిషియల్ అధికారాలు ఇవ్వడం ద్వారా వక్ఫ్‌భూములు పరిరక్షించడంతో పాటు, గతంలో అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుంటాం.
 
కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అవినీతివల్ల ప్రపంచ దేశాల్లో భారతదేశం పరువు పోయింది. సెటిలర్స్ ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నిధులు, నీళ్లు, నియామకాల్లో ఇంకా వివక్ష కొనసాగాలని కోరుకుంటున్నారు. దేశ రాజధానిలో రాష్ర్టపతి భవన్ తర్వాత అత్యంత విలువైన ఆస్తి హైదరాబాద్ హౌజ్. నిజాం నిర్మించిన ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వానికి అమ్మి, బదులుగా తీసుకున్న ఏపీ భవన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తున్నా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కిమ్మనడం లేదు. తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతికత, హక్కు కాంగ్రెస్ నేతలకులేదు.
 
 నియోజకవర్గానికో కేసీఆర్ సభ
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ప్రతీరోజు కనీసం 8 సభల్లో ప్రసంగించనున్నారు. వీలైతే రోజుకో జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేయాలని.. హెలికాప్టర్‌లోనే ఈ సుడిగాలి పర్యటనలు చేపట్టాలని ఆయన నిర్ణయించారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రతీరోజు ఒక సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో రెండు సభలకు హాజరయ్యారు. ఇదే తరహాలో 19వ తేదీ నుంచి రోజుకు 8 నుంచి 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుగుణంగా ఎన్నికల ప్రచార షెడ్యూలును ఖరారు చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు