ముగ్గురు వీఆర్వోల సస్పెన్షన్

8 May, 2014 03:08 IST|Sakshi

- మరో తొమ్మిదిమందికి నోటీసులు..!  
- మరికొందరిపై కూడా వేటు పడే అవకాశం

 
 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించిన సిబ్బందిపై కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కొరడా ఝళిపిస్తున్నారు. ముగ్గురు వీఆర్వోలను బుధవారం సస్పెండ్ చేశారు. మరో తొమ్మిదిమందికి నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. జిల్లావ్యాప్తంగా పది అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు గత నెల 30న పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన రెండు రోజుల తరువాత కూడా సత్తుపల్లి మినహా మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ శాతం వివరాలు ఇవ్వలేదు. దీనిని కలెక్టర్ సీరియస్‌గా పరిగణించారు.

ఈ వివరాలు ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని రిటర్నింగ్ అధికారులకు నోటీసు ఇచ్చారు. ఇల్లెందు రిటర్నింగ్ అధికారి వివరణ ఆధారంగా ఆ నియోజకవర్గంలోని డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పై ఇప్పటికే కలెక్టర్ వేటు వేశారు. తాజాగా.. కొత్తగూడెం రిటర్నింగ్ అధికారి అమయ్‌కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాల్వంచలోని వీఆర్వోలు రాములు, బాలాజీ, లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ  బుధవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరిపై కూడా వేటు పడే అవకాశమున్నట్టు తెలిసింది.

వేటు ఎందుకు పడిందంటే...
పాల్వంచ: పాల్వంచ పట్ణణంలోని క్లస్టర్ 2,3,4కు చెందిన వీఆర్‌ఓలు వి.రాములు, ఎన్.బాలరాజు, బి.లక్ష్మణ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలింగ్ ఏర్పాట్లు, నిర్వహణపై ఎన్నికలకు నెల రోజుల ముందు నుంచి సిబ్బందికి కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో అమయ్‌కుమార్ పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలని, ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత వీఆర్‌వోలను ఆదేశించారు.

 వీటిని పట్టణంలోని 2,3,4 క్లస్టర్ల వీఆర్‌వోలు వి.రాములు, ఎన్.బాలరాజు, బి.లక్ష్మణ్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో కుర్చీలు, బల్లలు, విద్యుత్, మంచినీరు ఏర్పాటు చేయలేదు. అక్కడకు విధి నిర్వహణ కోసం 29వ తేదీ సాయంత్రం వచ్చిన సిబ్బంది.. సౌకర్యాల లేమిపై రిటర్నింగ్ అధికారి అమయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

 ఆయన ఆదేశంతో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారయిన పాల్వంచ తహశీల్దార్ సమ్మిరెడ్డి.. అదే రోజు రాత్రి ఆ పోలింగ్ కేంద్రాలన్నింటినీ పరిశీలించి, అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవంటూ రిటర్నింగ్ అధికారికి నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా, ఆ ముగ్గురు వీఆర్‌వోలకు రిటర్నింగ్ అధికారి ఈ నెల 2వ తేదీన మోమో ఇచ్చారు. దీనిపై 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ మెమోలో పేర్కొన్నారు. ఆ ముగ్గురూ కేవలం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి మాత్రమే సంజాయిషీ పంపారు. ఈ అన్ని వివరాలతో రిటర్నింగ్ అధికారి అమయ్ కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వీఆర్వోలు రాములు, బాలాజీ, లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు