సమస్యల గూడెం

19 Apr, 2014 02:22 IST|Sakshi

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : జిల్లాలో వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధ చెందిన తాడేపల్లిగూడెం సమస్యల నిలయంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. పూర్తికాని భూగర్భ డ్రెయినేజీ పనులు.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నాయి. రెండో వేసవి జలాశయం, రెండో వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కలగా మారింది. నవాబుపాలెంలో వంతెన నిర్మాణం మూడేళ్లుగా సాగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులు జల్లు కురిపించారు. 2004 నుంచి 2009 వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయగా వైఎస్ మరణానంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మళ్లీ వైఎస్ లాంటి నాయకుడు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.

 పాలిటెక్నిక్ భవన నిర్మాణమెప్పుడో..
 గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలిటెక్నిక్ విద్యను చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సమీపంలో కొంత భూమిని ప్రభుత్వ పాలిటెక్నిక్ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన స్థలంలో భవన నిర్మాణానికి ఇష్టంలేని మరో ప్రజాప్రతినిధి మరో ప్రాంతంలో నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు. కాలం గడుస్తున్నా భవన నిర్మాణం ఊసులేదు. ప్రస్తుతం పెంటపాడు డీఆర్ గోయంకా కళాశాలలోని ఓ శిథిల భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది.
 
 జూనియర్ కళాశాలకు భవనం లేదు
 విద్యాపరంగా ఎంతో విస్తరించిన తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేదు. పదేళ్ల కాలంగా ఇదిగో జూనియర్ కళాశాలకు పక్కా భవనం అంటూ ఊరింపే కాని, ఉద్దరింపులేదు. కళాశాల నిర్మాణం కోసం పలుచోట్ల వేసిన శిలాఫలకాలు అలానే ఉండిపోయాయి. ఫలితంగా జెడ్పీ హైస్కూల్‌లోనే విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువులు కొనసాగిస్తున్నారు.
 
 
 దాహం కేకలు
 తాడేపల్లిగూడెంలో రెండో వేసవి జలాశయం ఎపిసోడ్ ఎంతకు కొలిక్కిరాకపోవడంతో శివారు ప్రాంతాలలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఇది నిత్యనూతనమై పోయింది. గతేడాది మార్చిలో రూ.30 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ముందుకుసాగడంలేదు. జట్లపాలెం చెరువు నిండా గుర్రపుడెక్కతో నిండిపోయింది.

 గూడు కల్పిస్తే ఒట్టు
 తాడేపల్లిగూడెంలో ఇళ్లులేని పేదలు పదివేలకు పైగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు వీరి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ గృహకల్ప వద్ద 52 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి పూడికకు నిధులు విడుదల చేశారు. అయితే మహానేత మరణానంతరం ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేరు. ఇదే ప్రాంతం సమీపంలో 2009లో 20 వార్డులలో అర్హులైన 480 మంది పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 2013 నాటికి 240 ఇళ్లు కట్టి ఇవ్వగలిగారు. వాటిని ఆర్భాటంగా అప్పటి సీఎం కిరణ్ ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇక్కడ మౌలిక వసతుల సమస్య ఉంది. 2007లో 280 మంది పేదలకు వైఎస్ హయాంలో కట్టించి ఇచ్చిన రాజీవ్ గృహకల్పలో సౌకర్యాల సంగతిని నేతలు విస్మరించారు.  

 అబ్బో...అక్విడెక్టు
 నందమూరు పాత అక్విడెక్టు సమస్య ఏళ్ల తరబడి అలానే ఉంది. ప్రతిఏటా ఎర్రకాలువ వేలాది ఎకరాలను మింగేస్తున్నా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. మహానేత వైఎస్ రా జశేఖరరెడ్డి హయాంలో స మస్య పరిష్కారానికి న్యా యపరమైన అభ్యంతరాలు తొలిగాయి. ఆ యన మరణానంతరం వీటిని పట్టించు కున్నది లేదు.

మరిన్ని వార్తలు