నల్లారి బ్రదర్స్ పక్కచూపులు

9 Apr, 2014 13:18 IST|Sakshi
నల్లారి బ్రదర్స్ పక్కచూపులు

మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ సార్వత్రిక ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా, జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు తదితర పరిణామాల తరువాత తొలిసారిగా ఆయన గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన కొత్త పార్టీ ఆవిర్భావంపై ఆయన హైదరాబాద్‌లో అధికారికంగా ఒక ప్రకటన చేశారు. సరిగ్గా నెల రోజుల తరువాత సొంత జిల్లాకు వస్తుండటం గమనార్హం.
 
పార్టీ ఏర్పాటు సమయంలో ఆయన వెంట నిలిచిన పలువురు ప్రముఖులు, మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జారుకున్నారు. జిల్లాలో ఆయనకు బాసటగా నిలిచిన ప్రథమశ్రేణి నాయకులు ఒక్కరు కూడా లేరు. సీఎం హోదాలో హంగూ ఆర్భాటంతో వచ్చే కిరణ్ ఈసారి పర్యటన మాజీ సీఎం హోదాలో జరగనుండటంతో అందరి కళ్లు ఈ పర్యటనపై పడ్డాయి.

సీఎం పదవికి రాజీనామా చేసిన తరువాత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో తర్జనభర్జనలు పడినప్పటికీ చివరికి నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈలోగా మున్సిపల్, పరిషత్ ఎన్నికలు ముంచుకురావడంతో జేఎస్పీ కార్యకలాపాలకు విరామం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల తరువాత పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం మదనపల్లెలో రోడ్ షో నిర్వహించనున్నారు.
 
అనంతపురం జిల్లా కదిరి నుంచి మదనపల్లెకు చేరుకుని రోడ్ షోలో పాల్గొన్న తరువాత స్వగ్రామమైన కలికిరి మండలం నగిరిపల్లెకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేస్తారు. తదుపరి పర్యటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జేఎస్పీ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా జిల్లాకు వస్తున్న ఆయన ప్రజలకు ఇచ్చే సందేశంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
 
సీఎంగా రాజీనామా తరువాత సొంత ని యోజకవర్గం పీలేరులో పట్టు కోల్పోయిన కిరణ్ సోదరులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెల ఆరో తేదీ జరిగిన పరిషత్ ఎన్నికల్లోనూ పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్‌రెడ్డి చక్రం తిప్పారు. పలు మండలాల్లో కిరణ్ వర్గీయుల ను వైఎస్సార్సీపీలో చేర్పించడంలో కృతకృత్యులయ్యారు. ఈ ప్రభావం పరిషత్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
 
ఈ ఎన్నికల ప్రచారం లో కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి కూడా పెద్దగా పాల్గొనలేదు. ఫలితాలను ముందుగానే ఊహించే కిషోర్ ప్రచారానికి దూరంగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంతపార్టీ జెండాతో సార్వత్రిక ఎన్నికలను ఒంటిరిగా ఎదుర్కోవడంపై కిరణ్ సోదరులు ఆందోళనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా కొత్త వ్యూహాలకు తెరతీస్తున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పీలేరు నియోజకవర్గం నుంచి కిరణ్ ఈ దఫా అసెం బ్లీకి పోటీచేసే విషయంలో ముందూవెనకా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గెలిచినాఓడినా లోక్‌సభకు పోటీ చేయడం శ్రేయస్కరంగా భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం రాజంపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీచేసే అంశం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. పొత్తుల్లో భాగంగా ఈ స్థానం బీజేపీకి కేటాయించడం వెనుక జాతీయస్థాయిలో కిరణ్ పావులు కదిపినట్టు టీడీపీ వర్గాలు బలం గా చెబుతున్నాయి. రాజంపేట నియోజకవర్గం పరిధిలో టీడీపీకి బలం ఉండటంతో పాటు పలువురు ముఖ్య నాయకులు టికెట్టు కోసం పోటీపడ్డారు.

అయితే బీజేపీ ఒత్తిడి మేరకు ఆ స్థానాన్ని టీడీపీ వదులుకుంది. ముందుగానే బీజేపీతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం మేరకు ఇక్కడ నుంచి బలహీనమైన అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించినట్టయితే తనకు కొంతవరకైనా మేలు జరుగుతుందని ఉద్దేశ్యంలో కిరణ్ ఉన్నట్టు చెబుతున్నారు. రాజంపేట టికెట్టు ఆశించిన టీడీపీ మాజీ ఎంపీ ఒకరు అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతుండటం గమనార్హం.  
 
సొంత నియోజకవర్గమైన పీలేరులో కిరణ్ సోదరుడు కిషోర్‌ను బరిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. దీంతో టీడీపీ సహకారంతో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలనే వ్యూహం జేఎస్పీ నేతలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆ మేరకు రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో కిరణ్ తన వ్యూహాలను అమలు చేసేందుకు నియోజకవర్గానికి వస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు