నేటితో ప్రచారం బంద్

28 Mar, 2014 03:31 IST|Sakshi

 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. పురపాలక ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో అభ్యర్థులు, పార్టీల నేతలు ప్రచారం నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన కిందకు రానుంది.  జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలలో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలాయి. ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలు తిష్టవేసి ప్రచారం చేస్తూ అభ్యర్థుల విజయం కోసం ఎత్తులు వేశారు.  ఓటర్లను లోబరుచుకునేందుకు తాయిలాలు సైతం అందజేశారు.

 ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఆయా పార్టీల నాయకులు ప్రచా రం నిర్వహించారు. నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుండడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. తమ పార్టీలకు చెంది న జిల్లా స్థాయి నేతలతో ఆయా పార్టీల నాయకులతో లోపాయికారి ఒప్పందాలు చేసే పనిలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే సమ యం ఉండదనే ఆత్రుతతో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటి నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు తమ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పాదయాత్రలు, రోడ్‌షోలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వారి వృత్తి పనుల్లో సహాయ పడుతూ ప్రచారం నిర్వహించారు.


 భారీ బందో బస్తు: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనుండడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో అన్ని వార్డులు సమస్యాత్మకం కావడం తో పోలీసులు అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే మధిర నగర పంచాయతీలో కూడా సమస్యాత్మక వార్డులు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు తలెత్తకుండా ఎస్పీరంగనాథ్ పర్యవేక్షణలో ఏడుగురు డీఎస్పీలు, 36మంది సీఐ లు, 123మంది ఎస్సైలు, 319మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 1812 కానిస్టేబుళ్లు, 442 హోం గార్డులు, 43మంది మహిళా కానిస్టేబుళ్లు, 99 మంది మహిళా హోంగార్డులు, నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలు రంగలోకి దిగనున్నాయి.

మరిన్ని వార్తలు