పచ్చ చొక్కా ధరించి ‘సైకిల్’ ఎక్కు

2 May, 2014 23:03 IST|Sakshi

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పచ్చ చొక్కా ధరించి ‘సైకిల్’ ఎక్కాలని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం సూచించారు. సిద్ధాంతాల పేరుతో పార్టీ స్థాపించిన పవన్ నరేంద్రమోడీ-చంద్రబాబులకు మద్ధతు అంటూ రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. మాదాసు శుక్రవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

బాబు-మోడీలతో పవన్ కల్యాణ్ ప్యాకేజీలు మాట్లాడుకుని ‘మీకు మేము.. మాకు మీరు’ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్టు ప్రజలకు అనుమానాలున్నాయన్నారు. ‘జనసేన’ ముసుగు తొలగించి నచ్చిన వారికి మద్దతిచ్చుకోవాలని హితవు పలికారు. పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అన్నచాటు బిడ్డగా పెరిగిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చిరంజీవి మద్ధతిస్తున్న కాంగ్రెస్ పార్టీపై, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పాపం తల్లీ కొడుకులదేనంటూ సోనియా, రాహుల్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని పవన్‌కు సూచించారు. ఈనెల 3, 4వ తేదీల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారధి చిరంజీవి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారని, 5వ తేదీన ఆత్మకూరు, మదనపల్లె ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని మాదాసు చెప్పారు.
 
వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నజీర్ అహ్మద్
వైఎస్సార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అధ్యక్షుడిగా నజీర్ అహ్మద్‌ను నియమిస్తూ ఏపీ పీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆశోక్‌కుమార్ తప్పుకోవటంతో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న నజీర్ అహ్మద్‌ను ఈ ఎన్నికలు ముగిసేంత వరకూ బాధ్యతలు చేపట్టాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు