ష్యూరిటీగా గొడవ – గ్యారంటీగా నిరసన!

18 Nov, 2023 10:59 IST|Sakshi

నగరంపాలెం: టీడీపీ నిర్వహిస్తున్న ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్‌ గ్యారంటీ’ అనే కార్యక్రమం టీడీపీ, జనసేన నాయకుల మధ్య గొడవకు దారితీసింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఫొటో మినహా గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకుల ఫొటోలు లేకపోవడమే వివాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం గుంటూరు నగరంలోని 18వ డివిజన్‌ శ్రీనివాసరావుపేట ఆరో వీధిలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం ఉందంటూ వారి గ్రూప్‌ల్లో పోస్ట్‌ చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

అయితే ఆ పోస్ట్‌లో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఫొటోలు ఉండగా, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాసరావు ఫొటోలు ముద్రించకపోవడంతో గొడవకు దారితీసింది. ఈలోగా బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమ నిర్వహించేందుకు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొవెలమూడి రవీంద్ర (నాని), నాయకులు తాళ్ళ వెంకటేశ్‌ యాదవ్‌తోపాటు పలువురు శ్రీనివాసరావు పేటకు చేరుకున్నారు.

అయితే అక్కడ జనసేన సైనికులు ఎవరూ కనిపించలేదు. దీనిపై కోవెలమూడి నాని ఆరాతీశారు. ఈలోగా జనసేన డివిజన్‌ నాయకులను ఫోన్లల్లో సంప్రదించారు. జనసేన జిల్లా నాయకులు ఫొటోల్లేవని, ఫ్రొటోకాల్‌ పాటించనప్పుడు అక్కడికి హాజరు కాలేమని బదులిచ్చారు. దీంతో టీడీపీ నాయకులకు ఏం చేయాలో అర్ధం కాక అక్కడి నుంచి వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు