అభివృద్ధి పథంలో నిలబెడతా...

5 May, 2014 01:50 IST|Sakshi
అభివృద్ధి పథంలో నిలబెడతా...

 ఆమదాలవలస, న్యూస్‌లైన్:నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు ఏమి కోరుకుం టున్నారో తెలిసిన వాడినని,  వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆ పార్టీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. ‘న్యూస్‌లైన్’తో ఆదివారం ప్రత్యేకంగా మాట్లాడారు.  
 
 నియోజకవర్గ అభివృద్ధికి మీరేం చేస్తారు?
 ఆమదాలవలసలో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని జగన్‌మోహన్‌రెడ్డి హామీ మేరకు తెరచేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. ఈ ప్రాంత ప్రజలు, రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పాటుపడతా. టీడీపీ హయూంలో పడిన మచ్చను తొలగించుకుంటాను. నాగావళి నదిపై బలసర రేవువద్ద బ్రిడ్జి నిర్మాణానికి కృషిచేస్తా. ఆమదాలవలస-పొందూరుకు అనుసంధానం చేస్తూ నాగావళి నదిపై ఉన్న దూసి బ్రిడ్జిపై వాహనాలు నడిచేందుకు అనుగుణంగా అంతర బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటా.
 
 నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
  పొందూరు మండలంలో కేసవదాసుపురం, నందివాడ, కొంచాడ, లైదాం, రాపాక లతో పాటు సుమారు 20గ్రామాలకు అటు మడ్డువలస, ఇటు నారాయణపురం ప్రాజక్టులు నుంచి సాగునీరు అందడంలేదు. కాలువలు విస్తరింపజేసి సాగునీ టి కల్పనకు కృషిచేస్తాను. పొందూ రు పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాను.
 
 మీకు గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. దీనికి కారణం?
 గ్రామాల్లోని ప్రతి ఒక్కరు మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధిపొందారు. దీంతో వారంతా అండగా నిలిస్తున్నారు. గ్రామీణ ప్రజలనుంచి ఇంత ఆదరణ ఏ పార్టీకీ లేదు. గెలుపు ఖాయం. గెలిచిన తర్వాత ప్రజల అభీష్టం మేరకు అన్ని గ్రామాల అభివృద్ధికి పాటుపడుతాను. అందరివాడిగా మెలగుతాను.

మరిన్ని వార్తలు