అక్కా, తమ్ముడు, అల్లుడు సీమ నుంచే...

22 Apr, 2014 10:47 IST|Sakshi
అక్కా, తమ్ముడు, అల్లుడు సీమ నుంచే...

నందమూరి వారసులు ఈసారి ఒకే ప్రాంతం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తమకెంతో అచ్చొచ్చిన రాయలసీమ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య ప్రచారం కూడా మొదలుపెట్టారు. గతంలో తన తండ్రి, సోదరుడు ప్రాతినిథ్యం వహించిన ఈ స్థానంలో తనకు భారీ మెజారిటీ ఖాయమని ఆయన నమ్మకంగా ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి వైఎస్సార్ జిల్లా రాజంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఇమె ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. మారిన రాజకీయ సమీకరణలతో ఆమె కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. విశాఖపట్నం నుంచే మళ్లీ పోటీచేయాలని భావించినా ఆమె ఆశ నెరవేరలేదు. దీంతో మొదటిసారి రాయలసీమ నుంచి పోటీకి దిగాల్సివచ్చింది. స్థానికేతురాలైన పురందేశ్వరి రాజంపేటలో పాగా వేస్తారో, లేదో చూడాలి.

ఇక నందమూరి వారి అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ విరమణ చేసిన చంద్రమౌళి తొలిసారిగా బరిలో ఉండడంతో చంద్రబాబు గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు. మొత్తానికి అన్నగారి కుటుంబానికి చెందిన ముగ్గురు రాయలసీమ నుంచి బరిలో ఉండడంతో మిగతా ప్రాంతాల్లోని నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కృష్ణా జిల్లా పెనమలూరు టిక్కెట్ అడిగినా చంద్రబాబు ఇవ్వకపోవడం వారిని మరింత బాధ పెట్టింది.

మరిన్ని వార్తలు