హామీలపై వివరణలు సంతృప్తికరంగా లేవు: భన్వర్‌లాల్

18 Apr, 2014 01:31 IST|Sakshi
హామీలపై వివరణలు సంతృప్తికరంగా లేవు: భన్వర్‌లాల్

పార్టీల మేనిఫెస్టోలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక: భన్వర్‌లాల్
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్న హామీలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. తెలుగుదేశం, లోక్‌సత్తా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వివరణలు కోరామని, అయితే వాటి నుంచి వచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవన్నారు. రుణాల మాఫీ పట్ల కొన్ని పార్టీలు వివరణ సంతృప్తిగా లేదని భావించి, తదుపరి చర్యలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించినట్లు చెప్పారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడారు.  టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక వచ్చిందన్నారు. ఆరోపణలు రుజువైతే  చర్యల నిమిత్తం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని చెప్పారు.
 
  లెజెండ్ సినిమా డీవీడీ అందిన తరువాత సంబంధిత కమిటీ పరిశీలిస్తుందని వివరించారు. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి ఫ్యాను గుర్తు కేటాయించడంపై మాట్లాడుతూ, ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తు ఇచ్చిన తరువాత స్వతంత్ర అభ్యర్థికి మళ్లీ అదే గుర్తును రిటర్నింగ్ అధికారి ఏవిధంగా కేటాయించారో తెలియదని, ఈ నేపథ్యంలో ఈసీకి నివేదిక పంపుతామని భన్వర్‌లాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు