ఏటా అవే హామీలు

29 Apr, 2014 01:43 IST|Sakshi
ఏటా అవే హామీలు

 ఎన్నికల సమయంలో హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం.. ఇదీ మన నేతల తీరు. ఏజెన్సీ ప్రాంతమైన ఖానాపూర్ నియోజకవర్గంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రతీ ఎన్నికల్లో నాయకులు ఏటా అవే సమస్యలు లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఈ సారీ అదే మాట చెప్పారు. మరి.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే.
 
ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉట్నూర్ మండల ప్రజలకు సురక్షిత నీరు అందించాలనే ఆశయంతో గ్రామీణ నీటి పారుదలశాఖ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి 2008-09 సంవత్సరంలో ఆర్వో ప్లాంట్లు (రివర్స్ ఆస్మాసిస్) మంజూరు చేశారు. వేణునగర్, పాత ఉట్నూర్(రామాలయం), హనుమాన్‌నగర్, ఫకీర్‌గుట్ట, మొమిన్‌పురా, చిన్నుగూడలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వ్యయంతో ఒక్కో ఆర్వో ప్లాంట్ నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలు పంచాయతీలకు అప్పగించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రారంభం కాకుండానే మూలనపడ్డాయి. ఒక్క వేణునగర్‌లోనే పథకం పనిచేస్తోంది.
 
 మూలనపడ్డ శుద్ధజల కేంద్రం..
 గిరిజనులకు రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత నీరు అందిస్తామని ఐటీడీఏ, వాటర్ హెల్త్ ఇండియా ఆధ్వర్యంలో ఇందిర క్రాంతి పథం, మండల సమాఖ్య భాగస్వామ్యంతో మండలంలోని నర్సాపూర్-బీ గ్రామంలో  ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రం ప్రారంభించి నెలలు గడవకుండానే మూలనపడింది. దీంతో నీటి కోసం స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు.
 
 కలగా వంద పడకల ఆస్పత్రి
 ఏజెన్సీలోని సమస్యాత్మక ఐదు మండలాలకు ఉట్నూర్ ఆస్పత్రే దిక్కు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నార్నూర్ మండల పర్యటనలో గిరిజనుల సౌకర్యార్థం ఉట్నూర్ సీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మహానేత అకాల మరణంతో ఆ హామీ అటకెక్కింది. దీంతో సరైన వైద్యం అందక ఎందరో గిరిజనులు మృత్యువాతపడుతున్నారు.
 
 గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యేనా?
 కేంద్ర ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేయగా.. కేంద్రం నిర్ణయానికి  అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 783 జీవో జారీ చేసింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల ఉన్న 470 ఎకరాల పరంపోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించారు. రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్ తదితర సౌకర్యాలున్నట్లు అధికారులు  ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు ఖాయమని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్మల్‌లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఉట్నూర్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 ఎటుచూసినా సమస్యలే..
 ఖానాపూర్ మండలంలో ఎటుచూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. బాదన్‌కుర్తి వంతెన నిర్మాణం పూర్తవడంతో ఐదేళ్లుగా కరీంనగర్ జిల్లా నుంచి వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. మాస్టర్ ప్లాన్ మరుగున పడడంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది. ఇక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. మండలంలోని పుల్గంపాండ్రి నుంచి ఇచ్చోడ మండలం సిరిచెల్మ రహదారినే కలిపే రోడ్డు నిర్మాణం అటకెక్కింది. ప్రతీ ఎన్నికల్లో నాయకులు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయింది. ఈ రోడ్డు పూర్తయితే ప్రజలకు 30 కిలోమీటర్ల దూరభారం తప్పుతుంది.  మండల కేంద్రం నుంచి కడెం మండలం బెల్లాల్ వరకు ఉన్న 22 కిలోమీటర్ల ప్రధాన రోడ్డు అధ్వానస్థితికి చేరి 15 ఏళ్లుగా శాశ్వత మరమ్మతుకు నోచుకోవడంలేదు. ఎక్బాల్‌పూర్, రాజూరా గ్రామాల మధ్య ఉన్న కడెం మండలం సింగాపూర్ గ్రామాన్ని ఖానాపూర్ మండలంలో కలపాలనే డిమాండ్ అమలుకు నోచుకోవడంలేదు. సోమర్‌పేట్, కుసుంపూర్ కోలాంగూడ మధ్య వంతెన నిర్మాణం కలగానే మిగిలింది.  
 
 కడెం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం..
 ఈ ప్రాంత రైతుల పాలిట వరప్రదాయిని అయిన కడెం సాగునీటి ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 1972లో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పూడిక తొలగింపునకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు 18 వరదగేట్ల కండీషన్ సరిగా లేదు. సాంకేతికపరమైన మరమ్మతులు లేక నీటి లీకేజీలు ఎక్కువయ్యాయి. మరమ్మతుకు నిధుల మంజూరులోనూ పాలకులు వివక్ష ప్రదర్శిస్తున్నారు. కడెం మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కల నెరవేరడంలేదు. ఎందరో నాయకులు ఇచ్చిన హామీలు నీటిమూటలే అవుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఇక్కడ బస్టాండ్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కడెంలో కోటి రూపాయలతో ఫిల్టర్ బెడ్ ప్రకటించినా నిర్మాణానికి చర్యలు తీసుకోవడంలేదు. కడెంలోని రెవెన్యూ కార్యాలయానికి ఇంతవరకు పక్కాభవనంలేదు. అల్లంపల్లి, గంగాపూర్ గ్రామాలకు రహదారి నిర్మాణం హుళక్కే అయింది.
 
 రింగురోడ్డు మరమ్మతు ఎప్పుడో..?
 ఇంద్రవెల్లి మండలంలో రింగ్ రోడ్డు మరమ్మతు చేపట్టి దారికష్టాలు తొలగిస్తామని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గోపాల్‌పూర్, భీంపూర్, టేకిడిగూడా, తుమ్మగూడ, బొప్పాపూర్‌లకు మట్టి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు నెరవేరలేదు.  
 
 రోడ్లు.. అధ్వానం
 జన్నారం మండల కేంద్రం నుంచి ధర్మారం వెళ్లే రోడ్డు దశాబ్దాల కాలంగా మరమ్మతుకు నోచుకోక అధ్వానస్థితిలో ఉంది.  లోతొర్రే, సోనాపూర్ తండా, జన్నారం నుంచి చింతలపల్లి, చెరుకుగూడ, ఇప్పలపల్లికి వెళ్లే రోడ్లు గుంతలమయమై స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నా మరమ్మతు చేయించేవారు కరువయ్యారు. జన్నారంలోని కవ్వాల్ ఆభయారణ్యాన్ని ప్రభుత్వం టైగర్ జోన్‌గా గుర్తించింది. దీంతో మండలంలోని అల్లినగర్, దొంగపల్లి, మల్యాల్, మైసంపేట్ గ్రామాల్లో దశాబ్దాల తరబడి ఉంటున్న సుమారు 150 కుటుంబాల మనుగడకు ము ప్పు ఏర్పడింది. అటవీశాఖ అధికారులు తమను ఎప్పు డు ఖాళీ చేయిస్తారోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి గోడు పట్టించుకునేవారు కరువయ్యారు.

మరిన్ని వార్తలు