‘కడెం’ నీరు వృథా 

27 Sep, 2023 02:22 IST|Sakshi

విరిగిన ప్రాజెక్టు 15వ నంబరు గేటు కౌంటర్‌ వెయిట్‌ 

 ఇన్‌ఫ్లో లేకుంటే ప్రాజెక్ట్‌ మొత్తం ఖాళీనే 

కడెం: నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్ట్‌ 15వ నంబరు గేటు కౌంటర్‌ వెయిట్‌(గేటుకు అనుసంధానంగా ఉండే భారీ దిమ్మె) మంగళవారం తెల్లవారుజామున విరిగిపోవడంతో నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్ట్‌లోకి 13,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఇరిగేషన్‌ అధికారులు నీటి విడుదలకు గేటును ఎత్తే క్రమంలో కౌంటర్‌ వెయిట్‌ విరిగిపోయింది. వరద గేటు మూసివేసే అవకాశం లేనందున నీరంతా వృథాగా పోతోంది.

వెంటనే మరమ్మతులు చేయలేకపోయినా, ఇన్‌ఫ్లో లేకపోయినా ప్రాజెక్ట్‌ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం ఉండడంతోపాటు ఇన్‌ఫ్లో వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎస్‌ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్‌ తెలిపారు. బుధవారం మెకానికల్‌ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతారని, ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. 

ప్రస్తుత నీటిమట్టం 699అడుగులు 
ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 700(7.603టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 699.625(7.504టీఎంసీ) అడుగులు ఉందని, 3,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, వరద గేటు ద్వారా 3,185 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్‌ మొత్తం 18 వరద గేట్లకు గాను గతంలో 2వ నంబర్‌ గేట్‌కు కౌంటర్‌ వెయిట్‌ విరిగినా ఇప్పటికీ వేయలేదు. ఇప్పుడు తాజాగా 15వ నంబర్‌ గేట్‌ కౌంటర్‌ వెయిట్‌ విరగడంతో మొత్తంగా ఆ రెండింటినీ ఆపరేట్‌ చేసే పరిస్థితి లేదు. 

మరిన్ని వార్తలు