అన్ని వర్గాలకూ ప్రాధాన్యం

15 Apr, 2014 03:18 IST|Sakshi
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం

వైఎస్సార్ సీపీ జాబితాపై వాసిరెడ్డి పద్మ వెల్లడి    
 
  హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రకటించిన సీమాంధ్ర లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఇతర పార్టీలతో పోల్చుకుంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా చాలా స్పష్టంగా ఉందని, పార్టీకి, ప్రజలకు సేవలందించే అభ్యర్థులకే చోటు లభించిందని చెప్పారు. ఆమె సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేలా తమ నాయకుడు అందరికీ ప్రాధాన్యం లభించేలా చూశారన్నారు. తొలినుంచి ఊహించినట్టుగానే జాబితాలో అభ్యర్థుల పేర్లున్నాయన్నారు. ఈ జాబితాలో ఇటీవల పార్టీలో చేరిన కరణం ధర్మశ్రీ, బూరగడ్డ వేదవ్యాస్, తాజా మాజీ మంత్రి పార్థసారథిలకు ప్రాధాన్యత లభించిందన్న విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ప్రజలకు సేవలందించే క్రమంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్లనే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగిందని చెప్పారు.

ఒకరిద్దరు తప్పితే అంతా పాతవాళ్లకే టికెట్లు లభించాయన్నారు. ఇంకా మిగిలివున్న ఐదు అసెంబ్లీ, ఒక ఎంపీ సీటుకు కూడా త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించటం జరుగుతుందన్నారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ పోటీ చేయటం గురించి ప్రస్తావించగా.. విశాఖ ప్రజలు విజయమ్మ పోటీ చేయాలని పట్టుబట్టారని, అందువల్లే ఆమె అక్కడినుంచి పోటీ చేస్తున్నారని పద్మ వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ఈ జాబితాలో చోటు దక్కలేదన్న విలేకరుల ప్రశ్నకు పద్మ సమాధాన మిస్తూ ఈ విషయం ఇదివరకే షర్మిల స్పష్టం చేశారని, తన కుటుంబ పరిస్థితులు, పిల్లల చదువు నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరని చెప్పారని తెలిపారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఎందుకు ప్రకటించలేదన్న ప్రశ్నకు రామకృష్ణ తమ్ముడు కొణతాల రఘును బరిలోకి దింపామన్నారు. ఒకేసారి దాదాపు అన్ని స్థానాలకూ జాబితా విడుదల చేయటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో విజయం తమ పార్టీదేనన్నారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా