కరీంనగర్ సోనియా సభ హిట్టా ఫట్టా?

16 Apr, 2014 17:34 IST|Sakshi
కరీంనగర్ సోనియా సభ హిట్టా ఫట్టా?

ఎంతో ఊరించిన కరీంనగర్ సోనియా గాంధీ సభ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నిరాశ కలిగించిందా? జనం అనుకున్నంతగా రాలేదా? కార్యక్రమానికి తగిన రీతిలో ప్రయత్నాలు జరగలేదా? కరీంనగర్లో సోనియా గాంధీ సభతరువాత కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు లెక్కలు తీసే పనిలో పడ్డారు.


తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ సభపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ తెచ్చిందీ, ఇచ్చిందీ కాంగ్రెసేనన్న సందేశాన్ని తెలంగాణ ప్రజల్లోకి ఈ సభ ద్వారా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అంతే కాదు. టీఆర్ ఎస్ బలహీనతలను ఎక్స్ పోజ్ చేయాలని కూడా కాంగ్రెస్ భావించింది. సోనియా గాంధీ ఉత్తేజకరమైన ప్రసంగం చేస్తారని, దాని వల్ల తెలంగాణా ఎన్నికల ప్రచారానికి ఒక వేగం, ఒక ఊపు వస్తాయని కాంగ్రెస్ నేతలు భావించారు.


కానీ సోనియా ప్రసంగంలో పెద్దగా అంశాలేమీ లేకపోవడం, ఆమె టీఆర్ ఎస్ పై పెద్దగా దాడి చేయకపోవడం, తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పాత్ర లేని టీడీపీ, బీజేపీలపై విమర్శలపైనే దృష్టి కేంద్రీకరించడం కాంగ్రెస్ నేతలను నిరాశ పరిచాయి. దీనికి తోడు జనం కూడా ఆశించినంతగా హాజరుకాలేదు. జనాన్ని తీసుకువచ్చే విషయంలో పార్టీ నేతలు పెద్దగా ప్రయత్నాలు కూడా చేసినట్టు కనిపించలేదు. నిజానికి పొన్నాల, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నేతల ప్రభావం ఉన్న ఉత్తర తెలంగాణ సభలో జనం ఆశించినంతగా రాకపోవడం నేతలకు కాస్త నిరాశ కలిగించే అంశమే. మిట్ట మధ్యాహ్నం ఎండ వల్ల సభలో జనం పలుచగా ఉన్నారని కూడా కొందరు చెబుతున్నా పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపించిందని కూడా రాజీకీయ పరిశీలకులు చెబుతున్నారు.


ఇంకా తెలంగాణలో సోనియా మరో సభలోనూ మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ కూడా తెలంగాణ సభల్లో ప్రసంగించబోతున్నారు. ఈ సభలైనా కాంగ్రెస్ ప్రచారానికి వేగం తెస్తాయని పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు