అవి చీకటి రోజులు

2 May, 2014 01:33 IST|Sakshi

 ‘కరువుతో అల్లాడిపోతుంటే మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదయ్యా.. కరెంట్ ఎప్పుడొస్తాదో.. ఎప్పుడు పోతాదో కూడా తెలీని రోజులవి. అసలే పంటలు పండకపోతే బిల్లులతో షాక్ ఇచ్చారు. పంట పండాక బిల్లు కడతామంటే స్టార్టర్లు ఎత్తుకెళ్లారు. అరెస్ట్ చేయించారు. అన్నం పెట్టే అన్నదాతకే ఇలాంటి పరిస్థితి ఉంటే మేం వ్యవసాయం ఎలా చేయల్ల. ఆ రోజులు తలచుకుంటేనే భయమేస్తుంది.
 
 చివరికి వ్యవసాయం చేయకుండా చాలా మంది వలసెళ్లిపోయారు. చంద్రబాబు పాలించిన ఆ తొమ్మిదేళ్ల గురించి ఆలోచిస్తే అన్నం ముద్ద గొంతులోకి దిగదు. మమ్మల్ని పురుగుల్లా చూశారు. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే రైతులను బాగు చేస్తానంటాన్నాడు. ఆయన వచ్చేది వద్దు.. మమ్మల్ని బాగు చేసేది వద్దు’ అని ‘అనంత’ రైతాంగం బాబు జమానాను గుర్తు చేసుకుంటున్నారు.   
 
 బిల్లు చెల్లించలేదని అరెస్ట్ చేశారు
 చంద్రబాబునాయుడు పాలనలో విద్యుత్ బిల్లు చెల్లించలేదని అరె స్ట్ చేయించారు. ఆ రోజులను ఎప్పటికీ మరిచిపోలేం. అప్పట్లో ఉచిత విద్యుత్ సాధ్యం కాదన్న చంద్రబాబు ఇప్పుడు నేనూ ఫ్రీ ఇస్తానని అంటున్నాడు. ఎలా నమ్మాలి... అప్పటి దౌర్జన్యాన్ని ఎలా మరిచిపోవాలి..?
 - రమణారెడ్డి, రైతు, గరుగుచింతలపల్లి, పుట్లూరు మండలం
 
 భయానకం
 చంద్రబాబు పాలన ఒక భయానకం. వరుసగా 6 సంవత్సరాలు కరువు తాండవించింది. ఓ పక్క కరెంటు సక్రమంగా లేక పంటలు పండలేదు. విద్యుత్ బిల్లులు పేరుకుపోయాయి. బిల్లులు చెల్లించడానికి చేతిలో డబ్బు లేక చాలా ఇబ్బంది పడ్డాం. అవమానాలు పడ్డాం.
 - హరిశ్చంద్రనాయక్, ఆర్బీ వంక, రాయదుర్గం మండలం   
 
 రైతులను పురుగుల్లా చూశారు
 పంటలకు పెట్టిన పెట్టుబడులు రాక రైతన్నలు విలవిలలాడుతున్నారు. బోర్లు ఎండిపోయి పంటలు ఎండుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కరెంటు బిల్లులు కట్టాలని ట్రాన్స్‌కో అధికారుల ఒత్తిడి పెంచడం, బిల్లులు కట్టలేదని స్టాటర్లు ఎత్తుకెళ్లడానికి పోలీసులు పొలాల్లోకి వస్తుండటంతో భయపడిపోయేవారం. చంద్రబాబునాయుడు పాలనలో రైతులను పురుగులు కంటే హీనంగా చూశారు.                   
 -పుల్లప్ప, తంబాపురం, బత్తలపల్లి మండలం
 
 వ్యవసాయం చేయాలంటేనే భయం
 చంద్రబాబు పాలనలో వ్యవసాయం చేయాలంటేనే భయమేసేది. కరువు పరిస్థితుల్లో ఆర్థికంగా చితికిపోయిన రైతులను ఆదుకునేది పోయి కరెంటు బిల్లుల బకాయిలు కడతారా లేక కేసులు పెట్టాలా అంటూ బెదిరించారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు.. బకాయిల పేరిట బెదిరింపులు తాళలేక నాకున్న మూడు ఎకరాలను సైతం అమ్ముకుని జీవిద్దామనుకున్నా. వ్యవసాయం దండగ అనేలా పాలన సాగించడంతో ఇక ఎవ్వరూ వ్యవసాయం చే యడానికి సాహసించే పరిస్థితి లేకుండా చేశారు.
   - హనుమంతురాయుడు, దుద్దేకుంట గ్రామం, బెళుగుప్ప మండలం
 
 ఆ రోజులు తలుచుకుంటే భయమేస్తుంది
 ఆ నాటి చంద్రబాబు రోజులు గుర్తుకు వస్తే భయమేస్తుంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని రోజులలో కరెంట్ బిల్లుల కోసం అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి బిల్లుల కోసం వేధించారు. బిల్లులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ పొలం వద్ద వున్న స్టార్టర్ పెట్టెను ఎత్తుకెళ్లారు. ఇదేమి న్యాయమని అడిగితే అప్పట్లో కేసు బనాయించారు. కేసులకు, అధికారులకు భయపడి అప్పులు చేసి మరీ కరెంటు బిల్లులు చెల్లించాను. పగ వారికి కూడా అలాంటి కష్టాలు రాకుడదు.                    
 - వెంకట్రాముడు, రైతు, తుంపర్తి, ధర్మవరం
 
 ఎప్పుడొస్తుందో తెలిసేది కాదు
 ఆ చీకటి రోజులు గుర్తుకు చేసుకుంటేనే భయమేస్తోంది. చంద్రబాబునాయుడి పాలన లో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితి. పొలం కాడే కాసుకుని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లం. అయినా కరెంటు వచ్చేది కాదు. పంటలకు సరిపడ నీటిని అందించలేక ఎండబెట్టుకున్నాం.
 - మల్‌రెడ్డి, రైతు, ఎన్.రెడ్డివారిపల్లి, ఎన్‌పీ కుంట మండలం
 
 సాగు నీటి కోసం ఆందోళన చేస్తే కేసులు పెట్టారు
 అది 2002 సంవత్సరం.. వరిసాగు కోసం కణేకల్లు ప్రాంతంలోని రైతులంతా జూలైలో వరినారు పోసుకున్నారు. సయమం దాటినా సాగునీరివ్వకపోవడంతో ఆగ స్టు 1 నుంచి 15 వరకు నిరవధికంగా ఆందోళన చేశాం. అయినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. పంట సాగుకు సమయం దాటిపోతుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన రైతులు హెచ్చెల్సీ కార్యాలయం వద్ద ఆందోళనలు చేశారు. కడుపు మంట తట్టుకోలేక కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే రైతులపై కేసులు బనాయించారు. పోలీసుల చేత వెంటాడించి రైతులను అరెస్ట్ చేయించారు.          - నల్లపురెడ్డి, రైతు, కణేకల్లు
 
 కేసు పెట్టి.. కోర్టుచుట్టూ తిప్పారు
 నాకు బోరుబావి కింద ఎకరా తరి భూమి ఉంది. చంద్రబాబు హయాంలో పంటలు పండక విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో కరెంటోళ్లు రూ.8 వేలు బకాయి చూపించి కట్టాలంటూ ఒత్తిడి చేశారు. నా వద్ద లేదు మొర్రో అని ఎంత బ్రతిమాలినా వారు పట్టించుకోలేదు. రెండు స్టార్టర్లు ఎత్తుకెళ్లిపోయారు. అంతటితో ఆగక పోలీస్ కేసు కూడా పెట్టారు. దీంతో చాలారోజులు కోర్టు చుట్టూ తిరిగా.
 - బాపూజీనాయక్, గుడ్డంపల్లి తండా, ముదిగుబ్బ మండలం
 

మరిన్ని వార్తలు