అంతా గతమే!

27 Mar, 2014 03:09 IST|Sakshi

ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ కంచుకోట బీటలువారింది. ఎమ్మిగనూరులో ఆ పార్టీ ప్రాభవం కోల్పోయింది. 1984లో ఉప ఎన్నికల సందర్భంగా ఉలిందకొండకు చెందిన జ్యోతిష్కుడు బి.వి.మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో ఉండటం ఆయనకు కలిసొచ్చింది.
 
 ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు బీవీ ఏకధాటిగా హవా కొనసాగించారు. ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులను చేపట్టారు. 2004లో ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి బీవీ పరంపరకు బ్రేకులు వేశారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు కూడా ఎర్రకోట పైచేయి సాధించారు. 2012లో బీవీ అనారోగ్యంతో తనువు చాలించారు. అప్పటి నుంచి పార్టీ పరిస్థితి దిగజారింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా బీవీ మరణం సెంటిమెంట్ కలిసొస్తుందనే భావనతో పార్టీ అధిష్టానం ఆయన కుమారుడు బి.వి.జయనాగేశ్వరరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. వ్యాపారంలో ఒడిదొడుకులు.. ఆర్థిక ఇబ్బందులతో నేపథ్యంలో ఆయన చాలా కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు.

గత ఏడాది పంచాయతీ ఎన్నికల్లో అన్ని గ్రామాల నుంచి టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిచిపా ఆశించిన ఫలితాలు దక్కించుకోలేకపోయారు. అప్పట్లో చాలా మంది గ్రామ, మండల స్థాయి నాయకులు శక్తి మించి ఖర్చు చేసి చేతులు కాల్చుకున్నారు. సదరు మొత్తాన్ని తిరిగిస్తానని మొదట భరోసానిచ్చిన ముఖ్య నేత ఆ తర్వాత ముఖం చాటేశారు. నాగేశ్వరరెడ్డి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని ఎన్టీఆర్ భవన్‌లో తిష్ట వేసినా అధినేత సుముఖత వ్యక్తం చేయలేదనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో శ్రేణులు ఆయన వెంట నడిచేందుకు సంశయిస్తున్నారు. ప్రస్తుతం ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి టి.జి.వెంకటేష్ నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
 
 ఆయన కనుసన్నల్లోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బీఫాంలు అందజేయగా.. నాగేశ్వరరెడ్డి ఎటూ పాలుపోని పరిస్థితుల్లో అభ్యర్థులతో పాటు ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తెరపైకి రావడం పార్టీ నాయకులు, కార్యకర్తలను మరోసారి గందరగోళానికి గురిచేసింది. ఎన్నికల ఖర్చు ఎవరికి వారే పెట్టుకోవాలని.. తన పరిస్థితి అంతంతమాత్రమేనని ఆయన చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. చేసేది లేక స్థానికంగా పట్టున్న కొందరు నాయకులు మాత్రమే పార్టీ తరఫున ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
 
 గోనెగండ్ల చేజారినట్లే... నియోజకవర్గంలో కీలకమైన గోనెగండ్ల దాదాపుగా టీడీపీ చేజారింది. నియోజకవర్గ ఇన్‌చార్జికి రాజకీయ అనుభవం లేని కారణంగా ఈ మండలంలో ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. జెడ్పీటీసీ బీఫాంను టీడీపీని నమ్ముకున్న వారిని కాదని ఇటీవల పార్టీలోకి వచ్చిన గాజులదిన్నె అనుమంతు కుటుంబానికి కట్టబెట్టడంతో స్థానికంగా చిచ్చు రాజేసింది.
 
 ఫలితంగా మండలంలో పట్టున్న నాగేష్‌నాయుడు వర్గం మనస్థాపానికి లోనైంది. ఆయనతో పాటు అనుచరులు ఎంపీటీసీ స్థానాలకు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 5 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగే 16 స్థానాల్లోనూ తొమ్మిది చోట్ల టీడీపీ పోటీ నామమాత్రం కానుంది.
 
 నందవరం.. అసమ్మతిస్వరం
 ఈ మండలంలో పట్టున్న టీడీపీ నేతలు మాధవరావ్‌దేశాయ్, ముగతి ఈరన్నగౌడ్‌లకు స్థానిక ఎన్నికల్లో ఘోర అవమానం ఎదురైంది. ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని ఆశించిన దేశాయ్‌కి చుక్కెదురైంది. ఫలితంగా ముగతి-1 స్థానం నుంచి పోటీ చేసిన ఆయన బరి నుంచి తప్పుకున్నారు. జెడ్పీటీసీ స్థానానికి ఈరన్నగౌడ్ భార్య నరసమ్మను పోటీకి నిలిపారు. అయితే పార్టీ బీఫాం నాగరాజ్‌గౌడ్ భార్య పుష్పావతికి ఇవ్వడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. నాగేశ్వరరెడ్డి వ్యవహారశైలితో ప్రస్తుతం పార్టీ శ్రేణులు భగ్గుముంటున్నారు. ఇక ఎమ్మిగనూరు మండలం, పట్టణంలోనూ పార్టీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థితిలో లేకపోవడం నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.
 

మరిన్ని వార్తలు