కిరణ్కు మిగిలేవి చెప్పులేనా?

7 Apr, 2014 12:34 IST|Sakshi
కిరణ్కు మిగిలేవి చెప్పులేనా?

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ గుర్తును ఏ ముహూర్తంలో నిర్ణయించుకున్నారో గానీ.. ఆయనకు మిగిలేది ఆ చెప్పుల జత ఒక్కటే అనిపిస్తోంది. నాయకులు అందరూ ఒక్కొక్కళ్లుగా జై సమైక్యాంధ్ర పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో దగ్గరుండి పార్టీ పెట్టించిన వాళ్లంతా క్రమంగా జారుకుంటున్నారు. నమ్మిన బంటులా ఉన్న పితాని సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. అనుంగు అనుచరుడిగా భావించిన రాజంపేట మాజీ ఎంపీ సాయిప్రతాప్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే మళ్లీ తాను రాజంపేట నుంచే లోక్సభకు పోటీ చేస్తానని కూడా చెప్పేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ఆశీస్సులు తీసుకుని మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోడానికి సిద్ధమైపోయారు.  (చదవండి: కిరణ్కు సాయిప్రతాప్ షాక్)

దీంతో తాను నమ్ముకున్న నలుగురైదుగురు నాయకులు జారిపోతుండటంతో ఏం చేయాలో తెలియక కిరణ్ కుమార్ రెడ్డి తల పట్టుకుంటున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ మొత్తం ముగిసేవరకు దగ్గరుండి కాంగ్రెస్ అధిష్ఠానానికి సహకరించిన ఆయన, అంతా అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కొత్త పార్టీ పెట్టారు. ఆ సమయంలో ఆయన వెంట పట్టుమని పదిమంది నాయకులు కూడా ఉన్న పాపాన కనిపించలేదు. మళ్లీ రెండు రాష్ట్రాలను విలీనం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిస్తానంటూ గొంతుచించుకుని మైకు పట్టుకుని చెబుతున్న కిరణ్ కుమార్ రెడ్డి.. చివరకు తాను స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో తానొక్కరే మిగిలేలా ఉన్నారు. ఎన్నికల గుర్తుగా పెట్టుకున్న చెప్పుల జత వేసుకుని కిరణ్ వెళ్లిపోవాల్సి ఉంటుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు