రిటర్నింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

9 May, 2014 01:26 IST|Sakshi

 కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత కూడా జిల్లా కేంద్రానికి వివరాలు అందకపోవడంపై జిల్లా కలెక్టర్ సంబంధిత రిటర్నింగ్ అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత వివరాలను అంచనా మీద తెలిపారు. కచ్చితమైన వివరాలు గురువారం మధ్యాహ్నానికి అందాల్సి ఉండగా.. ఒకటి, రెండు నియోజకవర్గాల నుంచి రాత్రి 7 గంటలకు రాకపోవడం కలెక్టర్ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పోలింగ్ వివరాలు సత్వరం పంపాలని సాయంత్రం నుంచి కలెక్టర్ వెంటపడుతుండగా.. పలువురు ఆర్‌ఓలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా వివరాలు మధ్యాహ్నానికి తయారు చేశారు.

అయితే కలెక్టర్ కార్యాలయానికి మాత్రం వివరాలను ఏడు గంటలకు అందజేశారు. పాణ్యం రిటర్నింగ్ అధికారిపై జిల్లా అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు ఇవ్వడానికి కరెంటు లేదని చెప్పడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఫోన్‌లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు డీఆర్‌ఓ, జెడ్పీ సీఈఓ తదితరులు లైన్‌లోకి వెళ్లి గట్టిగా అడగటంతో నింపాదిగా వివరాలు అందజేశారు. కర్నూలు, శ్రీశైలం, ఆర్‌ఓలు కూడా వివరాలు ఇవ్వడంలో అలసత్వం వహించారు.

>
మరిన్ని వార్తలు