సముద్ర తీర ప్రాంతాల సందర్శన

4 Jul, 2014 00:02 IST|Sakshi

పాఠక పర్యటన
 
 మూడు సముద్రాలు కలిసే చోట స్నానాలు... మంచుకొండలలో అద్భుతాలు...
 ‘పచ్చని తరులు నెలకొన్న గిరులు మండువేసవిలో చల్లందనాన్ని... అలలు లేని సముద్రంపై లాంచీలలో విహారం ఆహ్లాదాన్ని ... ఆలయాల సందర్శన ఆధ్యాత్మికత సౌరభాలను ఎదనిండా నింపింది’ అంటూ కొచ్చిన్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన తమ ప్రయాణపు అనుభూతుల గురించి వివరిస్తున్నారు హైదరాబాద్ వాస్తవ్యులైన వీరయ్యకొంకల.

మండువేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడానికి విహారయాత్ర చేద్దామని మిత్రులు జె.కె శ్రీనివాస్, కె.భరత్‌ల కుటుంబాలతో కలిసి రెండు నెలల ముందుగానే ప్లాన్ చేశాం. దీని వల్ల మొత్తం తొమ్మిది రోజులలో 14 ముఖ్య ప్రదేశాలను చూడగలిగాం. దాదాపు 4,220 కి.మీ... కొచ్చిన్ నుండి చెన్నై వరకు ఉన్న అన్ని సముద్ర తీర ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేశాం. రాత్రి హైదరాబాద్ నుండి బయల్దేరి మరుసటి ఉద యం 10 గంటలకు కోయంబత్తూరులో రైలు దిగాం. ఘాట్‌రోడ్‌లో దారి కిరువైపుల ఎత్తై చెట్లు, వంపుల రోడ్లు, సన్నగా ఉన్న సింగిల్ రోడ్‌లో మా ప్రయాణం సాగింది.  
 
పచ్చందనాల ఊటి... ముందుగా ఊటి చేరుకున్నాం. తమిళనాడులో నీలగిరి పర్వతాలలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం ఊటి. ఎటు చూసినా పచ్చదనం మంత్రముగ్ధులను చేశాయి. ఇక్కడ భోజనాల సమయంలో తాగడానికి వేడినీళ్ళు ఇచ్చారు. ముందు ఆశ్చర్యం అనిపించినా, వేసవిలోనూ చల్లగా ఉండే వాతావరణం అబ్బురమనిపించింది.
 
అలలు లేని సముద్రం.. రెండవరోజు ఉదయం కొయంబత్తూరుకు వెళుతూ మధ్యలో తేయాకు తోటలను సందర్శించాం. కోయంబత్తూరు నుండి ఎర్నాకుళం చేరుకుని, సాయంకాలం కొచ్చిన్ ఓడరేవుకు చేరుకున్నాం. అలలు లేని గంభీర సముద్రం.. అక్కడక్కడా ఆగి ఉన్న పెద్ద పెద్ద ఓడలను చూస్తూ ఎంజాయ్ చేశాం.
 
ద్వీపాల సముదాయం... మూడవరోజు ఉదయం అలెప్పీ చేరుకున్నాం. ఇక్కడంతా సముద్రం బ్యాక్ వాటర్, చిన్న చిన్న ద్వీపాల సముదాయాలతో ఉంటుంది. నీటిలో అక్కడక్కడా లాంచీల స్టాండులు, చిన్న చిన్న గ్రామాలు... వింతగా అనిపించాయి. అలెప్పీ బీచ్‌కు వెళ్లి 4 గంటలకు పైగా సముద్రంలో ఎంజాయ్ చేసి తిరిగి ఎర్నాకుళం చేరుకున్నాం. రాత్రి కి తిరువనంతపురం బయల్దేరాం.
 పద్మనాభుని సందర్శన... నాలుగవ రోజు కేరళలోని తిరువనంతపురం లో పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లి, అటు నుంచి 10 కి.మీ దూరంలో కోవలం బీచ్‌లో గంటల తరబడి చల్ల చల్లగా ఎంజాయ్ చేశాం.
 
పడమటి సింధూరం కన్యాకుమారి... భారతదేశానికి దక్షిణ దిక్కున చిట్టచివరి ప్రదేశమైన కన్యాకుమారి ప్రకృతి సిద్ధమైన అద్భుతం. ఇక్కడ సూర్యోదయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అరేబియా, బంగాళాఖాతం, హిందూమహాసముద్రం కలిసే చోట అందరం స్నానాలు చేశాం. ఆసియాలో అతి పెద్ద విగ్రహం తిరుళ్ళువార్ సముద్రంలో 133 అడుగుల ఎత్తులో ఉంటుంది. దానికి దగ్గరలోనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ నుంచి మధురై బయల్దేరాం.  
 
పవిత్ర నగరం మదురై... తమిళనాడులోని మదురై నగరంలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని, అనంతరం ట్రావెల్ బస్సులో రామేశ్వరంకు ప్రయాణించాం. తమిళనాడులోని ముఖ్య పట్టణాలలో రామేశ్వరం ఒకటి. శ్రీలంకకు అతి దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఎంతో విశాలంగా  అద్భుతంగా ఉంటుంది. మేమంతా సముద్రంలో స్నానాలు చేసి, ఆలయానికి చేరుకున్నాం.
 
మేఘాలలో విహారం... కొడెకైనాల్! ఏడో రోజు ఉదయం ట్రావెల్ బస్సులో కొడెకైనాల్ బయల్దేరాం. ఘాట్‌రోడ్డు మీద ప్రయాణం.. కొంతసేపు ఎండకాస్తే, మరికొంతసేపు వానజల్లులతో తడిసిపోతున్న కొండకోనలు కనువిందుచేశాయి. మే చివరి వారంలో.. అదీ మండువేసవిలో... స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించినా చలికి తట్టుకోలేకపోయాం. మధ్య మధ్యలో జలపాతాలు.. వాటి పరిసరాలలో వేడి వేడి పదార్థాలు తిని చలి నుంచి సాంత్వన పొందాం. రైలులో రాత్రికి చెన్నై బయల్దేరి, ఎనిమిదవ రోజు ఉదయం చెన్నై నుండి 70 కి.మీ దూరంలో కంచీపురం చేరుకున్నాం. అక్కడ కంచికామాక్షి, ఏకాంబరేశ్వర, కంచి మఠం దర్శించుకొని, కంచి పట్టుచీరల సొగసు, మెరీనా బీచ్ అందాలను గుండెల్లో నింపుకుని, రాత్రి రైలులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాం.
 

మరిన్ని వార్తలు