ఇది సాధికారత శోధన

7 Mar, 2018 03:50 IST|Sakshi

సంశోధన్‌ 

మధ్యభారతంలో ఓ కుగ్రామం పర్మినో. తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా అక్కడంతా మగవాళ్ల పెత్తనమే. ఆడవాళ్లు తల బయట పెట్టాలంటే తల మీద గూంఘట్‌ను సవరించుకోవాలి. వాకిలి బయట తలపెట్టి తమను ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత కానీ అడుగు గడపదాటదు. అలాంటి కుగ్రామంలో ఊరి పెత్తందారు రతన్‌సింగ్‌. అతడి మాటకు తిరుగులేకుండా సాగిపోతోంది. అప్పుడు వచ్చిందో చట్టం. అది 73, 74 రాజ్యాంగ సవరణ. ఆ సవరణ ప్రకారం స్థానిక పరిపాలనలో మూడవ వంతు మహిళలు ఉండాలి. పదిమంది వార్డు సభ్యులు ఉండే పంచాయితీలో కనీసం ముగ్గురైనా మహిళలు ఉండాలి. అది చట్టం రూపం సంతరించుకుంది కాబట్టి గ్రామ పరిపాలనలో మూడవ వంతు మహిళలు ఉండి తీరాలి. చట్టాన్ని ఉల్లంఘించకూడదు. అలాగని ఊరి పెత్తనం తన చేతి నుంచి జారిపోవడానికి వీల్లేదు. పెత్తనం చేయి దాటుతుందనే ఆలోచననే భరించలేని స్థితిలో ఉంటాడు రతన్‌ సింగ్‌. ‘కర్ర విరగకూడదు, పాము చావాలి’ ఎలా...

మన ఇంటి మహిళ అయితే!
ఆ మూడవ వంతు మహిళలు తమవాళ్లే అయితే? గొప్ప ఆలోచన. తన తెలివి తానే మురిసిపోతూ మీసం మెలేసుకుంటాడు రతన్‌సింగ్‌. కొడుకు ఇందర్‌కు చెప్తాడు ఈ సారి పంచాయితీ ఎన్నికలలో కోడలు మంజు పోటీ చేయాలని. అది ఇంటి పెద్ద తీర్మానం. ఊరిపెత్తనం ఇల్లు దాటి పోకుండా ఉండడానికి చేసిన తీర్మానం. ‘మంజు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది’ నిర్ణయం జరిగిపోయింది. నామినేషన్‌ పేపర్లు ఇంటికే వచ్చేశాయి. మగవాళ్లు చూపించి చోట సంతకం పెట్టడమే మంజు చేయాల్సింది. మామగారు, భర్త చెప్పినట్లు సంతకం చేసింది మంజు. ఇక మిగిలిన ఇద్దరు మహిళలు? పైగా ఈ ముగ్గురిలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్, షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కూడా కవర్‌ అవ్వాలి. రతన్‌ సింగ్‌ మాటకు ఎదురు చెప్పని అనుచరులు గుర్తొచ్చారు. వారికి భార్యలున్నారు చాలు. పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మగవారి నిర్ణయాలు అమలులోకి వచ్చేశాయి, వారు సూచించిన మహిళలే పంచాయితీ సభ్యులయ్యారు. 

పంచాయితీ సమావేశాల సమయంలో ఈ ముగ్గురు మహిళలూ గూంఘట్‌లు మరింత కిందకు లాక్కుంటూ భర్తల వెంట పంచాయితీ కార్యాలయాలకు వెళ్తుంటారు. మగవాళ్లంతా ఒక గదిలో కూర్చుని గ్రామ వ్యవహారాల మీద చర్చిస్తుంటారు. ఆడవాళ్లు మాత్రం మగవాళ్ల కంట పడకుండా మరొక గదిలో కూర్చుంటారు. పంచాయితీ గుమాస్తా రికార్డు బుక్‌ తీసుకుని ఆడవాళ్లున్న గదిలోకి వినయంగా వచ్చి సంతకాలు తీసుకుని వెళ్లిపోతుంటాడు. అది కూడా పంచాయితీ పెద్ద చెప్పినప్పుడు. ఆ క్లర్కు రికార్డు బుక్‌ తెచ్చినప్పుడు సంతకాలు పెట్టడానికా తాము సభ్యులైంది? మహిళా సభ్యులలో ఆలోచన రేకెత్తింది. వారిలో విద్య ఒక్కటే చదువుకున్న అమ్మాయి. ఎన్నికలకు కొద్ది ముందుగా పెళ్లయి ఆ ఊరికి వచ్చిన కొత్త కోడలు. ఆమె ఊరి పెద్ద పెత్తందారీ తనానికి తలొగ్గదామె. పంచాయితీకి విడుదలైన నిధులు ఏమవుతున్నాయి? బడి నిర్మాణం అసంపూర్తిగా ఎందుకు ఉంది? వంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆమెను నియంత్రించడానికి ఆమె భర్త మీద ఒత్తిడి తెస్తుంటాడు రతన్‌సింగ్‌. దాంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. ఒత్తిడులకు భయపడి వెనుకడుగు వేయకుండా ముందడుగు వేయడానికి విద్య పోరాడుతుంది. మహిళలు సంఘటితమయ్యారు.

తమకూ మెదడు ఉందని, దానికి ఆలోచనలు ఉన్నాయని, ఇంటిని దిద్దడమే కాదు ఊరిని బాగు చేయడం కూడా తమకు చేతనవుతుందని నిరూపిస్తారు గ్రామంలోని మహిళలు. ఎంపవర్‌మెంట్‌ ఒకరు ఇస్తే వచ్చేది కాదు, సాధికారత సాధించుకోవాలనే తపన మహిళలో ఉండాలి. ఒకసారి ఆ బీజం పడితే అది మొలకెత్తక మానదు, మహావృక్షంగా మారకా మానదు. 
– వాకా మంజులారెడ్డి

∙నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, యునిసెఫ్‌లు సంయుక్తంగా 1996లో నిర్మించిన సంశోధన్‌ సినిమాకు గోవింద్‌ నిహలానీ దర్శకత్వం వహించారు. 
∙73,74 రాజ్యాంగ సవరణ బిల్లును 1992లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా, అది 1993 ఏప్రిల్‌లో అమలులోకి వచ్చింది. ఈ సవరణల ఆధారంగా రూపొందిన చట్టం... స్థానిక పరిపాలనలో మూడవ వంతు మహిళల భాగస్వామ్యం ఉండాలని చెప్తోంది.

మరిన్ని వార్తలు