మూగజీవాల అమ్మ

18 Dec, 2019 00:37 IST|Sakshi
మూగ జీవాలతో అంజలి గోపాలన్‌

సేవాపథం

మనిషికి ఏదైనా అపాయం జరిగినా కన్నెత్తి చూడని, నోరెత్తి పలకరించిన ఈ సమాజంలో  మూగజీవాల గాయాలకు మందు రాసి, బలికాబోయే జీవాలను రక్షించి ప్రేమగా అక్కున చేర్చుకుంటున్నారు ఢిల్లీ వాసి అంజలి గోపాలన్‌. ‘ఆల్‌ క్రియేచర్స్‌ గ్రేట్‌ అండ్‌ స్మాల్‌’ అనే పేరుతో మూగజీవాలకు ఆశ్రమం ఏర్పాటు చేసిన అంజలి ప్రతీ మూగజీవి ఆరోగ్యం, పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

ఒక గేదె కాలి వెనుక భాగంలో గాయమై ఎటూ కదలక ఉండటం గమనించింది అంజలి గోపాల్‌. దాని కాలికి కట్టుకట్టి, మేత వేసింది. ఎంతకాలం ఎదురు చూసినా దాని సంబం«ధీకులు ఎవరూ రాలేదు. దాంతో తను స్థాపించిన షెల్టర్‌కి చేర్చింది అంజలి. దానికి భీమ్‌ అని పేరు పెట్టింది. భీమ్‌ 700 మూగజీవాల్లో ఒకటిగా చేరింది. అన్ని జీవాలకు ఒక్కో పేరు పెట్టి, తాను పెట్టిన పేరుతో వాటిని పిలుస్తూ బిడ్డల్లా సాకుతుంది అంజలి గోపాలన్‌. 

ఈ ఆశ్రమంలో వందకు పైగా కన్ను, చెవులు పోయిన జీవాలున్నాయి. ఈ మూగజీవాల గురించి అంజలి మాట్లాడుతూ ‘మానవ ప్రపంచంలో ఎందుకూ పనికి రావనుకున్న జీవాలను ఏదో విధంగా చంపేస్తుంటారు. అలాంటి దృశ్యాలను చూసి, మనసు చెదిరి ఈ షెల్టర్‌ను ఏర్పాటు చేశాను’ అని చెబుతారు.

గాయాలకు మందు
ఢిల్లీ కుతుబ్‌ మినార్‌ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీదాబాద్‌ జిల్లాలోని సిలఖారీ గ్రామంలో అంజలి గోపాలన్‌ ఈ మూగజీవాల ఆశ్రమం నడుపుతోంది. 1994లో ఢిల్లీలో హెచ్‌ఐవి బాధితుల కోసం ఆశ్రమాన్ని స్థాపించిన సామాజిక కార్యకర్త ఆమె. ఇప్పుడు ఈ  ప్రాంతానికి సందర్శకులూ వచ్చి చూస్తుంటారు.  

‘2012లో ఈ షెల్టర్‌ను ప్రారంభించినప్పుడు చుట్టుపక్కల అంతా ఇదో ‘పిచ్చి’ ప్రయోగం అన్నారు. రాజధానిలో అంజలి ఒక జంతువుల ఆశ్రమాన్ని చూసినప్పుడు అక్కడ ఉంచిన జంతువుల స్థితిని చూసి భయపడ్డారు. జంతువులకు నరకంగా ఉన్న ఆ పరిస్థితులను చూసి మానవులుగా మనం మరింత పాపం చేస్తున్నట్టు భావించారు. కానీ, సరైన స్థలం ఎక్కడా దొరకలేదు. హెచ్‌ఐవి సోకిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమం అప్పటికే బాధితులతో నిండి ఉంది. అప్పుడే అంజలి ఫరీదాబాద్‌లో రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి, షెల్టర్‌ ఏర్పాటు చేశారు.. వృద్ధాప్యం, అనారోగ్యం, గాయాల కారణంగా బయట జీవించలేని కుక్కలను ఈ షెల్టర్‌లో ఉంచాలనుకుంది. ముందు 55 శునకాలతో ప్రారంభమైంది. ఇప్పుడు ఈ షెల్టర్‌లో 460 జీవాలు సేదతీరుతున్నాయి. 

రక్షణ కేంద్రం
మెల్ల మెల్లగా కొన్నాళ్లకు పెద్ద జంతువులు రావడం మొదలైంది. దీంతో ఒక్కోరకం జంతువులకు ఒక్కో తరహా స్థలం కేటాయించారు. ఈ షెల్టర్‌కి వచ్చిన ప్రతి జీవి వైద్యచికిత్స పూర్తయ్యాక గాని ఇక్కడ నుంచి బయటకు రాదు. 23 మంది సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తుంటారు. ‘ఈ జీవాలను చూస్తే మానవ క్రూరత్వం ఎంతటిదో అర్థమవుతుంది’ అంటుంది అంజలి. ‘జైపూర్‌ నుంచి ఒక యువకుడు ఒంటెను తీసుకొచ్చాడు. దానికి ఎలాంటి పోషణ లేదు. పైగా దాని తలమీద సుత్తితో తీవ్రంగా బాదిన గాయం. ఆ గాయం నయం కావడానికి ఐదేళ్లు పట్టింది. అలాగే కత్తికి బలికాబోయే సమయంలో రక్షించిన 20 మేకలు ఇక్కడ ఉన్నాయి. పొడవాటి జుట్టు, గడ్డం అంత పొడవుగా వేలాడే చెవులు ఉన్న ఓ పర్వత మేక, వైద్య పరిశోధన కోసం తీసుకెళ్లి కోయాలనుకున్న మేక.. ఇలా ఒక్కోటి రక్షింపబడి ఇక్కడకు చేరుకున్నవాటిలో ఉన్నాయి. 
కుక్కలను, ఆవులను ప్రేమగా నిమిరి, గేదెలు, దూడలు సమూహంతో కాసేపు గడిపి ఈమూ పక్షులతో సంభాషించడంతో అంజలి గోపాలన్‌ రోజు గడుస్తుంది. – ఆరెన్నార

మరిన్ని వార్తలు