మ్యావ్‌

2 Aug, 2019 09:25 IST|Sakshi

కాపీ కొట్టేవాళ్లని ‘కాపీక్యాట్‌’ అంటారు. చైల్డ్‌ వర్డ్‌ అది. పెద్దవాళ్లు కాపీ కొడితే అది చైల్డిష్‌ కాదు. షేమ్‌లెస్‌! లేటెస్ట్‌గా ఓ పిల్లి పోస్టర్‌పై వివాదం మొదలైంది. కంగనా నటించిన ‘జడ్జ్‌మెంటల్‌ ౖహె క్యా’
చిత్రం పోస్టర్‌ను తన ఆర్ట్‌వర్క్‌ చూసి కాపీ కొట్టారని ఓ హంగేరియన్‌ ఆర్టిస్ట్‌ ఆరోపిస్తున్నారు. మనం ఎప్పటిలా మానేస్తాం.. కాపీ క్యాట్‌లా మ్యావ్‌ అనడం! ఎవరూ చూడ్డం లేదని పాలు తాగేశాక ఇలాగే కదా.. పిల్లి మ్యావ్‌ అంటూ వెళ్లిపోయేది!

హాల్‌ లోపల వెండితెర, హాల్‌ బయట ‘వాల్‌’తెర.. రెండూ రెండు ప్రాణాలు సినిమాకు. లోపలిది చలన చిత్రం. వెలుపలిది నిశ్చలన చిత్రం. ఎంత చలన చిత్రం అయినా, హాల్‌ లోపలికి ప్రేక్షకుల్ని నడిపించేది మాత్రం బయట వాల్‌పై కనిపించే నిశ్చలన చిత్రమే. టీజర్‌లొచ్చి, యూట్యూబ్‌ ట్రైలర్‌లు వచ్చినా మైదా రాసి గోడకు అంటించే పోస్టర్‌కు ఉండే స్మెల్‌ వేరే దేనికీ రాలేదు. పోస్టర్‌ మేకింగ్‌ ఇప్పటికీ సినిమా తీసినంత పని. గోడపైన హీరోనో, హీరోయిన్‌నో లేదా ఇంకేదైనా సీన్‌నో చూడగానే గుండెకో, మైండ్‌కో పట్టేసేటట్లు ఉండాలి. తేలికేం కాదు. సినిమాలొచ్చిన కొత్తలో పోస్టర్‌ల డిజైనింగ్‌ ఇంత కష్టంగా ఉండకపోయేదేమో. సినిమాలు ఎక్కువయ్యాక పోస్టర్‌లు క్రియేట్‌ చెయ్యడానికి కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లా పెద్ద టీమ్‌ సిద్ధమౌతోంది. మెప్పించి, రప్పించాలి కదా ఆడియన్స్‌ని థియేటర్‌లకు.

తొలి చిత్రాల పోస్టర్‌లు
1932లో వచ్చిన ‘భక్త ప్రహ్లాద’ తెలుగులో తొలి టాకీ చిత్రం. పోస్టర్‌లే లేని ఆ కాలంలో పోస్టర్‌ చెయ్యడం అన్నది చంద్రయాన్‌ ప్రయోగమే. అయినా చేశారు. చెయ్యకపోతే సినిమా గురించి తెలిసేదెలా? అయితే అది పెద్ద సైజు పాంప్లెట్‌లా ఉంది తప్ప  పోస్టర్‌లా లేదు. పాంప్లెటే పోస్టర్‌ అనుకోండి. ఆ పోస్టర్‌లు కూడా ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి కాక, థియేటర్‌ల వాళ్లు కొట్టించుకున్నవి. ‘భారత మూవీటోన్‌ అనబడుతున్న శ్రీ కృష్ణా ఫిల్ము కంపెనీ వారిచే అధిక వ్యయ ప్రయాసలకోర్చి తయారు చేయబడిన ‘భక్త ప్రహ్లాద’ 100 శాతం సంపూర్ణ తెలుగు టాకీ అని బెజవాడలోని అప్పటి ‘శ్రీ దుర్గా కళామందిరము’ పోస్టర్‌ కొట్టించింది. చుట్టూ సినిమా వివరాలు, ఆ వివరాల మధ్యలో భక్తప్రహ్లాదుడి మూవీ స్టిల్‌. ఇదీ ఆ పోస్టర్‌. నిర్మాణ సంస్థ మూవీటోన్‌ నేరుగా కొట్టించిన పోస్టర్‌ కూడా ఉంది. అది ఇంగ్లిష్‌లో ఉంటుంది. సిమెట్రికల్‌గా సినిమాలోని ఓ ఏడు సన్నివేశాలతో భక్తప్రహ్లాద పోస్టర్‌ను డిజైన్‌ చేసి సినిమా విశేషాలను ఇచ్చారు. చూడ్డానికి ఇప్పుడా సినిమా లేదు. పుణె ఆర్కైవ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన వాటిలో భక్తప్రహ్లాద ఫిల్మ్‌ రీళ్లు కూడా ఉన్నాయి. ఏవో రెండు స్టిల్స్, ఓ సినిమా పోస్టర్‌ మాత్రమే ప్రస్తుత జ్ఞాపకాలు. తొలి తెలుగు సినిమా కంటే కాస్త ముందు తొలి హిందీ సినిమా ‘ఆలం ఆరా’ తయారైంది. నిర్మాణం ఇంపీరియల్‌ మూవీటోన్‌. 1931లో విడుదలైంది. భక్త ప్రహ్లాద పోస్టర్‌లా నలుపు తెలుపులో కాక, ఆ సినిమా పోస్టర్‌ సింగిల్‌ కలర్‌లోనే రెండు షేడ్‌లుగా వచ్చింది. పోస్టర్‌ మీద ఒక అందమైన బంజారా యువతి గుండెలపై చేతులు వేసుకుని నిలబడి ఉంటుంది. కింద ఒక ప్రణయ సన్నివేశం ఉంటుంది. పైన ఓ మూల.. గుంపు పన్నివేశం ఉంటుంది. ‘ఆలం ఆరా’ అనే టైటిల్‌ ఉంటుంది. టైటిల్‌ కింద.. ఆల్‌ డ్యాన్సింగ్, సింగింగ్‌ అండ్‌ డాన్సింగ్‌ అని ఉంటుంది. పోస్టర్‌ అడుగున స్ట్రిప్‌ ఉంటుంది ‘ఇంపీరియల్‌ మూవీ–టోన్, బాంబే’ అని. ఈ సినిమా ఫిల్ములు కూడా కాలిపోయాయి. పోస్టర్‌ ఒక్కటే ప్రాణంతో ఉంది.

మట్టిగోడలపై లీడ్‌ రోల్స్‌
రఫ్‌గా ఓ వందేళ్లుగా టాకీలు ఆడుతున్నాయి. వాటి మూకీ వెర్షన్‌లుగా వాల్‌ పోస్టర్‌లూ వందేళ్లుగా ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నాయి. మట్టి గోడకు సినిమా పోస్టర్‌ అంటించి ఉన్న గుడిసెలోని సినిమాటోగ్రఫీ.. వంద అడుగుల ఎత్తు ఫ్లెక్లీ ఉన్న ఐమాక్స్‌ థియేటర్‌ ప్రాంగణంలో ఉంటుందా! అందుకే సినిమాలు కాలగతిలో కలిసిపోతున్నా కూడా సినిమా పోస్టర్‌లు మనసు గదులకు అంటుకునే ఉంటున్నాయి. పోస్టర్‌లోని మంత్రముగ్ధత అది. ఎంతగానంటే ఇప్పటికీ ఒకర్ని చూసి ఒకరు ఇన్‌స్పైర్‌ అయి పోస్టర్‌లను కాపీ కొట్టేసుకునేంత! ఎక్కువ కాపీయింగ్‌ హాలీవుడ్‌లోంచి మిగతా వుడ్‌లలోకే. కాపీ కొట్టడం తప్పా ఒప్పా అన్నది పక్కన పెడితే ఎవరిది వాళ్లు కాపీ కొట్టుకోవడం ఎవరి పర్సులోంచి వాళ్లు దొంగతనం చేసినట్లుగా ఉంటుంది. ఈ ట్రెండు హాలీవుడ్‌లో బాగా ఉంది. వాళ్లది వాళ్లే పిక్‌ పాకెటింగ్‌ చేసేస్తుంటారు! బ్యాక్‌ టు బ్యాక్‌ ఇద్దరు ఆనుకుని నిల్చునే పోస్టర్‌లు, హీరోయిన్‌ కాళ్ల మధ్య నుంచి సీన్‌ని చూపించే పోస్టర్‌లు, ఒంటికన్ను పోస్టర్‌లు, లీడ్‌ రోల్‌ వెనక్కు తిరిగి ఉండే పోస్టర్‌లు, జంతువుల పోస్టర్‌లు, నేచర్‌ బ్లూ పోస్టర్‌లు హాలీవుడ్‌లో రిపీట్‌ అవుతూనే ఉంటాయి. ఇవేకాదు, బెడ్‌మీద కపుల్‌ పోస్టర్‌లు, ‘బ్లూ రన్‌ అండ్‌ టిల్ట్‌’ పోస్టర్‌లు, (మహేశ్‌బాబు ఒక సైడ్‌కి వాలి పరుగు తీస్తుంటాడు కదా.. అలా), వెనుక సముద్రం ఉండే ఓషన్‌ సిల్హౌటీ పోస్టర్‌లు, ఎర్రటి ఎరుపు డ్రెస్‌ వేసుకుని తెల్లటి కాళ్లు బయటపెట్టే యంగ్‌ లేడీ పోస్టర్‌లు హాలీవుడ్‌లో ఒకర్ని చూసి ఒకరు డిజైన్‌ చేస్తున్నవే. సెర్బియన్‌ బ్లాగర్‌ క్రిస్టోఫ్‌ కోర్టిస్‌కి ఇదంతా ఫన్నీగా కనిపిస్తుంది. ‘కాపీ అనలేం, ఇన్‌స్పిరేషన్‌ అనాలి’ అంటారు కోర్టిస్‌. ఆయన బ్లాగ్‌లో పెద్ద కాపీ కలెక్షనే ఉంది.

పోస్టర్‌ల మహాసముద్రం
హాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌లోకి ఇంత ‘క్రియేటివ్‌’గా డంపింగ్‌ జరుగుతున్నప్పుడు హాలీవుడ్‌ నుంచి నుంచి ఇతర వుడ్‌లలోకి పోస్టర్‌లు డంప్‌ అవడం తప్పుగా ఏం అనిపించదు కానీ, తప్పే అని అంటున్నారు ఫ్లోరా బార్సీ అనే ఫ్రీలాన్స్‌ ఆర్టిస్ట్‌. ఇరవై ఆరేళ్ల ఈ హంగేరియన్‌ యువతి విజువల్‌ ఆర్ట్‌లో, ఫొటోగ్రఫీలో, ఫొటోషాప్‌లో, ఫొటో మానిపులేషన్‌లో నిపుణురాలు. గతవారం రిలీజ్‌ అయిన కంగనా రనౌత్‌ సినిమా ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ పోస్టర్‌లను తన ఆర్ట్‌వర్క్‌ చూసే కాపీ కొట్టారని, కనీసం తన అనుమతి కూడా తీసుకోలేదని ఫ్లోరా తన ఫేస్‌బుక్‌లో ఆరోపించారు. ఆరోపణ కాదు, నిజమే అనిపిస్తుంది.పోస్టర్‌లో కంగనా కన్ను ఒకదాన్ని కవర్‌ చేస్తూ పిల్లి కన్ను ఉంటుంది. ఫ్లోరా ఎప్పుడో తీసిన ఆర్ట్‌ ఫొటోలోని యువతి కన్నును కూడా ఒక పిల్లి కన్ను కవర్‌ చేస్తుంటుంది. ఆమె ఆరోపణకు జడ్జిమెంటల్‌ హైక్యా నిర్మాణ సంస్థ ‘బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌’ ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. ఇదంటే, ఆర్ట్‌వర్క్‌ నుంచి పోస్టర్‌ కాపీ. డైరెక్ట్‌గా పోస్టర్‌ టు పోస్టర్‌ కాపీలు కూడా బాలీవుడ్‌లో పుష్కలంగా ఉన్నాయి. వాటి సంగతేంటి? ఎవరూ అడగలేదు. ఎవరూ మాట్లాడలేదు.

‘పికె’లో ఆమిర్‌ ఖాన్‌ దిగంబరంగా రేడియో పట్టుకుని నిలబడి ఉండే పోస్టర్‌.. క్విమ్‌ బారీరోస్‌ అనే పోర్చుగీస్‌ గాయకుడి 1973 నాటి సాంగ్స్‌ ఆల్బమ్‌ కవర్‌కు కాపీ! పికె 2014లో రిలీజ్‌ అయింది. షారుక్‌ఖాన్‌ ‘దిల్వాలే’ పోస్టర్‌ ఆ ముందు ఏడాదే వచ్చిన హాలీవుడ్‌ మూవీ ‘ది బెస్ట్‌ ఆఫ్‌ మి’ పోస్టర్‌కి కాపీ. ఆకాశంలోని మబ్బుల్లో హీరో హీరోయిన్‌ ఉంటారు.

‘అతిథి తుమ్‌ కబ్‌ జావోగీ’ పోస్టర్‌ ‘లైసెన్స్‌ టు వెడ్‌’ పోస్టర్‌కి (బెడ్‌ మీద భార్యాభర్తల మీద అతిథి పడుకుని ఉంటాడు), ‘ఫూంక్‌2’ పోస్టర్‌ ‘ఛేజర్‌’ పోస్టర్‌కి (ముఖం మీద పెట్టుకున్న అరిచేయిలోంచి ఒక కన్ను కనిపిస్తుంటుంది), ‘మర్డర్‌2’ పోస్టర్‌ ‘యాంటీ క్రైస్ట్‌’ పోస్టర్‌కి (దేహవాంఛలు దెయ్యాల్లా చుట్టుముట్టి ఉంటాయి), ‘ఐత్‌రాజ్‌’ పోస్టర్‌ ‘ది గ్రాడ్యుయేట్‌’ పోస్టర్‌కి (యువతి అండర్‌వేర్‌ వేసుకుంటుంటే హీరో నిలబడి చూస్తుంటాడు), ‘అంజానా అంజానీ’ పోస్టర్‌ ‘యాన్‌ ఎడ్యుకేషన్‌’ పోస్టర్‌కి (వెల్లికిలా రివర్స్‌లో పడుకుని ఉన్న హీరో హీరోయిన్‌ చెంపలు తాకించుకుంటూ ఉంటారు), ‘జిందగీ న మిలేగీ దొబారా’ పోస్టర్‌ ‘లార్డ్స్‌ ఆఫ్‌ డాగ్‌టౌన్‌’ పోస్టర్‌కి (ఒంటిపైన షర్ట్‌ లేని వ్యక్తితో పాటు ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటారు), ‘రా.వన్‌’ పోస్టర్‌ ‘బాట్స్‌మ్యా¯Œ  బిగిన్స్‌’ పోస్టర్‌కి (హీరో రెండు చేతులతో హీరోయిన్‌ని మోసుకుంటూ వస్తుంటాడు).. ఇవన్నీ అచ్చు గుద్దినట్లుగా కాపీ.

హాలీవుడ్‌ పోస్టర్‌లను చూసి ముచ్చటపడి తెలుగువుడ్‌ తయారు చేసుకున్న పోస్టర్‌లు కూడా ఉన్నాయి. సైమన్‌ బిర్చ్‌–బాహుబలి, యాన్‌ ఆఫీసర్‌ అండ్‌ జెంటిల్మన్‌–తుపాకీ, హ్యారీ పోట్టర్‌: ఇట్‌ ఆల్‌ ఎండ్స్‌–రోబో 2.ఓ, బ్లేడ్‌ రన్నర్‌–సాహు, టిక్‌టిక్‌: ది ఆస్వంగ్‌ క్రానికల్స్‌–కబాలి, మిషన్‌ ఇంపాజిబుల్‌: ఘోస్ట్‌ ప్రొటోకాల్‌–విశ్వరూపం, ది డ్రాగన్‌బాల్‌–అఖిల్, కొల్లాటరల్‌ బ్యూటీ–యు టర్న్‌.. ఇలా పోస్టర్‌లలో పోలికలు కనిపిస్తాయి.ఇవన్నీ కాపీలు కాదనీ, అనుకరణలు అనుసృజనలు మాత్రమేనని అనుకున్నా ఎక్కడ ఎవరి నుంచి ఇన్‌స్పైర్‌ అయ్యామో వారికి క్రెడిట్‌ ఇవ్వడం కనీస ధర్మం. ఈ ధర్మాన్ని పాటించనప్పుడే ధర్మయుద్ధాలు మొదలవుతాయి. అయినా మనది కాని దాన్ని మనది అని చెప్పుకోవడం ఏం బాగుంటుంది? ఎవరి గొప్పతనాన్ని వారికి ఇచ్చేయడం కూడా గొప్పతనమే.

హాలీవుడ్‌ : ఎవరిది వాళ్లే కాపీ! (బ్యాక్‌ టు బ్యాక్‌ పోస్టర్‌లు వేసిన చిత్రాలు)
మనసును మీటిన తొలి పోస్టర్‌
హాలీవుడ్‌లో ఫస్ట్‌ టాకీ మూవీ ‘ది జాజ్‌ సింగర్‌’. 1927లో వచ్చింది. వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్, విటాఫోన్‌ కార్పోరేషన్‌ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. కలర్‌ఫుల్‌ మూవీ పోస్టర్‌ . పోస్టర్‌ మీద సినిమాలోని పాత్రలు యూజినీ బెసెరెర్, అల్‌ జోల్‌సన్‌ ఉంటారు. తల్లీ కొడుకులు. ‘వాసు’ సినిమాలో వెంకటేశ్‌ పెద్ద సింగర్‌ అవాలనుకుంటే వెంకటేశ్‌ తండ్రి అతడిని పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌ అవమంటాడు. తండ్రీకొడుకులకు మధ్య ఘర్షణ మొదలౌతుంది. మాతృ హృదయం కొడుకులోని ‘కళా తపస్వి’ని అర్థం చేసుకుంటుంది. అలాంటి తల్లి మనసే ‘ది జాస్‌ సింగర్‌’ పోస్టర్‌ డిజైన్‌లో కనిపిస్తుంది. ‘చూశావా అమ్మా నేనెంత గొప్పగా ప్లే చేస్తున్నానో’ అన్నట్లు అల్‌ జోల్‌సన్‌.. జాస్‌ని ప్లే చేస్తూ తల్లి కళ్లలోకి చూస్తుంటే.. ‘‘నా బంగారు కొండ..’’ అన్నట్లు కొడుకును మురిపెంగా చూస్తుంటుంది యూజినీ బెసెరెర్‌. ఆ పోస్టర్‌ ప్రతి ఇంటినీ టచ్‌ చేసి, ఇంటిల్లపాదినీ థియేటర్‌లకు రప్పించింది.

మరిన్ని వార్తలు