పొగడ్త పాడు చేస్తుంది

29 Jun, 2018 01:05 IST|Sakshi

ఒకప్పుడు పదో తరగతి ఫైనల్‌ పరీక్షలకు ముందు ఒక టాలెంట్‌ పరీక్షలాంటిది పెట్టేవారు. అలా ఒక పాఠశాల వాళ్లు టాలెంట్‌ పరీక్ష పెట్టి విజేతలకు బహుమతి ప్రదానం చేయడానికి నన్ను పిలిచారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను బట్టి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉన్న వారిని గుర్తించేవారు. దీనిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న విద్యార్థి మొత్తం బంధుగణాన్ని అంతటినీ ఏకంగా ఒక బస్సులో తీసుకువచ్చాడు.

నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ ఆ పిల్లవాడిని ఆ బంధువులు ఏ స్థితిలో చూసారంటే... వాడు జీవితంలో ఇక చేరవలసిన పై స్థానాన్ని చేరినట్లుగా భావించారు. చిన్న పిల్లవాడు కదూ... వాడు కూడా తను ఇక చదవ వలసిందేమీ లేదనీ, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరానని అనుకునే స్థితికి వెళ్లిపోయాడు.

వాడికి ప్రైజ్‌ ఇస్తున్నప్పుడైతే వాడిలోని అమితమైన ఉత్సాహాన్ని చూస్తే వీడికొక మంచిమాట చెప్పకపోతే తప్పుచేసిన వాడినవుతాననిపించి ‘‘బాబూ! నీతో ఒక్కమాట మాట్లాడవచ్చా’’ అన్నాను. వాడు ‘‘చెప్పండి’’ అన్నాడు. ‘‘నీ జీవితానికి ఇది చిట్టచివరి పరీక్ష కాదు, కానీ ఈ పరీక్షలో పొందిన విజయం తర్వాతి పరీక్షలో బాధకు కారణం కాకుండా చూసుకో’’ అన్నాను.

నేను చెప్పిన మాట వాడికేమేరకు అర్థమైందో నాకు తెలియదు. ఈలోగా రెండో బహుమతి పొందిన విద్యార్థి ఎంతో బాధగా వచ్చి నిలబడ్డాడు. ‘‘ఎందుకలా  ఉన్నావు’’ అని అడిగితే వాడన్నాడు కదా... ‘‘నాకు రెండే మార్కులు తక్కువ వచ్చాయి. ఫస్ట్‌ రావాలని ఎంతో ప్రయత్నం చేశా’’ అని తలవంచుకుని చాలా బాధగా చెప్పాడు. నేనన్నానూ... ‘‘ఇదేం ఫైనల్‌ పరీక్ష కాదు కదా, ఒక ప్రయత్నం చేశావు. అంతే. రేపటి పరీక్షకు బాగా చదివి పేపర్లో నీ ఫొటో పడేటట్లు ఇక నుంచి బాగా ప్రిపేర్‌కా’’ అన్నాను.

మొదటి బహుమతి అందుకున్న విద్యార్థి బహుశా తర్వాత పుస్తకం పట్టుకున్నాడని నేననుకోవడం లేదు. కారణం ఫైనల్‌ ఫలితాల్లో మొదటి వేల ర్యాంక్స్‌లో లేడు. రెండో బహుమతి అందుకున్న విద్యార్థి స్టేట్‌ఫస్ట్‌ వచ్చాడు. ఇది నేను సంతోషంతోనో, బాధతోనో చెప్పడంలేదు. ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు.

- (బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలనుంచి)

మరిన్ని వార్తలు