సినిమా పుస్తకం మూవీ మొఘల్

28 Feb, 2015 00:05 IST|Sakshi
సినిమా పుస్తకం మూవీ మొఘల్

రామానాయుడు జీవించి ఉండగా ఆయన నిర్మించిన సినిమాల గురించి సమగ్రంగా వివరిస్తూ వచ్చిన చివరి పుస్తకం ఇదే. రైతు కుటుంబంలో పుట్టి, సినిమా నిర్మాణంలో ప్రవేశించి, తెలుగువారు గర్వించదగ్గ స్థాయిలో నిర్మాతగా నిలబడటమే కాకుండా పరిశ్రమను కూడా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించడం రామానాయుడికే సాధ్యమైంది. ‘ది షో మస్ట్ గో ఆన్’ అని రాజ్‌కపూర్ అన్నట్టు రామానాయుడు జయాపజయాలతో నిమిత్తం లేకుండా సినిమాలను నిర్మిస్తూ వెళ్లారు. కొన్నిసార్లు స్టూడియో సిబ్బందిని పనిలో నిమగ్నం చేయడానికి కూడా అవి సరిగ్గా ఆడవని తెలిసినా సినిమాలు తీశారు.

ఆయన కెరీర్‌లో ఎన్నో హిట్స్ ఉన్నాయి. మరెన్నో ఫ్లాప్స్ ఉన్నాయి. రాముడు- భీముడు, ప్రేమనగర్, జీవన తరంగాలు, సోగ్గాడు, మండే గుండెలు, దేవత, ముందడుగు, ప్రతిధ్వని, అహ నా పెళ్లంట, ఇంద్రుడు-చంధ్రుడు, బొబ్బిలిరాజా వంటి సినిమాలు తీసిన రామానాయుడే స్త్రీ జన్మ, బొమ్మలు చెప్పిన కథ, అగ్నిపూలు, మాంగల్యబలం, ప్రేమమందిరం, సూపర్ బ్రదర్స్ వంటి పరాజయాలు తీశారు. కాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆయనను నిందించలేదు. ఎందుకంటే ఆయన తీసినవాటిల్లో ప్లాప్ మూవీస్ ఉండొచ్చు. బ్యాడ్ మూవీస్ లేవు. ఈ వివరాలన్నీ పాత్రికేయుడు వినాయకరావు ‘మూవీ మొఘల్’ పుస్తకంలో వివరించారు. రామానాయుడు తీసిన ప్రతి సినిమా వర్కింగ్ స్టిల్స్, ఆ సినిమాల నిర్మాణం వెనుక ఉన్న కథ, విడుదల తర్వాత ఫలితం, ఇతర విశేషాలు... సినీ అభిమానులు తెలుసుకో దగ్గవి. ఈ పుస్తకం చదువుతుంటే రామానాయుడి ప్రస్తావన తెలియడం మాత్రమే కాక ఆ సినిమాలతో మమేకమైన బాల్యమో, యవ్వనమో గుర్తుకు వచ్చి ఏవో జ్ఞాపకాలు కూడా తలుపు తడతాయి. ఏ4లో ఆర్ట్ పేపర్ మీద ముద్రణ అందంగా ఉంది.
 మూవీ మొఘల్- రచన: యు. వినాయకరావు,
 వెల: రూ. 300, ప్రతులకు: 93947 36301, 98851 79428.
 
 

మరిన్ని వార్తలు