గ్యాస్ట్రిక్‌ అల్సర్‌  నయమవుతుందా?

28 Feb, 2019 03:49 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కడుపులో తీవ్రంగా మంట వస్తోంది. వికారంగా కూడా ఉంటోంది. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్‌ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? 

ఇటీవలి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణకోశ సమస్యలు ముఖ్యంగా గ్యాస్ట్రిక్‌ అల్సర్‌ వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్‌) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్‌ అల్సర్స్‌ అంటారు. హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణాశయంలో అల్సర్లు పెరుగుతాయి. 

కారణాలు : 80 శాతం మందిలో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ వల్ల అల్సర్లు వస్తాయి.

►చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది.

►మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం

►మద్యపానం, పొగతాగడం

►వేళకు ఆహారం తీసుకోకపోవడం

►కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. 

లక్షణాలు : కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం

►ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం

►తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు

►కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం

►నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. 

నివారణ జాగ్రత్తలు: పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి

►మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి

►కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి

►కంటినిండా నిద్రపోవాలి

►మానసిక ఒత్తిడి దూరం కావడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి

►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. 

చికిత్స : గ్యాస్ట్రిక్‌ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్‌ ఆల్బ్, యాసిడ్‌ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్‌ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. 

డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, 
ఎండీ (హోమియో), 
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

మైగ్రేన్‌కు చికిత్స ఉందా? 

నా వయసు 33 ఏళ్లు. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపున విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్‌ అన్నారు. హోమియో మందులతో ఇది తగ్గుతుందా? 

పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్‌ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో ఇది ఎక్కువ. 

కారణాలు:  తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్‌ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. 

లక్షణాలు: పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 

►పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు: ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 

►పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 

►పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు : చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో ఇచ్చే ఉన్నత  ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.

డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

శస్త్రచికిత్స లేకుండా యానల్‌ ఫిషర్‌ తగ్గుతుందా? 

నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మలద్వారం దగ్గర చీరుకుపోయిందనీ, ఇది యానల్‌  ఫిషర్‌ అని చెప్పారు. ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆపరేషన్‌ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? 

మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది.

ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈ మధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. 

కారణాలు: దీర్ఘకాలిక మలబద్దకం
►ఎక్కువకాలం విరేచనాలు
►వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం
►ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం
►మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట
►చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం
►విరేచనంలో రక్తం పడుతుంటుంది
►కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట. 

చికిత్స : ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. 

డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, 
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌


 

మరిన్ని వార్తలు