చల్లని నీడ

1 Dec, 2013 00:40 IST|Sakshi
చల్లని నీడ

ఎయిడ్స్‌తో బాధపడేవారికి ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వడాన్ని ప్రమాదంగా భావించే ప్రపంచంలో ఉన్నాం మనం. అయితే ఆ జబ్బు వచ్చినవారు  తమ చివరి రోజుల్ని తన ఆసుపత్రిలో గడిపే అవకాశం కల్పిస్తూ అందరితో ‘వైద్యోనారాయణోహరిః’అనిపించుకుంటున్నారు ఈ డాక్టర్. ప్రకాశం జిల్లా చీరాలలో ‘షాడో’ అనే స్వచ్ఛందసంస్థను స్థాపించి ఎయిడ్స్ రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్  డేవిడ్‌సన్ సాల్మన్ గురించి...
 
ఇప్పటివరకూ ఆ ఆసుపత్రికి పద్దెనిమిది వేలమందికి పైగా ఎయిడ్స్‌రోగులు వచ్చారు. అయితే డాక్టర్ డేవిడ్ గర్భిణులు, మరణంతో పోరాడుతున్న వారి గురించి ఎక్కువగా ఆలోచించారు. అందువల్లే గర్భిణులకు ఉచిత ప్రసవం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి ఆసుపత్రిలోనే ఉచిత ఆశ్రయం కల్పించాలనుకున్నారు. దాతలు డబ్బు మాత్రమే ఇవ్వగలరు, సాల్మన్ మాత్రం ప్రేమను కూడా ఇవ్వాలనుకున్నారు. అందుకే చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఎయిడ్స్ రోగులకు తన ఆసుపత్రిలో బెడ్ ఇప్పించారు. ‘షాడో’ సంస్థ ద్వారా డా.సాల్మన్ ఎయిడ్స్ రోగులకు వైద్యం చేస్తున్నారు. ఒకవేళ చనిపోతే అంత్యక్రియలు కూడా జరిపిస్తున్నారు.
 
ప్రచారంతో పాటు...
 ‘‘మా నాన్నగారి పేరుతో గత ముప్పైఏళ్లుగా చీరాలలో ‘సాల్మన్’ ఆసుపత్రి ఉంది. నేను, నా బావమరిది, అతని భార్య అందరం వైద్యవృత్తిలోనే ఉన్నాం. ముంబయి, బెంగుళూరు వంటి నగరాల్లో వైద్య ఉద్యోగాలు వచ్చినప్పటికీ నాన్నగారి ఆసుపత్రిలో ఉండిపోవాలని అందరం ఇక్కడికే వచ్చేశాం. ఇరవై ఏళ్లక్రితం మా జిల్లాలోని మొదటి ఎయిడ్స్‌రోగికి నేను వైద్యం చేశాను. రోజురోజుకీ ఎయిడ్స్ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో వారికోసం సాల్మన్ హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ వీకర్స్ సొసైటీ... షాడో స్థాపించాను.

వైద్యం చేసి ప్రాణం పోయడానికంటే ముందు ఆ జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన ప్రచార కార్యక్రమాలు చేశాను. ఎయిడ్స్‌రోగుల్ని ఇంట్లో పెట్టుకోడానికి ఇబ్బందిపడి మా ఆసుపత్రిలో చేర్పించి వదిలేసి వెళ్లిపోయినవారు కూడా ఉన్నారు. బంధువులుండి కూడా వారి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే నాకు చేతనైనంత సాయం చేసేవాడిని’’ అని చెప్పారు డేవిడ్. సాల్మన్ ఆసుపత్రిలో వెయ్యిమందికి పైగా ఎయిడ్స్‌రోగులు కన్నుమూశారు. వారిలో వందమందికి పైగా అనాథలు. ఈ అనాథలు... అందరికీ దూరమైనవారు. కొందరు నిజంగానే ఎవరూ లేనివారు. బతికుండగా గుక్కెడు నీళ్లు పోయడం సాయమైతే...చనిపోయాక చేయాల్సిన అసలైన సేవ కూడా చేస్తున్న ఈ డాక్టర్ అభినందిద్దాం.
    
 - భువనేశ్వరి
 

మరిన్ని వార్తలు