Diwali Decoration Ideas 2023: దీపావళికి మీ ఇంటిని అందంగా ముస్తాబు చేసే ఐడియాలు ఇవే

11 Nov, 2023 10:48 IST|Sakshi

దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఇంటిని డెకరేట్‌ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్‌ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి.

గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్‌ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది.

► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్‌ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది.

► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్‌ విండో, డోర్‌లకు కర్టెన్స్‌లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్‌ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది.

► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్‌ పెట్టి వెలిగించాలి.  

► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్‌ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి.

► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది.

► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్‌ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్‌ఫుల్‌ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్‌తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది.

► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్‌లో దొరికే చెక్క, యాక్రాలిక్‌ ల్యాంప్స్‌ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్‌ డెకరేషన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టండి. 

మరిన్ని వార్తలు