దొండకాయ

23 Jul, 2017 23:11 IST|Sakshi
దొండకాయ

గుడ్‌ఫుడ్‌

మనకు జ్వరం వచ్చి నార్మల్‌ అయ్యే సమయంలో తీసుకొమ్మని చెప్పే కూరగాయల్లో దొండకాయ ఒకటి. జ్వరం వల్ల మనం కోల్పోయిన శక్తిని మళ్లీ తిరిగి వచ్చేలా చేసే అద్భుతమైన కూరగాయ దొండ. దానివల్ల ఒనగూరే మరికొన్ని ఇతర ప్రయోజనాలివి... దొండకాయలో చాలా రకాల విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి. అందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, విటమిన్‌ బి కాంప్లెక్స్, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ చాలా ముఖ్యమైనవి. అందుకే దొండకాయ తినేవారిలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. దొండలో ఫైబర్‌ పాళ్లు చాలా ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం చక్కగా ఉండటానికి  దొండకాయలోని ఈ పీచుపదార్థం బాగా తోడ్పడుతుంది.

దొండలోని పోషకాల వల్ల మన కండరాలు, టెండన్లు, లిగమెంట్లు బలంగా తయారవుతాయి. కండరాలు బలపడటానికి, కదలికలు చురుగ్గా ఉండటానికి దొండ బాగా తోడ్పడుతుంది.దొండలోని యాస్కార్బిక్‌ యాసిడ్‌ పాళ్ల వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు చర్మం మిలమిలలాడుతుంది. మేని నిగారింపు కోసం చాలా మంది దొండకాయ రసాన్ని సైతం ఉపయోగిస్తుంటారు.శరీరంలో ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, నొప్పి, మంట, ఎర్రబారడం) ఉన్నప్పుడు దాన్ని తగ్గించడానికి దొండ బాగా ఉపయోగపడుతుంది.దొండలో పొటాషియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే హైబీపీ ఉన్నవారికి దొండ శ్రేయస్కరం. చాలా కూరగాయలలాగే దొండకాయలోనూ నీటి పాళ్లు ఎక్కువ. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి దొండ బాగా తోడ్పడుతుంది.

మరిన్ని వార్తలు