చెఫ్‌ కాదు టెక్‌ జీనియస్‌!

10 Nov, 2023 09:36 IST|Sakshi

కిషన్‌ని చూసినప్పుడు చాలామందికి అమెరికన్‌ ఇన్వెంటర్, ఇంజనీర్‌ చార్లెస్‌ కెటరింగ్‌ ఒకప్పుడు చెప్పిన మాట తప్పకుండా గుర్తుకు వస్తుంది. ‘ఇన్వెంటర్‌ అంటే చదువును మరీ సీరియస్‌గా తీసుకోని వ్యక్తి’ అంటాడు చార్లెస్‌ కెటరింగ్‌. అతడు నవ్వులాటకు అన్నాడో, సీరియస్‌గా అన్నాడో తెలియదుగానీ అస్సాంకు చెందిన కిషన్‌ చదువును సీరియస్‌గా తీసుకోలేదు. లక్ష్యాన్ని మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు.

లక్ష్యం ఉన్న చోట క్రమశిక్షణ, అంకితభావం ఉంటాయి. విజయానికి దారిచూపుతాయి. కిషన్‌ విషయంలోనూ ఇది నిజమైంది. ఒకప్పుడు ‘కిషన్‌ బగారియా’ అంటే పక్క గ్రామం వాళ్లకు కూడా తెలియదు. ఇప్పుడు అస్సాం మొత్తం సుపరిచితమైన పేరు....కిషన్‌ బగారియా. 26 సంవత్సరాల కిషన్‌ బగారియా సృష్టించిన ఆల్‌–ఇన్‌–వన్‌ యాప్‌ ‘టెక్స్‌.కామ్‌’ను అమెరికాకు చెందిన టెక్‌ కంపెనీ ‘ఆటోమేటిక్‌ ఇంక్‌’ రూ. 416 కోట్లకు కొనుగోలు చేసింది...చెఫ్‌ కాదు టెక్‌ జీనియస్‌ అస్సాంలోని  దిబ్రుగఢ్‌లో ఎనిమిది, అగ్రసేన్‌ అకాడమీలో తొమ్మిది, పదో క్లాస్‌ చదివాడు కిషన్‌. ఇంటర్నెట్‌ అతడి ప్రపంచంగా ఉండేది.

రోజూ ఏదో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోవడమో, నేర్చుకోవడమో చేసేవాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే యాప్స్‌ తయారీపై ఆసక్తి చూపించడం మొదలు పెట్టాడు. తన వినోదం కోసం చిన్న చిన్న యాప్స్‌ తయారుచేసేవాడు. ‘వీడికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటే ప్రపంచంతో పనిలేదు’ అని నవ్వుతూ ఇతరులతో చెప్పేవాడు తండ్రి మహేంద్ర బగారియా. ‘ఎప్పుడు  చూసినా కంప్యూటర్‌లో మునిగిపోయి కనిపిస్తావు. భవిష్యత్‌లో ఓ మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యం లేదా?’ అని ఒక సందర్భంలో బంధువు ఒకరు కిషన్‌ను అడిగాడు.

‘ఉద్యోగం చేయాలని లేదు. లక్ష్యం మాత్రం ఉంది’ అన్నాడు కిషన్‌.‘ఏమిటి అది?’ అని ఆసక్తిగా అడిగాడు బంధువు. ‘సొంతంగా కంపెనీ పెట్టాలనేది నా లక్ష్యం’ గంభీరంగా అన్నాడు కిషన్‌.బంధువుతో పాటు అక్కడ ఉన్న వాళ్లు అందరూ బిగ్గరగా నవ్వారు. అలా నవ్విన వాళ్లందరికీ కిషన్‌ ఇప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు.

మరో సందర్భంలో...
‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రవర్తించకు. పగటికలల ప్రపంచం నుంచి బయటికి వచ్చేయ్‌. సొంతంగా కంపెనీ అంటే మాటలనుకున్నావా?’  అంటూ ఒకప్పుడు తనకు హైస్కూల్‌లో చదువు చెప్పిన టీచర్‌ మందలించాడు. ఇప్పుడు ఆ గురువు గారికి కిషన్‌ తప్పనిసరిగా గుర్తుకు వచ్చి ఉంటాడు. ఎవరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు!

‘డీల్‌ ఫైనలైజ్‌ కావడానికి మూడు నెలల సమయం పట్టింది. డీల్‌ ఓకే అయిన సందర్భంలో తట్టుకోలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇది కలా నిజమా! అనుకుంటూ ఒత్తిడికి గురయ్యాను. ఈ స్థితి నుంచి బయటపడడానికి కాస్త సమయం పట్టింది’ అంటాడు కిషన్‌. ‘మరి నెక్ట్స్‌ ఏమిటి?’ అనే ప్రశ్నకు కిషన్‌ ఇచ్చిన జవాబు... ‘టెక్ట్స్‌.కామ్‌పై మరింత పనిచేయాల్సి ఉంది. వర్క్‌ కంటిన్యూ అవుతుంది’ కిషన్‌ రూపొందించిన ‘ఆల్‌–ఇన్‌–వన్‌’ యాప్‌  ట్విట్టర్, వాట్సప్, ఐ మెసేజ్, సిగ్నల్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌... మొదలైన యాప్‌లను ఒకే డ్యాష్‌బోర్డ్‌లో అందుబాటులోకి తెస్తుంది. యూజర్‌ కమ్యూనికేషన్‌ ప్రక్రియను సులభతరం చేసే యాప్‌ ఇది.

(చదవండి: ఫైర్‌ డిటెక్షన్‌ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!)
  

మరిన్ని వార్తలు