ఉపవాసం.. జాగరణం

4 Mar, 2019 00:08 IST|Sakshi

ఉపవాసం, జాగరణ.. ఈ రెండూ ఆధ్యాత్మికమైన తృప్తినీ, మనశ్శాంతినీ ఇస్తాయి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల మేరకు ఓ మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణారోగ్యంగా ఉన్నట్లు. అందుకే మన సంస్కృతి నిర్దేశించిన ఉపవాసం, జాగరణ వంటి నియమాలను పాటిస్తూనే, ఆరోగ్యంపై వాటి ప్రభావం పడకుండా చూసుకోవడం అవసరం. యువతీ యువకులు తాము ఒకింత కఠిన ఉపవాసం చేయవచ్చు. కానీ రోజూ మందులు తీసుకోవాల్సిన పెద్ద వయసువారు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించాలి. 

మరీ కఠినంగా పాటించనంత వరకు ఉపవాసాలు కొంతవరకు ఉపయోగకరమే. ఆరోగ్యదాయకమే. ఉపవాసం సమయంలో ఒంట్లో ఏం జరుగుతుందంటే... సాధారణంగా మనం తీసుకునే ఆహారానికీ, ఆహారానికీ మధ్య కొంత వ్యవధి ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత మళ్లీ ఉదయం తీసుకునే భోజనం వరకు ఉండే వ్యవధి ఎక్కువ కాబట్టే.. మనం ఉదయం తీసుకునే ఆహారాన్ని ‘బ్రేక్‌ ఫాస్ట్‌’గా పేర్కొంటారు. అంటే... రాత్రి ఉపవాసాన్ని ‘బ్రేక్‌’ చేసే ఆహారం అన్నమాట. ఇది రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియ. కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ రోజులో సాధారణంగా మనం ఐదు నుంచి ఆరుగంటల వ్యవధిలో భోజనం చేస్తూ ఉంటాం. మన ఒంట్లోని జీవక్రియలకూ, మన పనులకూ అవసరమైన చక్కెరలు అందాలంటే అలా భోజనం చేస్తుంటాం. దాంతో మన దేహం కూడా ఆ ‘సైకిల్‌’కు అలవాటు పడి ఉంటుంది. మన ఒంట్లోని జీవక్రియలకు అవసరమైన శక్తి చక్కెర నుంచి, ఆ చక్కెరలు మన ఆహారం నుంచి అందుతుంటాయి.

మనకు అవసరమైన శక్తి అందకుండానే మళ్లీ యథాతథమైన పనులన్నీ జరగాలంటే.. అందుకు తగినంత శక్తి అందక శరీరం మొరాయిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఒంట్లో ఉండాల్సిన చక్కెర మోతాదుల్లో తేడాలు వచ్చినప్పుడు వెంటనే శరీరానికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు పడిపోతూ ఉంటుంది. ఒంట్లోని చక్కెరలు బాగా తగ్గిపోయే కండిషన్‌ను ‘హైపోగ్లైసీమియా’ అంటారు. ఫలితంగా సాధారణ రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మెదడుకు, దాంతోపాటు ఒంట్లోని కీలక అవయవాలకు తగినంత రక్తం అందకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఉపవాసం వల్ల ఒంట్లోని సాధారణ పనులకు అవసరమైన శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో మన దేహంలో నిల్వ ఉన్న కొవ్వుల నుంచీ, కొన్ని సందర్భాల్లో కండరాల నుంచి కూడా మన శరీరానికి అవసరమైన శక్తిని తీసుకుంటూ ఉంటుంది.

దీనికి అనుగుణంగానే మళ్లీ మనం మన దేహాన్ని రోజువారీ చేసే కఠినమైన శారీరక శ్రమతో కూడిన పనులతో అలసిపోయేలా చేయకూడదు. ఉపవాసం ఉన్న రోజుల్లో అలాంటి పనులు ఏవైనా ఉంటే.. వాటికి తాత్కాలికంగా దూరంగా ఉండటం మేలు చేస్తుంది. ఇక కొందరు నీళ్లు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తుంటారు. మన దేహంలో జరిగే జీవక్రియల్లో మెదడు నుంచి వచ్చే ఆదేశాలన్నీ లవణాల తాలూకు విద్యుదావేశ మూలకాల రూపంలోనే జరుగుతుంటాయి. ఒంట్లో తగినన్ని ఖనిజాలూ, లవణాలూ ఉండి, అవి ద్రవరూపంలోకి మారితేనే అవి ఖనిజలవణాల విద్యుదావేశ మూలకాల రూపంలోకి మారి.. తద్వారా మెదడు నుంచి దేహంలోని రకరకాల అవయవాలకు అవసరమైన ఆదేశాలు అందుతుంటాయి.

ఇందుకు తగినన్ని పాళ్లలో ఒంట్లో నీరుండటం ఎంతగానో అవసరం. ఒంట్లో ఉండాల్సిన నీటిపాళ్లు తగ్గితే అది డీహైడ్రేషన్‌కు దారితీసి మెదడు నుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందవు. పైగా ఒక్కోసారి కండరాల్లో ఉండాల్సిన మృదుత్వం తగ్గిపోయి, అవి బిగుసుకుపోతాయి. పై కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఉపవాసం సమయంలో కేవలం మన ఒంట్లోని కొవ్వులు మాత్రమే దహనం అయ్యేంత మేరకే మనం ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో నీరు తీసుకోవడం నిషిద్ధ కాదు కాబట్టి మరీ ఎక్కువగా కాకపోయినా, ఒంట్లోని జీవక్రియలకు అవసరమైనంతగానైనా నీరు తీసుకుంటూ ఉండాలి. 

షుగర్, హైబీపీ ఉన్నవారికి సూచనలు
షుగర్, హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసానికి ముందుగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుని, అప్పుడే తగినన్ని నీళ్లతో తాము రోజూ వేసుకోవాల్సిన టాబ్లెట్లను తీసుకోవాలి. ఒకవేళ రోజులో ఒక క్రమపద్ధతిలో వేసుకోవాల్సిన మాత్రలేవైనా ఉంటే.. వాటిని తప్పించకూడదు (స్కిప్‌ చేయకూడదు). నీళ్లతో టాబ్లెట్లు వేసుకోవడం ప్రధానాహారం కాదు కాబట్టి అది పెద్దగా దోషం కాబోదంటూ మనసుకు నచ్చజెప్పుకొని ఆరోగ్యం కోసం విధిగా వేళకు మాత్రలు వాడాలి. 

జాగరణ కోసం
ఈరోజుల్లో రాత్రి చాలా సేపటివరకు మేల్కొని ఉండటం సాధారణమైపోయింది. దాంతో పోలిస్తే.. ఇక జాగరణ పేరిట నిద్రకు దూరంగా ఉండాల్సిన సమయం ఏ ఐదారు గంటలో అదనంగా ఉంటుంది. అయితే కిందటి రాత్రి నిద్రపోలేదు కాబట్టి ఆ మర్నాడు పగలు పడుకోవడాన్ని వీలైనంత వరకు నివారించాలి. ఎందుకంటే ఆ పగటి నిద్ర వల్ల రాత్రికి ఆలస్యంగా నిద్రపట్టడం, అసలే పట్టకపోవడం జరిగి నిద్ర క్రమం తప్పవచ్చు.  జాగరణ కోసం ఈ జాగ్రత్త పాటిస్తే మంచిది. 

డా. సుధీంద్ర ఊటూరిలైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

 

మరిన్ని వార్తలు