Fasting: 110 రోజులు ఉపవాసంతో బాలిక రికార్డ్‌.. అలాంటివాళ్లు చేయకపోవడమే మంచిది

31 Oct, 2023 12:25 IST|Sakshi

ఉపవాసం అనేది ఒక్కో మతం ఆచారాలను బట్టి, వ్యక్తులను బట్టి ఉంటుంది. ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. అందుకే చాలామంది ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంటారు.

తాజాగా జైన మతానికి చెందిన ఓ బాలిక ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి ఆశ్చర్యపరిచింది. అసలు అన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఎలా చేయగలిగింది? ఉపవాస దీక్ష వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. 

జైనమతంలో ఉపవాస దీక్షను చాలా నిష్టగా చేస్తారు. ఈ క్రమంలో ముంబైలోని జైన కుటుంబానికి చెందిన క్రిష అనే 16 ఏళ్ల అమ్మాయి ఏకంగా 3 నెలల 20 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసం చేసింది. మహా మహారుషులు ఇలాంటి తపస్సులు చేయడం చూశాం. కానీ ఇంత చిన్న వయసులో మూడ్నెళ్ల పాటు ఉపవాస దీక్షను చేపట్టడం ఆశ్చర్యమే. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ముంబై ఘనంగా వేడుకలు నిర్వహించడంతో ఈ విషయం సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంతకీ ఆమె అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగింది అన్న వివరాలను ఆరా తీయగా.. తొమ్మిదేళ్ల వయసు నుంచే క్రిషకు ఉపవాసం చేయడం అలవాటుగా ఉండేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తొలుత  26 రోజుల ఉపవాసం తర్వాత ఆమె 31 రోజుల పాటు ఉపవాసాన్ని పొడిగించింది. ఆ తర్వాత 51 రోజుల పాటు నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం మరికొన్ని రోజులు పొడిగించుకుంటూ 110 రోజుల పాటు కఠినమైన ఉపవాసాన్ని పూర్తిచేసింది. ఈ క్రమంలో సుమారు 18 కేజీల బరువు తగ్గినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాకపోవడం విశేషం. 

ఇన్ని రోజుల పాటు క్రిష ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పాటు తొలి 40 రోజులు యథావిధిగా కాలేజీకి కూడా వెళ్లిందట. అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగిందంటే.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్య మాత్రమే గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగేది. ఇలా ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని వాటర్‌ ఫాస్టింగ్‌ అంటారు. కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది.

అంతేకాదు.. మీరు తీసుకునే నీటిలో కాస్త నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. మ్మరసం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు.. శరీరం నీరసించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఇలా మీరు ఉపవాసం పాటిస్తున్న రోజులో 8 నుండి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మీరు ఇతర ఆహారమేమీ తీసుకోకపోయినా ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించడంతోపాటు, శరీరంలోని వ్యర్థాలూ బయటికి వెళ్లిపోతాయి.

ఉపవాసం వాళ్లు చేయకపోవడమే మంచిది

ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. నీరసం సహా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. 
► ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 
► మధుమేహం, అసిడిటీ, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాస దీక్షను చేయరాదు.
► ముఖ్యంగా గర్భవతులు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది.
► వేరేవాళ్లు చేస్తున్నారని మనం కూడా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మన శరీరానికి ఏది సూట్‌ అవుతుందన్నది చెక్‌ చేసుకోవాలి. 
అందుకే ఎక్కువరోజులు ఉపవాసం చేయాలనుకుంటే డాక్టర్‌ సూచనలతో చేయడమే ఉత్తమం. 

ఉపవాసం సమయంలో ఏం తినాలి?
ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు, లెమన్‌ వాటన్‌, కూరగాయల సూప్‌ వంటి ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ, పాలు, పెసరపప్పుతో చేసిన పాయసం వంటివి తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు