కోపమేల హనుమా!

3 Aug, 2018 00:20 IST|Sakshi

చెట్టు నీడ

రామరావణ యుద్ధం అరివీర భయంకరంగా జరిగింది. రావణుడు మరణించాడు. ఆ వార్త మొదట సీతమ్మ చెవిన వేశాడు హనుమ. ఆ మాట విని సీతమ్మ – హనుమా! ఎంత మంచి వార్త చెప్పావు? నిన్ను పొగడడానికి ఈ లోకంలో భాష చాలదు. నీకు ఇవ్వడానికి లోకంలో తగిన బహుమతి లేనే లేదు– అంది కళ్లలో నీళ్లతో. అది చూసి హనుమ చలించిపోయాడు. ఎన్ని అవమానాలు, కష్టాలు, కడగండ్లు ఎలా అనుభవించిందో, ఎలా సహించిందో సీతమ్మ తల్లి– అనుకున్నాడు. చుట్టూ రాక్షస స్త్రీలు బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. వీళ్లే కదా ఏడిపించింది– అని వారివైపు కోపంగా చూస్తూ– ‘‘అమ్మా! నువ్వు ఆజ్ఞ ఇస్తే వారినందరినీ నా పిడికిలి పోటుతో చంపేస్తాను’’ అన్నాడు.

అప్పుడు సీతమ్మ ‘‘హనుమా! ఈ రాక్షస స్త్రీలు రావణుడి దాసీ జనం. యజమాని చెప్పినట్లు చేయడం వారి ధర్మం. తమ ధర్మాన్ని నిర్వర్తించిన వారి మీద కోప్పడడం అధర్మం– అనర్థం. రావణుడి ఆజ్ఞానుసారం చేసిన వారి మీద మన ప్రతాపం ఎందుకు? రావణుడు మరణించాడు. వీళ్లు ఇక నన్ను బాధించరు. అలాంటప్పుడు వారితో వైరమే లేదు. వీరిని వదిలెయ్యి’’ అంది.  ఈ మాటలకు పులకించిపోయిన హనుమ; తమకు చావు మూడిందనుకున్న రాక్షస స్త్రీలూ కూడా ఆనందంతో సీతమ్మ పాదాలకు ప్రణమిల్లారు. 
– డి.వి.ఆర్‌.
 

మరిన్ని వార్తలు