అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్‌ ఘటన..చనిపోయిన ఆ మొసలి స్థానంలో..

13 Nov, 2023 13:16 IST|Sakshi

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ధనిక ఆలయం అందులోని నేలమాళిగల్లో రాశుల కొద్ది బంగారు, వజ్రవైఢూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయంటూ వార్తల్లో నిలిచింది కూడా. ఈ గుడికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దేవస్థానానికి సంబంధించిన సరస్సులో 'బబియా' అనే శాకాహార మొసలి ఉంటుందని, అది భక్తులు ఇచ్చే పండ్లు, ఫలాహారాలు తప్ప ఇంకేదీ తినదని చెబుతుంటారు. గుడికి వచ్చే పర్యాటకులు ఈ మొసలిని చూసేందుకు తెగ ఆసక్తి కనబరిచేవారు. ఎన్నో ఏళ్లుగా ఆ చెరువులో ఉంటోన్న 'బబియా'.. గత ఏడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే. అయితే విచిత్రంగా.. చనిపోయిన 'బబియా' స్థానంలో మరో కొత్త మొసలి ప్రత్యక్షమైందన్న వార్త ఇప్పుడూ హాట్‌ టాపిక్‌గా మారింది.

ఓ మిస్టరీలా మరో మొసలి..
బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి 4 రోజుల క్రితం అనూహ్యంగా కనపడింది. నవంబర్ 8న సరస్సు వెంబడి ఉన్న ఒక గుహలో ఈ కొత్త మొసలిని కొందరు భక్తులు గుర్తించారు. ఈ విషయం కాస్తా అధికారులకు వరకు చేరడంతో వారు శనివారం ఆ మొసలిని గుర్తించి.. ఆలయ ప్రధాన పూజారికి ఈ విషయాన్ని తెలియజేశారు. ఐతే ఇది చిన్న మొసలని, ఆలయ పూజారికి విషయం తెలియజేశాం కాబట్టి తదుపరి ఏ చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తారని అన్నారు. ఇలా ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి కనబడటం అనివార్యంగా జరుగుతోంది.

ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. కాగా, ఇంతకు ముందు చనిపోయిన బబియా అనే మొసలి మూడోది. దీని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా తదుపది ఆ సరస్సులో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. అయితే ఈ బబియా శాకాహారి, ఆలయ పూజారి పెట్టే ప్రసాదంతోనే జీవించేది. ఎవరికి హాని తలపెట్టేది కాదు. పైగా ఆ సరస్సులో ఉండే చేపలను కూడా ముట్టదు బబియా.

దీనికి "బబియా" అని పేరు ఎవరూ పెట్టారో కూడా ఎవ్వరికీ తెలియదు. అత్యంత గమ్మత్తైన విషయం ఏంటంటే.. . ఈ బబియా అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం. 

(చదవండి: దీపావళిని హిందువుల తోపాటు ఎవరెవరూ జరుపుకుంటారంటే..?)

మరిన్ని వార్తలు