ఊబకాయానికి కారణమైన జన్యువును గుర్తించారు!

16 Nov, 2017 01:04 IST|Sakshi

కొంతమంది ఎంత తిన్నా కొంచమైనా లావెక్కరు. ఇంకొందరు ఎన్నిపాట్లు పడ్డా  అంగుళమైనా తగ్గరు. దీనికి కారణమేమిటి? ఓ జన్యువు అంటున్నారు డ్యూక్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త వాన్‌ బెన్నెట్‌ అంటున్నారు. శరీర కండరాలు అన్నింటిలో ఉండే అన్‌కైరిన్‌ –బీ అనే జన్యువు వల్ల కొంతమంది ఊబకాయులుగా తయారవుతూంటారని ఆయన తన తాజా పరిశోధన వ్యాసంలో వివరించారు. ఈ జన్యువును దాదాపు 30 ఏళ్ల క్రితమే గుర్తించారు. దీంట్లో వచ్చే మార్పులు అనేక వ్యాధులకు కారణమని తెలుసు. అయితే ఇటీవల వాన్‌ బృందంలోని శాస్త్రవేత్త ఒకరు ఇలాంటి జన్యువే ఉన్న ఎలుకలు మిగిలిన వాటికంటే లావుగా ఉండటాన్ని గుర్తించడంతో ఊబకాయంలో దీని పాత్రపై పరిశోధనలు మొదలయ్యాయి. మానవుల్లోని అన్‌కైరిన్‌– బీ జన్యువును ఎలుకల్లోకి జొప్పించి చూసినప్పుడు అవి కూడా లావెక్కడాన్ని గమనించిన వాన్‌ ఊబకాయానికి ఇది ఒక కారణమై ఉంటుందన్న అంచనాకు వచ్చారు.

ఈ జన్యువు లేకపోతే కణాల్లోకి ప్రవేశించే కొవ్వును నియంత్రించే గ్లట్‌ 4 అనే ప్రొటీన్‌ మాయమవుతోందని, అలాగే అన్‌కైరిన్‌ –బీలో కొన్ని మార్పులు చేస్తే కణాల్లోకి ప్రవేశించే గ్లూకోజ్‌ గణనీయంగా పెరుగుతున్నట్లు తాము గుర్తించామని వాన్‌ తెలిపారు. యూరోప్‌ జనాభాలో 1.4 శాతం మంది, యూరపియన్‌ అమెరికన్స్‌లో 8.4 శాతం మందిలో ఊబకాయాన్ని కలిగించే అన్‌కైరిన్‌ – బీ జన్యుమార్పులు ఉన్నాయని వాన్‌ తెలిపారు. ఈజన్యువును గుర్తించడం వల్ల భవిష్యత్తులో ఊబకాయాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మరింత స్పష్టత వస్తుందని అంచనా.

మరిన్ని వార్తలు