WC final 2023: కప్‌ భారత్‌దే.. టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకోవాలి: తరుణ్‌

19 Nov, 2023 11:40 IST|Sakshi

దేశమంతా క్రికెట్‌ ఫీవర్‌తో ఊగిపోతోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా మనమంతా టీమిండియా అభిమానులం అన్న చందంగా టీమిండియాకు జై కొడుతున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ మన సొంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ జాబితాలో టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా కప్‌ కొడుతుందని హీరోలు విక్టరీ వెంకటేశ్‌, తరుణ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టపడే ఈ ఇద్దరు హీరోలు..నేడు జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌మ్యాచ్‌ని  ప్రత్యక్షంగా తిలకించడం కోసం  అహ్మదాబాద్‌ వెళ్లారు. 

ఈ సందర్భంగా వెంకటేశ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘అహ్మదాబాద్‌ వెళ్తున్నా.. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో చూసిన హిట్టింగ్‌ ఇంకా మర్చిపోకముందే ఫైనల్‌ మ్యాచ్‌ వచ్చేసింది. ప్రత్యక్షంగా మ్యాచ్‌ను తిలకించడానికి అహ్మదాబాద్‌ వెళుతున్నాను. ఈసారి కప్‌ సాధిస్తాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్‌ శర్మ సారథ్యంలో ఇండియన్‌ క్రికెట్‌ టీం అన్ని విభాగాల్లో దూకుడుగా ఉంది. వరల్డ్‌ కప్‌ ప్రారంభంలో రోహిత్‌ శర్మను కలిసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాను. వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్‌ కోహ్లీని అభినందించే అవకాశం లభించింది’అని అన్నారు.

హీరో తరుణ్‌ మాట్లాడుతూ.. ‘ఈసారి వరల్డ్‌ కప్‌ కచ్చితంగా భారత్‌దే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత్‌ టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకుంటుందని అనుకుంటున్నాను. ఈ రోజు ఆటలో రోహిత్‌ శర్మ కీలకపాత్ర పోషించనున్నారు. ప్రారంభ ఓవర్లలో తను వేసే పరుగుల పునాది విజయానికి బాటలా నిలుస్తుంది. మంచి ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంద శాతం విజయానికి చేరువలో ఉన్నాం. క్రికెట్‌ చరిత్రలో మరోసారి భారత్‌ను సగర్వంగా సువర్ణాక్షరాలతో లిఖించే సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు